తెలుగు సినిమాకు ఆ విషయంలో సోయిలేదా?

by Disha edit |
తెలుగు సినిమాకు ఆ విషయంలో సోయిలేదా?
X

సినిమా రంగంలోని ప్రముఖుల ఉపరితల జీవిత చరిత్రలు మాత్రమే అందుబాటులో వున్నాయి. హెచ్ఎం రెడ్డి గురించో, సి. పుల్లయ్య గురించో వెతికితే ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ మనకు లభించే వివరాలు అతి తక్కువ. 1930-40 ప్రాంతంలో నిర్మితమైన సినిమాల వివరాలు, ఫోటోలు లభించే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మినహా మిగతా సినిమాల ప్రింట్ల ఆధారాలే కనిపించవు. ఎన్టీ రామారావు, నాగేశ్వర్‌రావు లాంటి వారివి కూడా సుప్రసిద్ధ సినిమా వివరాలే లభిస్తాయి తప్ప, వారు నటించిన వందలాది సినిమాల వివరాలు ఫోటోలు లభించవు. అలాంటప్పుడు హరనాథ్, కాంతారావు లాంటి సినిమాల వివరాలు, ప్రింట్లు లభించే అవకాశమే లేదు. సినిమాలను భద్రపరచాలని, వివరాలను రికార్డ్ చేయాలని ఎవరూ ఆలోచించకపోవడంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

తెలుగు సినిమా రంగం వ్యాపారానికి, వర్తమానానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. బాక్సాఫీసు విజయాలకు మాత్రమే అక్కడ చోటుంటుంది. విలువలకు, వాస్తవాలకు, గత వైభవాలకూ స్థానం లేదు. దేశ చరిత్రనో, ప్రాంతీయ చరిత్రనో కాదు, తమకు తిండి పెడుతున్న సినిమా రంగ చరిత్ర పట్ల కూడా అక్కడ సోయి కరువు. తొలినాటి అపురూప సినిమాల ప్రింట్ల పట్ల కానీ, వాటి వాస్తవిక చరిత్ర విషయం కానీ తెలుగు సినిమాకు పట్టని స్థితి. డిజిటల్ యుగం వచ్చిన తర్వాత నిబద్ధత వుంటే గతాన్ని పరిరక్షించడం ఎంతో వీలవుతున్నది. ఆ అనుకూలతను ఉపయోగించుకోవాలనే ఆలోచన తెలుగు సినిమా మంచిని కోరేవాళ్లు చేయాలి. ఎందుకంటే, గతం పునాదుల పైననే వర్తమానమైనా, భవిష్యత్తయినా గొప్పగా రూపొందుతుంది.

సినిమా ప్రభావంతమైన దృశ్య మాధ్యమం. తెలుగు సినిమా చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల ప్రణాళికాబద్ధంగా నడవకపోయినప్పటికీ, ఆయాకాలాల తెలుగు ప్రజల జీవితాలను, జీవన విధానాలనూ 'దృశ్య' బద్ధం చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, సినిమా సమాజాన్ని అనుకరిస్తుంది, దశాబ్దాల తెలుగు సినిమాలను చూసినప్పుడు అవి ప్రజలను, ప్రజలు సినిమాలను పరస్పరం ప్రభావితం చేసుకున్నాయనే విషయం అర్థమవుతుంది. అవి ఎంతో కొంత సామాజిక, రాజకీయ అంశాలను ప్రతిబింబించాయి. అందుకే, ఎన్టీఆర్ నాయకుడిగా మారి ముఖ్యమంత్రి కావడం సాధ్యమైంది. మన దేశంలో సినిమా, క్రికెట్ రెండూ ప్రజల జీవితాలలో అంతర్భాగమైపోయాయి. అనేక దశాబ్దాలుగా ఆ రెండూ భారతీయులను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. టీవీ, ఇంటర్నెట్ లాంటి ఆధునిక సాంకేతికత వచ్చిన తర్వాత వాటి ప్రభావం మరింతగా పెరిగింది.

ప్రభుత్వాలు కూడా అంతే

సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న దేశం మనది. అధిక సినిమాలను, అధిక సంఖ్యలో చూస్తున్నవారిగా భారతీయులకు పేరున్నది. ఆర్థికంగా చూసినా భారతీయ సినిమా రంగం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. భాషా సినిమాల గణాంకాలను చూస్తే హిందీ తర్వాత ఎక్కువ సినిమాలు నిర్మాణమవుతున్నది తెలుగులోనే. ఆర్థికంగా చూసినా, హిందీ, తమిళం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించే సినిమాలు కూడా తెలుగువే. వ్యాపారాత్మకంగా మెరుగైన స్థానంలో ఉన్న తెలుగు సినిమా రంగం చరిత్ర నిర్మాణం పట్ల ఎవరూ పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించవు.

దశాబ్దాలుగా నిర్మితమైన సినిమాల పరిరక్షణ పట్ల కూడా తెలుగు సినిమారంగం ప్రముఖులకు సోయి లేకపోవడం అత్యంత విషాదం. ఫలితంగా అనేక గొప్ప సినిమాలు అందుబాటులో లేకుండా పోయాయి. లాభనష్టాలు చూసుకొని, చేతులు దులిపేసుకోవడం అలవాటైన సినిమా ప్రముఖులకు చరిత్ర పట్ల పట్టింపు లేకుండా పోయింది. అపురూప సినిమాలను పరిరక్షించి, వాటి అర్కయివ్స్ ఏర్పాటు చేయాలనే దాని మీద దృష్టి పెట్టకపోవడంతో అవి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రభుత్వాలు కూడా అందుకు భిన్నంగా ఏమీ ప్రవర్తించలేదు. స్టూడియోలు, థియేటర్లు కట్టుకోవడానికి నిధులు, అప్పులు, సబ్సిడీలు ఇస్తూ వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలైనా, ఇప్పటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలయినా అపురూప కళాఖండాల భాండాగారాల ఏర్పాటుకు కనీస ప్రయత్నం కూడా చేయలేకపోయాయి.

