ధరణి రద్దే పరిష్కారం

by Disha edit |
ధరణి రద్దే పరిష్కారం
X

ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు తమదే అని నిరూపించుకునేందుకు రైతులు పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కడ భూమి హక్కులు కోల్పోతామేమోనన్న ఆందోళనతో పలువురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ధరణి దారుణాలపై ఆలస్యంగా మేల్కొన్న సర్కారు ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఙచ్చింది. వీటీకి స్థానిక ఎమ్మెల్యేలే నేతృత్వం వహించాలని కేసీఆర్ సూచించారు. ఆయన ఆదేశాలు సమస్యను మరింత జఠిలం చేసే విధంగా ఉన్నాయి. చాలా నియోజకవర్గాలలో అధికార పార్టీ నాయకులపైనే భూకబ్జా, సెటిల్మెంట్ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే సదస్సులు ఏ మేరకు పారదర్శకంగా సాగుతాయో అర్థం చేసుకోవచ్చు.

భూపరిపాలనా రంగంలో అతిపెద్ద సంస్కరణ ద్వారా భూరికార్డులను డిజిటలైజ్ చేసి, భూ లావాదేవీలలో అక్రమాలకు తావు లేకుండా ఉండాలని 'ధరణి'ని తెచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది. కానీ, వాస్తవానికి 'కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా'తయారైంది ధరణి పోర్టల్ పరిస్థితి. కేసీఆర్ సర్కారు అనాలోచిత నిర్ణయం, ప్రణాళిక లోపంతో రైతులు తమ సొంత భూములు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

వారిపైనే ఆరోపణలు ఎక్కువ

భూ రికార్డుల ప్రక్షాళన కోసమంటూ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యల పుట్టగా మారినా, పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ అసంబద్ధ విధానం కారణంగా భూమి కొనుగోలుదారుల వివరాలు పోర్టల్ లో నమోదు కాలేదు. పాత యజమానులనే, భూస్వాములనే యజమానులుగా చూపుతున్నారు. 1.50 కోట్ల ఎకరాల భూములను రికార్డులలోకి ఎక్కించామని గొప్పలు చెప్పిన ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు ఒక అంచనా ప్రకారం సుమారు 50 లక్షల ఎకరాలు వివాదాలలో చిక్కుకున్నాయి. ఇంతటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు ఉపక్రమించింది. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చూపుతామని మాటలు చెబుతోంది.

ధరణిలో ఒకరి భూమి మరొకరి పేరు మీద రిజిస్టర్ అయినట్టు చూపుతోంది. భూమి విస్తీర్ణంలో తేడాలు,పేద రైతులకు ప్రభుత్వం పంచిన అసైన్ ల్యాండ్స్ లాక్కుంది. కేసీఆర్ పాలనా తీరు చూస్తుంటే భూస్వామ్య వ్యవస్థను ప్రోత్సహించడానికి ధరణి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి ఇప్పుడు తమదే అని నిరూపించుకునేందుకు రైతులు పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కడ భూమి హక్కులు కోల్పోతామేమోనన్న ఆందోళనతో పలువురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ధరణి దారుణాలపై ఆలస్యంగా మేల్కొన్న సర్కారు ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఙచ్చింది. వీటీకి స్థానిక ఎమ్మెల్యేలే నేతృత్వం వహించాలని కేసీఆర్ సూచించారు. ఆయన ఆదేశాలు సమస్యను మరింత జఠిలం చేసే విధంగా ఉన్నాయి. చాలా నియోజకవర్గాలలో అధికార పార్టీ నాయకులపైనే భూకబ్జా, సెటిల్మెంట్ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే సదస్సులు ఏ మేరకు పారదర్శకంగా సాగుతాయో అర్థం చేసుకోవచ్చు.

రైతుల పక్షాన ఉంటూ

ధరణి పోర్టల్ వలన అన్నదాతల ఆవేదన తెలిపేందుకు ఒక ఉదాహరణ సదాశివనగర్ మండలం యాచారం తండాలో 340 మంది గిరిజన రైతులకు చెందిన 420 ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కుంది. ధరణికి ముందు భూములన్ని రైతుల పేరు మీద ఉండి రైతుబంధు, రుణాలు కూడా తీసుకున్నారు. కానీ, ధరణి తర్వాత వారి పేర్లు మాయమయ్యాయి. వాటిని ధరణి అటవీ భూమిగా చూపుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని కొన్ని నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. కానీ, వారికి స్పందన లేదు. ఈ బాధితులకు కాంగ్రెస్ అండగా నిలిచి టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ గా నేను రైతులకు మనోధైర్యం కల్పించి వారికి సహకారం అందించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించాను.హైకోర్టు విచారణ చేపట్టి యాచారంలో 48,15/15 సర్వే నంబర్లలోని 420 ఎకరాలు భూములపై స్టే విధించింది. ఆ భూముల నుంచి రైతులను వెళ్ళగొట్టోద్దని స్పష్టం చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

యాచరంలోనే కాదు రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఇదే పరిస్థితి. అందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో కాలయాపన చేయడం మానుకుని భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి. పొరపాట్లను సరిదిద్దేందుకు అఖిలపక్షాల నేతలు, రెవెన్యూ, ఐటీ నిపుణులతో సమావేశం నిర్వహించాలి. సలహాలు, సూచనలు స్వీకరించి, సమగ్ర విధానం రూపొందించాలి. లేదంటే పాత పద్ధతినే కొనసాగించాలి. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన ప్రజా పోరాటాలకు, న్యాయ పోరాటాలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి తీరుతాం.

మదన్‌మోహన్

టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్

97046 17343

Next Story