కాలం ఒడిలో తెలంగాణ సింగారం

by Ravi |   (  Updated:2025-10-07 01:00:58  IST  )

గతంలో తెలంగాణ పల్లె ప్రజలు బొంబాయికి వలసలు వెళ్లి, ఎన్నో ఆగడాలకు, హత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. కానీ ప్రస్తుతం బొంబాయి నుంచి

కాలం ఒడిలో తెలంగాణ సింగారం
X

గతంలో తెలంగాణ పల్లె ప్రజలు బొంబాయికి వలసలు వెళ్లి, ఎన్నో ఆగడాలకు, హత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. కానీ ప్రస్తుతం బొంబాయి నుంచి అమ్మ ఒడి లాంటి హైదరాబాద్‌కి స్వరాష్ట్ర ప్రజలే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా జీవన మనుగడకు వస్తున్నారు. కాలం ఒడిలో తెలంగాణ గతాన్ని సింగరించుకుంటోంది. ఇక భవిష్యత్ అంతా తెలంగాణదే.

నోరు మంచిదైతే వూరు మంచిదైతది అంటారు. కానీ నోరు మంచిదైనా ఊరు మంచిది కాలే తెలంగాణకు. సీతను శమ పెట్టిన తీరే శమవడ్డది తెలంగాణ. అమాయకురాలైన ఆడపిల్లను ( తెలంగాణ) కొంటె పిల్లాడు అయిన ఆంధ్రాకి ఇస్తున్నాం. ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చు అని వియ్యం అందించాడు నెహ్రూ. నాటి నుంచి వంటింటి కుందేలై, సమస్త సంపదను, శ్రమను ఆంధ్రా అబ్బాయికి వడ్డించింది తెలంగాణ. అయినా తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని అపహాస్యం చేశారు. బంధించి కొడితే పిల్లి కూడా పులైతది అన్నట్లు, అణచి వేసిన స్త్రీ తిరగబడ్డది. నువ్వు సింగులు సెక్కితే సాలు... సింహం పరుగులు తీయు... తోక ముడుసుకొని ఉరుకూ... అని గద్దర్ పాడిన పాటలోని పదాలు నిజమైయ్యాయి.

చిన్న సినిమాలే యాసకు ఊపిరి..

కమెడియన్ల ద్వారా, రౌడీల ద్వారా తెలంగాణ యాసను పలికించి ఎకిలించిన సినీ పరిశ్రమ. నేడు అదే యాస మాట్లాడినోడి వంక గుడ్లు నెర్పి చూస్తోంది. చెవులు రిక్కించి వింటోంది. తెలంగాణ యాస మాట్లాడినోడే హీరోగా తెరకెక్కుతుండు. సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. పండక్కి కూడా పాత మొగుడేనా అన్నట్లు స్టార్ హీరోలుగా చలామణి అయిన వాళ్లు తెలంగాణ యాసను మాట్లాడినా అందులో రసత్వం రావటం లేదు. అందుకే కొత్త మొహాలైనప్పటికీ చిన్న నటులు కూడా చిన్న చిన్న సినిమాలతో ఎంతో అలరిస్తున్నారు. దానికి కారణం అందులోని మట్టి లాంటి సహజగుణం.

ఉర్రూతలూగిస్తున్న జానపద పాటలు..

జొన్న రొట్టె మీద మిరప తొక్కు లాంటి ఘాటు. అందుకే మాస్‌కు మారు పేరుగా తెలంగాణ నిలబడ్డది. ఇక్కడి జాన పద పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. జానపదానికి పర్యాయ పదం తెలంగాణ అయ్యింది. భూగోళమంతా జానపద జావళీలు జాలు వారుతున్నాయి. ఇదంతా ఇప్పుడే కొత్తగా జరిగింది కాదు, ఇంతకుముందు ఉన్నదే. గతంలో ఉన్న మాటలే, గతంలో విన్న పాటలే. దేన్నైనా గుర్తించాలి. విస్మరణ వీడాలి, ఆదరణ లభించాలి. రాళ్ల లాంటి రాయే వజ్రంలా గుర్తించబడింది. అలాంటిదే తెలంగాణ.

బెల్లాన్నే బంగారంగా కొలిచి..

పుష్పించిన పువ్వులతో వికసించే బతుకమ్మ. పువ్వులే పూజలందుకునే ప్రపంచంలో ఏకైక ప్రకృతి పండగ. కేవలం ఇది పండగనే కాక, ఎదిగిన పడుచులకు మెట్టినిల్లులో మెసులుకునే తీరును ఆటపాటలతో ముందస్తుగా బోధిస్తుంటారు. అందుకే కావచ్చు మిగతా ప్రాంతాల కంటే తెలంగాణలో కుటుంబ బాంధవ్యాలు చాలా ఎమోషనల్‌తో కూడి ఉంటాయి. పాలపిట్టను చూసి జమ్మి తెంపి అలై అందుకోవటం. ఇదంతా ప్రకృతిని ప్రేమించడం నేర్పుతుంది. తెలంగాణ ప్రకృతికి నైవేద్యంగా ఉంటుంది. అంతేకాక దేవుళ్లంటే అతీత వ్యక్తులుగా, పై నుంచి ఊడి పడ్డ వారిగా కాక, మన తాత ముత్తాతలు, అవ్వలు, అమ్మలు మనల్ని కాపాడుకున్న తీరుకు స్మరించుకునేదే పండగగా జరుపుకుంటాం. అలాంటిదే సమ్మక్క, సారలమ్మల మేడారం జాతర. బెల్లాన్నే బంగారంగా పేద, ధనిక తారతమ్యాలు లేకుండా కొలుచుకునే వెసులుబాటు తెలంగాణ జీవతికి చిహ్నం.

కలలు సాకారమవుతున్న నేల..

ప్రపంచమంతా నేడు తెలంగాణ సంస్కృతి వైపు చూస్తోంది. సంస్కృతిలోనే రాజ్యం ముడిపడి ఉంటుంది. ఇప్పుడా సంస్కృతి దేదీప్యమానంగా వెలుగొందుతుంది. మాట, ఆటపాటలతో ప్రపంచాన్ని అబ్బుర‌పరుస్తోంది తెలంగాణ. ఎన్నో కలల్ని ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ భిన్న సంస్కృతులకు నిలయం.

రాష్ట్ర ఏర్పాటుతో సవరించుకున్న రాగం

హైదరాబాద్‌ను సాయుధ పోరాటం నుంచి నిన్నటి ప్రత్యేక తెలంగాణ వరకు గుండెకాయలా కాపాడుకుంటూ వస్తోంది. పైవన్నీ ప్రత్యేక తెలంగాణ అనంతరం వెలుగులోకి రావటం జరిగింది. తెలంగాణ ఏర్పాటుతో ఒరిగేదేమిటి అన్నవారు. ఆంధ్రులే కాదు తెలంగాణులూ ఉన్నారు. కాకి గూటిలో కరచబడ్డా కోయిల, ఇప్పుడు ఏర్పాటుతో రాగాన్ని సవరించుకుంది. కాలం ఒడిలో తెలంగాణ గతాన్ని సింగరించుకుంటుంది. ఇక భవిష్యత్ అంతా తెలంగాణదే.

-శ్రీను కుశాలి

7675029626

Next Story