కనుమరుగవుతున్న కళలు..!

by Ravi |   (  Updated:2025-01-17 00:31:11  IST  )

భారతదేశం సంప్రదాయ జానపద, గిరిజన కళలకు పుట్టినిల్లు. ఈ జానపద కళలు మూడువేల సంవత్సరాలకు పూర్వం నుంచే తరం

కనుమరుగవుతున్న కళలు..!
X

భారతదేశం సంప్రదాయ జానపద, గిరిజన కళలకు పుట్టినిల్లు. ఈ జానపద కళలు మూడువేల సంవత్సరాలకు పూర్వం నుంచే తరం నుండి మరో తరానికి అందిస్తూ వచ్చారు. జంతువులు మానవులతో కూడిన రాతి చిత్రాలు భారతీయ తొలి కళగా చెప్పవచ్చు. తొలి చిత్రాలు పదివేల సంవత్సరాల కిందటివి అని చెబుతున్నారు.

సింధులోయ నాగరికతలో బంగారు, టెర్రకోట, రాతి బొమ్మలు నృత్య భంగిమల్లో కనిపిస్తాయి. అత్యంత ప్రసిద్ధి చెందిన మొహంజదారో కాంస్య విగ్రహం అసాధారణమైన పనితనాన్ని చూపిస్తుంది. అపురూపమైన, అద్వితీయమైన భారతీయ కళలు సైతం కనుమరుగైపోతున్నాయి. ప్రాచీనమైన ఈ భారతీయ కళల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కళలు ప్రజల జీవితాలతో, ఆధ్యాత్మిక భావనలతో అనుసంధానించబడ్డాయి. అనేక జంతు వృక్ష జాతులతో పాటుగా కళలు కూడా కనుమరుగైతే మానవ మనుగడ ప్రశ్నార్థకమైనట్లే. అతి వేగంగా సాగిపోతున్న ఈ కాలంలో కళల్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

బండ రాళ్లకు సైతం ప్రాణం పోసి..

మనసులోని భావాన్ని ప్రకటించటానికి మానవుడు అనేక మార్గాలు అన్వేషించాడు. రకరకాల కళల్ని కనుగొన్నాడు. మానవ హృదయానందం కోసం, సౌందర్యారాధన కోసం ఎన్నో రకాల కళల్ని సృష్టించాడు. ఆదిమ మానవుడు కూడా రాతిపై తన మనసులోని భావాలకు రూపమిచ్చాడు. తను నివసించే రాతి గుహల పైనా, గోడల మీదా గీతలు గీసి చిత్రలేఖనానికి ఆద్యుడైనాడు. ఇలా ఏర్పడిన కళలను ప్రాచీన భారతదేశంలో 'చతుష్టష్టి కళలు' అని నిర్వదించారు. మానవులు తమ ఆనందానికై అనేక కృత్యములు చేస్తూ వచ్చారు. కొన్ని సౌందర్య దృష్టితోనూ కొన్ని ఉపయోగించుకునే వస్తువులుగానూ తయారు చేస్తూ వచ్చారు. ఈ 64 కళలలో కొన్నింటిని సామాన్య కళలని, మరికొన్నింటిని లలిత కళలని అంటున్నారు. ఇంత కఠోరమైన శ్రమ, ధనం కూడా కేవలం సౌందర్యారాధన కోసమే. తన మనస్సును తృప్తి పరచుకోవడానికి బండ రాళ్ళకు సైతం ప్రాణం పోసి నిలబెట్టాడు.

భారతీయ కళలపై విదేశీ ప్రభావాలు..

భారతీయ సంస్కృతిలో ఈ 64 కళల గురించి ఒక్కో గ్రంథంలో ఒక్కో విధంగా వర్గీకరించబడి ఉన్నాయి. ఈ 64 కళల్ని తెలియజేస్తూ శ్లోకం ఒకటి ఉన్నది. "వేద వేదాంగేతి హాసాగమ.. అంటూ మొదలయ్యే ఇందులో వేదాల మొదలు నాటకం, గానం, వంటలు, చిత్రకళ వంటి కళలతో పాటుగా దొంగతనం, పరులకు హాని కలిగించే మరణం కూడా కళలుగానే పేర్కొన్నారు. భారతీయ కళ సామాజిక, నైతిక, మెటాఫిజికల్ భావనలను కలిగి ఉన్నది. భారతీయ కళలపై విదేశీ ప్రభావాలు సాంస్కృతిక ప్రభావాలు, మారుతున్న రాజవంశాలు వంటి అనేక వైవిధ్య ప్రభావాలున్నాయి. ఇక చిత్రలేఖనం, శిల్పం, సంగీ తం, నృత్యం, కవిత్వం అనే ఐదు కళలను లలిత కళలు అంటారు. సనాతన ధర్మంలో నిబిడీకృతమై ఉన్న దివ్య శక్తి కళలలో దాగి ఉంటుంది. లలిత కళలు మానవునకు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలగజేస్తాయి. కళ అబ్బా లంటే మనిషికి శ్రద్ధ ఓర్పు చాలా అవసరం కాబట్టి క్రమశిక్షణ అవసరం అవుతుంది. కళలో సనాతన ధర్మం ప్రాభవం అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి సంస్కృతి సంప్రదాయాలు, దేవతలపై ఆరాధనా భావం ఉంటుంది.

ఒత్తిడి తగ్గాలంటే..

కళ ద్వారా జీవితంలోని సమస్యలను తేలికగా దాటగలిగే నైపుణ్యం అలవడితే కళాభ్యాసం కళా ప్రావీణ్యం సఫలీకృతం అయిందని భావించవచ్చు. ఇందుకు ఫైన్ ఆర్ట్స్ పేరిట విశ్వవిద్యాలయాల్లో కోర్సులు అందిస్తున్నారు. ఒకనాడు కళకు అంకితం అయితే జీవనోపాధి లేక పేదవారుగా మిగిలేవారు. కానీ ఆధునిక కాలంలో సాంకేతి క పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాటిలో కష్టం తగ్గింది. ఉపాధి అవకాశాలూ పెరిగాయి. లలితకళా రంగంలో సృజనాత్మకత, అనుభవం, వ్యక్తిగత ఆసక్తి, స్వయంప్రేరణ, మార్కెట్‌పై అవగాహన మొదలైన వాటిపై పట్టు ఉంటే బాగా రాణించవచ్చు. ఇక యంత్ర సమానులుగా పనిచేస్తూ మానవులు హృదయాన్ని కోల్పోయి మరబొమ్మగా మారుతున్నారు. అనేక ఒత్తిడుల మధ్య నలిగిపోతున్నాడు. విసుగు, చిరాకు దరి చేరకుండా ఉండా లంటే కళల్ని ప్రేమించాలి, స్పృశించాలి.

డా. కందేపి రాణి ప్రసాద్

98661 60378

Next Story