- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత లాభం మానుకుంటేనే.. అభివృద్ధి సాధ్యం!
ఒకరు వెన్నుపోటు అంటారు.. మరొకరు విజయ దుందుభులు మోగిస్తారు. వెన్నుపోటు నిజమే. ఐతే వీపులే వేరు.. శాసనసభ సాక్షిగా

ఒకరు వెన్నుపోటు అంటారు.. మరొకరు విజయ దుందుభులు మోగిస్తారు. వెన్నుపోటు నిజమే. ఐతే వీపులే వేరు.. శాసనసభ సాక్షిగా అమరావతి రాజధానికి 30,000 ఎకరాలు కావాలన్నవారే మడమ తిప్పి, మూడు రాజ ధానులను తెరపైకి తేవడానికి కాదు. ప్రజలంతా కోరుకునేది మెరుగైన పాలన.. ప్రభుత్వాలను మార్చడం ఆ ఆశతోనే.. అయితే ప్రభుత్వాలు మారినంత తేలికగా పాలనా సంస్కృతి మారడం లేదు..
ఇక విజయోత్సవం విషయానికి వస్తే, సంబరాలతో సరి పెట్టక, బలహీనతలూ గుర్తించాలి. రాజకీయ పక్షాల రంగులు మారాయే కానీ, హంగులు అలాగే ఉన్నాయి. పాలక పక్షాలకు అనుకూలమని పేరుపడ్డ పత్రికల ప్రకారం చూసినా.. పైరవీలు సాగుతూనే ఉన్నాయి. "మట్టి మేత"అనీ, "ప్రజాప్రతినిధుల గుప్పిట్లో గ్రావెల్" అని పతాక శీర్షికలు దర్శనమిస్తున్నాయి. నిన్నటి వరకూ అవినీతికీ, దౌర్జన్యానికీ, ఆశ్రిత పక్షపాతానికి వీరే చిరునామాలని నిందలు మోసిన వారిలో కొందరు నాయకులను ఇప్పటికే అక్కున చేర్చుకున్నారు. ఈ విషయంలో మూడూ మూడే..
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సంఘం ఒక సహకార సంస్థను పరిశీలించిన అనంతరం ఒక నిపుణుల కమిటీ వేయాలనీ, ప్రత్యేక ఆడిట్ జరగాలని అన్నారు. అంతలోనే పదవికి రాజీనామా చేసిన ఆ సంస్థ అధినేత కాషాయ కండువా కప్పుకున్నారు.. కమిటీ పడిన కష్టానికి ఇది ఫలితమేమో తెలియదు.. పంకా దిగిన వారిని, ఆఘమేఘాల మీద సైకిల్ ఎక్కించుకున్న వారు, తర్వాతేమో ఆ వలస పక్షులు కొన్ని తమశ్రేణుల ఉసురు తీస్తే, ఈ చేరికలు వైరి పక్షం కుట్ర అంటున్నారు.. గత పాలకపక్ష మాజీ ఎమ్మెల్యే మద్దతు దారులు, తమ సేన పేరుతో అక్రమ ఇసుక తవ్వకాల్లో పాల్గొంటున్నారని కూటమి నేతలు కోపంగా ఉన్నారట.. చేతులు కాలినాక ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు..
అవినీతిని ఎవరూ అరికట్టలేరు..
గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులని ముద్ర వేసి, "పదవిలోకి వస్తాం. మీ పని పడతాం" అని వేలెత్తి చూపిన వారినే ఇప్పుడు కీలక పదవులలో నియమించడం, కొండొకచో, పొరపాటయిందని, నెమ్మది మీద దిద్దుబాటు చర్యలు చేపట్టడం అచ్చులో చూస్తూనే ఉన్నాం. అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయిన అధికారులపై క్రిమినల్ కేసులు వద్దని, శాఖాపరమైన చర్యలకే పరిమితం కావాలని సిఫార్సులు చేయడానికి కూడా కొందరు నేతలు తెగబడటం ప్రస్తుత ప్రభుత్వ పాలనలోనూ కొనసాగుతోందని తాజావార్త.
