- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబినేట్ విస్తరణలో మరోసారి నిరాశే.. మేం ఓటు బ్యాంకుగానే మిగిలిపోవాలా?
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ముందడుగు.. అయితే ఈ సంతోషకరమైన

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ముందడుగు.. అయితే ఈ సంతోషకరమైన పరిణామం వెనుక కొన్ని అసహజ, అసమానమైన నిర్ణయాలు కూడా చోటు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో కూడా ముస్లింలకు పూర్తి నిరాశనే మిగిల్చింది. ఇప్పటికే మొత్తం 15 మంది మంత్రులు నియమితులయ్యారు. వీరిలో ముస్లిం సామాజిక వర్గం నుండి ఒక్కరికీ అవకాశం కల్పించకపోవడం అత్యంత విచారకరం..
ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరూ గెలవలేదు కనుక మంత్రి పదవులు ఎలా ఇవ్వాలి? అనే వాదన ముందుకు తేవచ్చు. కానీ 2014లో ప్రత్యేక తెలంగాణ మొదటి కేబినెట్ ఏర్పాటైన వేళ కూడా కేసీఆర్‌కు ఇదే సమస్య ఎదురైంది. మహమూద్ అలీ అప్పుడు ఎమ్మెల్యే కాదు, అయినప్పటికీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం మంత్రిత్వ శాఖను కూడా ఇచ్చారు. ఈ వెసులుబాటు రాజ్యాంగ బద్ధంగా అందుబాటులో ఉన్నప్పుడు 'ఎవరూ లేరు' అన్న కారణం సహేతుకం కాదు.
పదవి హోదా కాదు.. కానీ
తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా దాదాపు 14 శాతం. అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కేసీఆర్ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా, బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం ఫలితంగా ముస్లిం, ముస్లిమేతర మేధావి వర్గం, ధార్మిక సంస్థలు, మహిళలు, యువత అందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు తిరుగులేని మద్దతు ప్రకటించారు. కానీ గెలిచాక కాంగ్రెస్ పార్టీ ముస్లిం వర్గాన్ని విస్మరించిదనిపిస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం అనేది కేవలం ఏదో ఒక హోదాకు పరిమితమయ్యే అంశం కాదు. అది పాలనలో భాగస్వామ్యం అయ్యే అవకాశం. పాలనా నిర్ణయాలలో పాలు పంచుకునే స్థాయికి పదవులు కల్పించినప్పుడే, ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుంది.
ముస్లింల ఓట్లు మాత్రమే కావాలా..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, రెవెన్యూ మినిస్టర్ వంటి కీలక పదవులు మైనారిటీ వర్గానికి దక్కాయి. అవి అలంకార ప్రాయమైన పదవులని అనవచ్చు. అది వేరే చర్చ. కానీ మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌లో కూడా భారీ కేటాయింపులే జరిగాయి. రెండు వందలకు పైగా మైనారిటీ గురుకులాలూ ఏర్పరచారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అలా చెప్పుకోడానికి పెద్ద పెద్ద పద్దులేమీ కనబడటం లేదు. ఇది ఆ వర్గం ప్రజలలో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ఒకవేళ రాజకీయ పార్టీలు మాకు ముస్లింల ఓట్లు మాత్రమే కావాలి, నాయకత్వ స్థాయి, పదవులు మాత్రం ఇవ్వమన్న రీతిలో ప్రవర్తిస్తే, అది మైనారిటీలకే కాదు, ప్రజాస్వామ్యానికీ నష్టమే.
రాజ్యాంగ విలువలు ప్రశ్నార్థకం
ఈ పరిస్థితి తెలంగాణకే ప్రత్యేకమైనది కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ముస్లింల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. 18వ లోక్‌సభలో మొత్తం 543 మంది సభ్యులుంటే, ముస్లింలు కేవలం 24 మంది ఉన్నారు. అంటే సుమారు 4.4% మాత్రమే. అభ్యర్థుల ఎంపికలో ముస్లింలను విస్మరించడమే ఇందుకు నిదర్శనం. ఇది కేవలం రాజకీయ పతనం మాత్రమే కాదు, అది ఆ సామాజిక వర్గ నమ్మకాన్ని వమ్ము చేయడం కూడా..! ముస్లిం సమాజం ప్రతిసారీ తన బాధ్యతను గుర్తెరిగి ఓటు హక్కును వినియోగిస్తోంది. కానీ ప్రతిఫలంగా పాలనా బాధ్యతల్లో పాలు పంచుకోలేని నిస్సహాయతకు గురవుతోంది. ఈ పరిస్థితి మైనారిటీల పట్ల అన్యాయం మాత్రమే కాదు, సమానత, న్యాయం అనే రాజ్యాంగ విలువలనే ప్రశ్నార్థకం చేసే ధోరణి.
ఓటు బ్యాంకుగానే మిగిలిపోం..
ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ స్పందించి మిగిలిన చివరి మంత్రివర్గ విస్తరణలో అయినా ముస్లింలకు గౌరవప్రదమైన పదవులు కల్పించాలి. ముస్లింలను పాలనలో భాగస్వామ్యాన్ని కల్పించడం కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత. ఎందుకంటే, ఇక ముస్లింలు మౌనంగా ఓటు బ్యాంకుగానే మిగిలిపో వడానికి సిద్ధంగా లేరు. ఈసారి హక్కుల సాధనకు, రాజకీయ ప్రాతినిధ్యానికి అవసరమైన పోరాటానికి దారి తీయవచ్చు. రాజకీయ పార్టీలు ఈ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకొని అభివృద్ధి, సమానత, న్యాయమనే భావజాలాన్ని కేవలం మాటల్లో కాకుండా, చేతల్లోనూ నిబద్ధతతో అమలు చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
యండి. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్టు
99125 80645






