వేలం బాట పట్టిన ప్రజాస్వామ్యం!

by Ravi |   (  Updated:2026-02-27 01:00:31  IST  )

భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు హక్కు. రాజ్యాంగ శిల్పి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు భారత సమాజానికి సమానత్వపు శక్తిని ఇచ్చింది.

వేలం బాట పట్టిన ప్రజాస్వామ్యం!
X

భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు హక్కు. రాజ్యాంగ శిల్పి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు భారత సమాజానికి సమానత్వపు శక్తిని ఇచ్చింది. ఒక పేదవాడి ఓటు, ఒక కోటీశ్వరుడి ఓటుతో సమానమని చెప్పిన వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం అయింది.

అయితే, ఆ పవిత్ర హక్కు నేడు కొన్ని ప్రాంతాల్లో చిల్లర లావాదేవీగా మారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఎన్నికల సమయం రాగానే ఓటర్ స్లిప్పులను తీసుకుని, ఎక్కువ డబ్బు ఇచ్చిన అభ్యర్థిని గెలిపించడం, తక్కువ ఇచ్చిన వాడిని ఓడించడం వంటి ప్రవర్తనలు ప్రజాస్వామ్య ఆత్మను దెబ్బతీస్తున్నాయి..

ప్రజాస్వామ్యం వేలం వ్యవస్థగా మారితే..

‘పని, సేవకు విలువ లేకుండా డబ్బుకే విలువ పెరిగింది’ అనే వేదన వెనుక వాస్తవం ఉంది. గ్రామ సర్పంచ్ నుంచి ప్రధాన మంత్రి వరకు ప్రతి పదవికీ కోట్లలో ‘మినిమం ధర’ నిర్ణయించి, ఎన్నికల బదులు వేలం పాటలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే వ్యంగ్య ప్రతిపాదన అసలు సమస్యను బలంగా చూపిస్తుంది. ఈ ఆలోచనలో వ్యంగ్యం ఉన్నా, దాని వెనుక దాగి ఉన్న అసహనం గంభీరమైనది. ప్రజాస్వామ్యం వేలం వ్యవస్థగా మారితే, గెలిచినవాడు పెట్టుబడిని వసూలు చేసుకు నేందుకు అధికారాన్ని వాడుకుంటాడు.. ఓడినవాడు అప్పులపాలు అవుతాడు. ప్రజా సేవ లక్ష్యం కాకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా మారుతుంది.

డబ్బుల వసూళ్లలో సమానత్వం!

ఎన్నికల సమయంలో కనిపించే మద్యం, విందులు, డబ్బుల పంపిణీ, మైకుల మోతలు ప్రజల నైతిక స్థితిని కూడా ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.. ఎన్నికల షెడ్యూల్ రాకముందు సాధారణ భారతీయుడిలా ఉన్న ఓటరు, షెడ్యూల్ రాగానే డబ్బు కోసం పాశవికంగా మారిపోతాడనే వ్యాఖ్య అతిశయోక్తి అయినా, పరిస్థితి ఆ దిశగా సాగుతోందనే సంకేతాన్ని ఇస్తుంది. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా పాల్గొనడం సామాజిక విలువల క్షీణతను సూచిస్తుంది.

ప్రజాస్వామ్యానికి పూర్తి సమాధి!

అయితే, ఈ సమస్యకు పరిష్కారం ఎన్నికలను రద్దు చేసి వేలం పాటలు పెట్టడమా! అసలు అది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా సమాధి చేయడమే అవుతుంది. ప్రజల చేతుల్లోని హక్కును తీసివేసి, పెట్టుబడిదారుల పాలనకు అప్పగిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే కాక, సామాజిక అసమానతలను మరింత పెంచుతుంది. సంక్షేమ పథకాలను ఎత్తివేసి, ‘నాకు ఇల్లు కావాలి, నాకు పెన్షన్ కావాలి’ అని అడిగే హక్కును లేకుండా చేయాలనే ఆలోచన ప్రజల్ని పౌరుల నుంచి కేవలం పన్ను చెల్లింపుదారులుగా మార్చేస్తుంది. ప్రజాస్వామ్యం వ్యాపార రీతిలో వేలం పాటలతో నడవాల్సిన సంస్థ కాదు. అది ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయంగా సేవే లక్ష్యంగా పెట్టుకున్న వ్యవస్థ.

తాకట్టులో భవిష్యత్తు

ఇక్కడ అసలు ప్రశ్న.. డబ్బు ఎందుకు గెలుస్తోందని? మొదటిగా, ఎన్నికల ఖర్చులు అమితంగా పెరిగాయి. రెండవది, పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే విధానం లోపభూయిష్టం. మూడవది, ఓటర్లలో రాజకీయ అవగాహన లోపం. ఐదేళ్ల భవిష్యత్తును కొన్ని వేల రూపాయలకు తాకట్టు పెట్టడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నష్టాన్ని చాలామంది అంచనా వేయలేకపోతున్నారు.. గెలిచిన అభ్యర్థి ఖర్చు పెట్టిన డబ్బును తిరిగి సంపాదించాలనే ఒత్తిడిలో అవినీతి దారిలో నడుస్తాడు. ఓడినవాడు అప్పుల్లో కూరుకుపోతాడు. చివరికి సమాజమే నష్టపోతుంది. అందువల్ల సమస్య ఓటులో కాదు.. ఓటు వినియోగంలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ఎన్నికల సంస్కరణలు అవసరం. ఓటు అమ్ముకోవడం సామాజిక అపఖ్యాతిగా మారాలి.. మంచి వారిని గెలిపించడం సమాజ గౌరవంగా చైతన్యంతో ఓటరు ముందుగా మారాలి.

ఓటు ఒకరోజు వాస్తవం కారాదు!

‘డబ్బే గెలిచింది, డబ్బే ఓడింది’ అన్న నిరాశలో నిజంగా నేటి సమాజంలో ఉంది. కాదనటం లేదు.. కానీ పరిష్కారం నిస్సహాయతలో కాదు. ఓటరు అత్యంత అవినీతి పరుడిగా మారుతున్నాడని తేల్చేయడం సులభమే కానీ అతడిని ఆ దిశగా నెట్టింది కూడా ఈ వ్యవస్థే, రాజకీయ సంస్కృతి, సామాజిక విలువల క్షీణత. ప్రజలు దిగజారుతున్నారంటే నాయకులూ నిర్దోషులు కారు.. ఇద్దరూ పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఒక చెడు చక్రవ్యూహంలో చిక్కుకుపోయారు. ఈ స్థితిలో మార్పు రావాలంటే వేలం పాటలు కాదు, విలువల పునరుద్ధరణ అవసరం. ఓటు విలువను గుర్తు చేసే సామాజిక ఉద్యమం కావాలి.. ఐదేళ్ల పాలనను నిర్ణయించే క్షణాన్ని చిల్లరగా చూడకుండా, భవిష్యత్తు బాధ్యతగా చూడాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం నిలుస్తుంది. లేదంటే వేలం పాటల వ్యంగ్యం ఒక రోజు వాస్తవంగా మారే ప్రమాదం ఉంది.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story