ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు.. పొరపాట్ల నివారణ

by Ravi |   (  Updated:2026-04-17 00:45:54  IST  )

తెలంగాణా CCA రూల్స్ 1991 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల్లో దోషారోపణ పత్రాల తయారీ, విచారణ నివేదికలో ఉండాల్సిన ముఖ్యాంశాలు, సాధారణంగా జరిగే తప్పులు వాటి నివారణపై ఈ సంక్షిప్త మార్గదర్శకం.

ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు.. పొరపాట్ల నివారణ
X

Telangana Civil Services (Classification, Control and Appeal) Rules, 1991 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు స్పష్టమైన విధి విధానాలు ఉన్నప్పటికీ, వాటిపై సరైన అవగాహన లోపంతో ఆచరణలో తప్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా దోషారోపణ పత్రాలు, విచారణాధికారి నివేదికల తయారీలో లోపాలు కారణంగా కేసులు ఆలస్యమవుతూ ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సరైన పద్ధతులపై సంక్షిప్త అవగాహన అవసరం.

సరైన అవగాహన లేక..

నిబంధనలు క్షుణ్ణంగా వివరించినప్పటికీ చాలామంది ఉద్యోగులకు, అధికారులకు సరైన అవగాహన లేక అనుసరించవలసిన పద్ధతుల్లో తప్పిదాలు జరిగి ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించినప్పుడు, ఆ లోపాలపై అధికారులను తప్పు పట్టడం జరుగుతున్నది. ఇక ఆయా కేసులపై నిబంధనల మేరకు విచారణ నిర్ధారించిన సమయంలో పూర్తి చేయకపోవడంతో ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. గతంలో విచారణాధికారి నియామకం, ప్రజెంటింగ్ అధికారి నియామకం అనుసరించవలసిన పద్ధతులు వారి విధులను గురించి వివరించడం జరిగింది. వీటిలో అతి ముఖ్యమైన దోషరూపణ పత్రాలు తయారు చేయడంలో ఉండవలసినవి, అలాగే విచారణ అధికారి నివేదికలో స్పష్టంగా ప్రస్తావించదల్చిన వాటి గురించి వివరణ.

దోషారోపణ పత్రాలు

దోషారోపణ పత్రం అనేది ఆరోపణ యొక్క ప్రాథమిక సారాంశం. ఇది అక్రమ ప్రయోజనాలు పొందడం, నాసిరకం పని అంగీకరించడం, పనిని తప్పుగా నమోదు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం లేదా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం వంటి ఆరోపణల స్వభావాన్ని సాధారణ పదాలతో వివరిస్తుంది. ఆరోపణ అనేది జరిగిన దుష్ప్రవర్తనను, ఉల్లంఘించిన నియమాలను క్లుప్తంగా, స్పష్టంగా, ఖచ్చితంగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగి తన ప్రమేయం గురించి స్పష్టమైన అవగాహన ఉండేలా సమయం, స్థలం, వ్యక్తులు, వస్తువుల వివరాలను ఇందులో తెలియజేయాలి. అందుకే ఇది అస్పష్టత లేకుండా స్పష్టంగా ఉండాలి. ప్రతి లావాదేవీ/ సంఘటన లేదా సంబంధిత సంఘటన శ్రేణికి సంబంధించి విడివిడిగా దోషారోపణ పత్రాన్ని రూపొందించాలి. ఒకే లావాదేవీ సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ తప్పులు జరిగినట్లయితే ప్రతి తప్పును ప్రత్యేకంగా పేర్కొనాలి. ఒక సంఘటనను బట్టి ప్రభుత్వ ఉద్యోగి ఒక రకమైన లేదా మరొక రకమైన తప్పుకు బాధ్యుడయ్యే అవకాశం ఉంటే ఆరోపణను ప్రత్యామ్నాయంగా (Alternate charge) పేర్కొనవచ్చు.

శిక్ష గురించి ప్రస్తావించొద్దు!

ఒకే ఆరోపణ ఆధారంగా దోషారోపణలను అనవసరంగా పెంచడం లేదా విభజించడం చేయకూడదు. నిందితుడు (Delequent/ accused) వంటి పదాలు ముందస్తు తీర్పును సూచిస్తాయి. కాబట్టి అవి తగవు.. వాటికి బదులుగా ప్రభుత్వ ఉద్యోగి (Government servant) లేదా సిబ్బంది( Employee) వంటి పదాలను ఉపయోగించాలి. ఆరోపణ పత్రంలో ప్రభుత్వ ఉద్యోగి దోషి అనే అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు. ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే తప్ప ముగింపు కాదని తెలియజేయడానికి వాక్యం that అనే పదంతో ప్రారంభం కావాలి. సాంకేతిక కారణాలు ఉంటే తప్ప ఇప్పటికే విచారణ, తీర్పు పూర్తయిన విషయానికి సంబంధించి మళ్లీ ఆరోపణ చేయకూడదు. దోషారోపణ పత్రాలలో లేదా ఆరోపణ వివరణలో విధించబోయే శిక్ష గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు.

నివేదికలో ఇవి ఉండాల్సిందే!

విచారణ అధికారి ఇచ్చే నివేదికలో విచారణ అధికారి నియామకానికి సంబంధించిన వివరాలు.. విచారణ జరిగిన తేదీలు, ప్రదేశాల గురించి ప్రస్తావించాలి. మోపబడిన అభియోగాలు (artcicles of charge) సదరు దుష్ప్రవర్తన లేదా తప్పుడు ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణల వివరాలు (statement of imputations). ప్రతి ఆరోపణ అంశంపై కనుగొన్న విషయాలు, అందుకు గల కారణాలు తప్పనిసరిగా పొందుపరచాలి!

-మనోహర్ రావు చిలప్పగారి,

రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

96406 75288

Next Story