ఎవరి వివరాలూ లేవు

సినిమా రంగంలోని ప్రముఖుల ఉపరితల జీవిత చరిత్రలు మాత్రమే అందుబాటులో వున్నాయి. హెచ్ఎం రెడ్డి గురించో, సి. పుల్లయ్య గురించో వెతికితే ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ మనకు లభించే వివరాలు అతి తక్కువ. 1930-40 ప్రాంతంలో నిర్మితమైన సినిమాల వివరాలు, ఫోటోలు లభించే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మినహా మిగతా సినిమాల ప్రింట్ల ఆధారాలే కనిపించవు. ఎన్టీ రామారావు, నాగేశ్వర్‌రావు లాంటి వారివి కూడా సుప్రసిద్ధ సినిమా వివరాలే లభిస్తాయి తప్ప, వారు నటించిన వందలాది సినిమాల వివరాలు ఫోటోలు లభించవు. అలాంటప్పుడు హరనాథ్, కాంతారావు లాంటి సినిమాల వివరాలు, ప్రింట్లు లభించే అవకాశమే లేదు. సినిమాలను భద్రపరచాలని, వివరాలను రికార్డ్ చేయాలని ఎవరూ ఆలోచించకపోవడంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

నిర్మాతలు సినిమాలు ఆడితే రంగంలో నిలబడ్డారు లేదా తిరిగి వెళ్లిపోయారు. నిలబడినవారికి కూడా వాటి పరిరక్షణ పట్ల ఉదాసీనంగానే ఉండిపోయారు. కాలక్రమంలో నిర్మాతలూ పోయారు, పంపిణీ వాళ్లూ పోయారు. ల్యాబులూ పోయాయి. ప్రింట్లే కాదు నెగెటివ్‌లూ పోయాయి. సినిమాలు దేశానికి, ప్రజలకు ఓ గొప్ప జ్ఞాపకం. ప్రజల జీవన సరళికి, సంస్కృతికి అద్దం పడతాయి. ఆయాకాలాల జన జీవన పరిస్థితిని రికార్డ్ చేస్తాయి. ప్రజల జీవన విధానాలనూ, ఆహార, ఆహార్య పద్ధతులనూ ప్రభావితం చేస్తాయి. భావి యువతకు దేశ చరిత్రను చూపించాల్సి వచ్చినప్పుడు సినిమాలూ, డాక్యుమెంటరీలు గొప్ప ఆధారాలవుతాయి. డిజిటల్‌ సినిమాల నిర్మాణం కొనసాగుతున్న స్థితిలో పాత సినిమాలను భద్రపరిస్తే అపురూప కళాసంపదను భావి తరాలకు అందించినట్టు అవుతుంది.

కొంత ప్రయత్నం జరిగినా

కేంద్ర ప్రభుత్వం 1984 లో పుణేలో 'ఫిల్మ్ అర్కయివ్స్ ఆఫ్ ఇండియా'ను స్థాపించింది. సినిమా ప్రింట్లను సేకరించడం, భద్రపరచడం, అధ్యయనం కోసం పంపిణీ చేయడం దాని కర్తవ్యాలు. అది సినిమా ప్రింట్లతోపాటు పోస్టర్లు, స్టీల్స్, స్లయిడ్స్, స్క్రిప్టులు, ఎల్‌పీ రికార్డులు, సినిమా పాటల పుస్తకాల సేకరణ మొదలు పెట్టింది. డైరెక్టర్‌గా పీకే నాయర్ అద్భుత సేవలు అందించారు. ప్రపంచస్థాయిలో సెల్యూలాయిడ్ మాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆర్కయివ్స్‌లో 1 లక్షా 30 వేల ఫోటోలు, 17 వేల పోస్టర్లు, 12 వేల పాటల పుస్తకాలు, 25 వేల సినిమా గ్రంథాలూ ఉన్నాయి. రెండు లక్షల ఫిల్మ్ రీళ్లు భద్రపరిచే వసతులు ఉన్నాయి. ఎన్నో అపురూప సినిమాల వివరాలు ఉన్నాయి.

నాయర్ పదవీ విరమణ, నిధుల కొరతతో ఆటంకం ఏర్పడింది. ఇటీవల చేపట్టిన 'నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్' కార్యక్రమంలో భాగంగా ప్రాచీన అపురూప సినిమాల డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పుణే, ముంబయి, హైదరాబాద్, గువాహతీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నయి, తిరువంతపురంలో సమావేశాలు ఏర్పాటు చేసి సినిమా ప్రతినిధులతో చర్చించారు. జాతీయస్థాయిలో యత్నాలు కొనసాగుతున్నప్పటికీ తెలుగు సినిమాకు సంబంధించి అలాంటి ప్రయత్నాలు లేవు. ఆ రంగంపైన ఆధారపడి ఎదిగిన వారు, సంస్థలూ ముందుకొచ్చి తెలుగు సినిమాల పరిరక్షణకు నడుం బిగించాలి. పునరుద్ధరించిన సినిమాలతో ఏడాదికోసారి ఇటలీలో లాగా ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయవచ్చు.

వారాల ఆనంద్

9440 501281



Next Story

Most Viewed