- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్‌లో కోర్టు ఉత్తర్వు.. బయటపడిన మరో డిజిటల్ మోసం!
‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు నేడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. నేరగాళ్లు పోలీసు, సీబీఐ, ఈడీ అధికారుల ముసుగులో డీప్‌ఫేక్ వీడియో కాల్స్, పోలీసు అధికారుల ముసుగులో

‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు నేడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. నేరగాళ్లు పోలీసు, సీబీఐ, ఈడీ అధికారుల ముసుగులో డీప్‌ఫేక్ వీడియో కాల్స్, పోలీసు అధికారుల ముసుగులో ప్రజలను బెదిరించి నేరగాళ్లు డబ్బు దోచుకోవడమే కాక ప్రస్తుతం నకిలీ కోర్టు ఉత్తర్వులు సైతం సృష్టిస్తున్నారు. వీరి దాడులు కేవలం ఆర్థిక నష్టం కాకుండా, ప్రజా విశ్వాసంపై దాడిగా మారాయి. ఈ సమస్యను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం న్యాయవ్యవస్థ మేల్కొలుపునకు సంకేతం.
రోజుకు వేలల్లో నమోదవుతున్న ఈ మోసాలు కేవలం వ్యక్తిగత విషాదాలు కావు. ప్రజల అజ్ఞానంతో పాటు అప్రమత్తత లోపాన్ని ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తు న్నారు. ఈ సమస్య తీవ్రతను, గుర్తించిన సుప్రీంకోర్టు ఇటీ వల ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి, ప్రభావాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీ సులు జారీ చేయడమే న్యాయవ్యవస్థ మేల్కొలుపునకు ప్రతీక.
న్యాయమూర్తుల ఉత్తర్వులనే సృష్టించి..
చట్టం పట్ల పౌరులకు ఉన్న గౌరవాన్ని ఆయుధంగా మార్చుకొని నకిలీ ధ్రువపత్రాలు, నకిలీ కోర్టు ఉత్తర్వులతో పౌరుల జీవితకాల పొదుపును లూటీ చేయడం అత్యంత హేయమైన చర్య. హర్యానాలోని అంబాలాలో ఒక వృద్ధ దంపతులను నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బెదిరించి రూ. 1.05 కోట్లు కాజేసిన ఉదంతంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ‘న్యాయమూర్తుల నకిలీ సంతకాలతో కూడిన ఉత్తర్వులను సృష్టించడం వ్యవస్థ గౌరవంపై ప్రత్యక్ష దాడిగా పరిగణించబడుతుంది’ అని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేరాన్ని కేవలం 'సాధారణ మోసం'గా చూడలేమని, ఇది న్యాయ వ్యవస్థ పునాదులనే కదిలించి, ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే తీవ్రమైన వ్యవస్థాగత వైఫల్యానికి సంకేతంగా పరిగణించాలి.
ఇది అంతర్జాతీయ సమస్య..
సమస్య పాన్-ఇండియా స్వభావం దృష్ట్యా, దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించేందుకు సుప్రీంకోర్టు మొగ్గు చూపడం ఈ నేరాలకు ఉన్న వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను తెలియజేస్తుంది. ఈ నేరగాళ్లు కేవలం వాయిస్ ఓవర్లతో ఆపడం లేదు, వారు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి, న్యాయమూర్తులు లేదా పోలీసు అధికారుల ముఖాలను సృష్టించి, వీడియో కాల్స్‌లో నిజమైన నిర్బంధాన్ని సృష్టిస్తున్నారు. ఒకే ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరిపితేనే నేరాల వెనుక ఉన్న దేశవ్యాప్త, అంతర్జాతీయ ముఠాలను నిర్మూలించవచ్చు. ఈ ముఠాల వెనుక మయన్మార్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోని అక్రమ సైబర్ సెంటర్లు ఉన్నాయని అటార్నీ జనరల్ నివేదించారు. యువతను ఉద్యోగాల పేరుతో విదేశాలకు రప్పించి, వారి పాస్‌పోర్ట్‌లు లాక్కొని, వారిని 'సైబర్ బానిసలు'గా మార్చి ఈ నేరాలకు పాల్పడటం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన. ఈ ముఠాల ఏకీకృత దాడిని ఎదుర్కోవాలంటే, దర్యాప్తు సంస్థల మధ్య పటిష్టమైన సమన్వయం దేశాల మధ్య తక్షణ అంతర్జాతీయ సహకారం తప్పనిసరి.
ఇది కేవలం డేటా ఉల్లంఘన కాదు..
దేశంలోని ప్రస్తుత చట్టాలకు ఈ తరహా అధునాతన మోసాలను ఎదుర్కొనే సామర్థ్యం ఏ మాత్రం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000, కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలు సాంప్రదాయ మోసం, ఫోర్జరీ అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. కానీ, నకిలీ కోర్టు ఉత్తర్వులు, డీప్‌ఫేక్ వీడియో కాల్స్ ద్వారా బెదిరించే ఏఐ ఆధారిత మోసాలు ఈ పాత చట్టం చట్రంలో ఇమడవు. ఐటీ చట్టంలోని సెక్షన్లు కేవలం సైబర్ స్పేస్‌లో జరిగే డేటా ఉల్లంఘనలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ, ఇక్కడ జరిగిన నేరం కేవలం డేటా ఉల్లంఘన కాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థ హోదాను తప్పుగా సూచించడం. ఈ సంస్థాగత విశ్వాసాన్ని ధ్వంసం చేసే చర్యలను కేవలం వ్యక్తిగత మోసాలుగా కాక, వ్యవస్థల చట్టబద్ధతపై జరిగిన దాడిగా పరిగణించాలి. కఠినమైన చట్టపరమైన సవరణలు తక్షణమే రూపొందించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాక, మోసాలు జరిగినప్పుడు బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా, విధానాలను వెంటనే అమలు చేయాలి.
పౌరుల జాగ్రత్త ఎంతో అవసరం!
ఈ డిజిటల్ దాడికి శాశ్వత సమాధానం లభించాలంటే, అది ఉమ్మడి కృషి ద్వారానే సాధ్యం. ఈ నేరాలను అరికట్టడంలో ఎవరి బాధ్యత? అన్నది జవాబులేని ప్రశ్నగా మిగిలింది. ఈ సమస్యకు పరిష్కారం రాజ్యం, న్యాయ వ్యవస్థ, పౌరుడి ఉమ్మడి ప్రయత్నం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం తక్షణ సహాయం కోసం 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను బలోపేతం చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరాలపై అవగాహన ఉన్న కనీసం ఒక అధికారి ఉండేలా చూడాలి. సైబర్ ముఠాలపై నిఘా పెంచడానికి జాతీయ సైబర్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఏర్పాటును వేగవంతం చేయాలి. ఇక పౌరులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారికి కోర్టు/పోలీసు అధికారులమని చెప్పుకునే వ్యక్తులు డబ్బు అడిగినా, వాట్సాప్ కాల్స్‌లో అరెస్ట్ వారెంట్లు చూపించినా, అనుమానాస్పదంగా అనిపించినా వారు నిజమైన అధికారులు కారని నమ్మాలి. వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా, ప్రామాణికతను తక్షణమే ధృవీకరించుకోవాలి.
ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకాలి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేసి, సీబీఐ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తేనే ఈ 'డిజిటల్ అరెస్ట్' భూతానికి అంతం పలకగలం. లేకపోతే, ఈ నేరగాళ్లు మన వ్యవస్థపై, ప్రజల విశ్వాసంపై నిరంతర దాడి చేస్తూనే ఉంటారు.
-డా. కట్కూరి
సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణుడు
80192 01820