సేవాభావంతో రాజకీయాల్లోకి రాలేదెవరూ..
రాజకీయాలలోకి వచ్చేవాళ్లలో అత్యధికులు సేవాభావంతో రారన్నది కాదనలేని నిజం. అందుకు ప్రధాన కారణం మన దేశంలో పదవిలోకి రాగానే, సమాజంలో వారి స్థాయి మారిపోతుంది. వారు ఎక్కడికీ "రారు". "విచ్చేస్తారు". రాజకీయ పక్షంలో తగు చోటు లభిస్తే, ఇంకా దశ బాగుండి శాసన సభ్యత్వమో, మంత్రి పదవో వరిస్తే, ఆ బడాబాబులు పర్యటనకు వెడలినప్పుడు, ముందూ వెనకా వచ్చే కార్ల శ్రేణులతో పోలిస్తే, వెనకటికి "బండెనక బండి కట్టి" బయలుదేరే "నైజాం సర్కరోడు" లెక్కల్లోకి రాడు. కాస్త కాదు.. ఎంతో ముందుగానే తెలియజేసే వస్తారు కాబట్టి, ఊరు ఊరంతా ముస్తాబ వుతుంది. కటౌట్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు, బాజా భజంత్రీలు, మోగే టపాసులు. కాంతులు వెదజల్లే మతాబులు. "ఇంద్రుడు" "చంద్రుడు" అని ముందుగా మాట్లాడే వక్తల పొగడ్తల తర్వాత నాయకులు "మాట్లాడరు" తమ "అమూల్య సందేశ" వరాన్ని ప్రసాదిస్తారు.. ఇలా జనమంతా నెత్తికెక్కించుకుంటే, ఎవరైనా మానవమాత్రులుగా ఎన్నాళ్లుండగలరు! అందుకని మొదట టికెట్ దొరకడానికి, తర్వాత పీఠం ఎక్కడానికి ఎన్ని పాట్లైనా పడతారు. ఎంత ధనమైనా వెచ్చిస్తారు.
ఇంత ఖర్చు.. ఎందరు భరించగలరు?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు తన వద్ద లేకపోవడం వలన 2024 లోకసభ ఎన్నికలలో, పార్టీ అవకాశం ఇచ్చినా, తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు.. లోక్‌సభకు 2024 ఎన్నికలలో పోటీచేసిన మొత్తం 8,054 మంది అభ్యర్థుల్లో, ఎన్నికల సంఘం జాబితా మేరకు, 2,575 మంది ప్రకటిత ఆస్తులు కోటి రూపాయలు పైమాటే. ఎన్నికల సంఘం నియమాల ప్రకారమే, పెద్ద రాష్ట్రాలలో ఒక లోకసభ స్థానానికి ₹95 లక్షలు, శాసనసభ స్థానానికి ₹40 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు.. చిన్న రాష్ట్రాల విషయంలో ఈ ఖర్చు ₹75 లక్షలు, ₹28 లక్షలు.. ప్రజాసేవ చేయాలన్న తపన వున్నా ఇంత ఖర్చు ఎందరు భరించగలరు? కేవలం దేశోద్ధరణ కోసం ఇంత మదుపు పెట్టే ఉదారులు ఎందరుంటారు?
ఇరువురూ అంతర్మథనం చేసుకోవాలి
1985లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రజా సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చు పెట్టే రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరుతోందన్న చేదు నిజం బయటపెట్టారు.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి డబ్బు జమ కావడం వల్ల ఈ పైసలు ఇప్పుడు కొంత మేరకు పెరిగాయేమో గాని, మొత్తం ప్రభుత్వ వ్యయం తీసుకుంటే, ఈ అంకెలు తారుమారైతేనే సంతోషం. "వెన్నుపోటు దినం" పాటించిన వారు, "విజ యోత్సవాలు" తలపెట్టిన వారు ఉభయులూ అంతర్మధనం చేసుకోవాలి. స్వంత లాభం కొంత మానుకోవాలి.
మల్లాప్రగడ రామారావు
99898 63398






