కనుమరుగవుతున్న సామాజిక శాస్త్రాలు.. డేంజర్‌లో ప్రజాస్వామ్యం

by Bhoopathi Nagaiah |

ప్రజాస్వామ్య వ్యవస్థ కేవలం ఎన్నికలు, ఓట్లు, ప్రభుత్వాల మార్పిడికే పరిమితం కాదు.

కనుమరుగవుతున్న సామాజిక శాస్త్రాలు.. డేంజర్‌లో ప్రజాస్వామ్యం
X

ప్రజాస్వామ్య వ్యవస్థ కేవలం ఎన్నికలు, ఓట్లు, ప్రభుత్వాల మార్పిడికే పరిమితం కాదు. పౌరులలో నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన, సమాజంపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం సజీవంగా నిలుస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, లౌకికవాదం, జాతీయ ఏకత్వం వంటి రాజ్యాంగ విలువలు సమాజంలో బలపడాలంటే అవి చిన్ననాటినుంచే పౌరుల మనసుల్లో నాటుకుపోవాలి. ఇలాంటి విలువలను తీర్చిదిద్దే ప్రధాన సాధనం సామాజిక శాస్త్రాలు.

అయితే నేటి పరిస్థితుల్లో ఈ సామాజిక శాస్త్రాలు విద్యా వ్యవస్థలో, సమాజంలో క్రమంగా పక్కకు నెట్టబడుతున్నాయి. ఇది భవిష్యత్ ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హెచ్చరికగా భావించాలి. సామాజిక శాస్త్రాలు లేని విద్యా విధానం సమాజానికి కేవలం ఉద్యోగులు, నిపుణులను మాత్రమే ఇస్తుంది; బాధ్యతాయుతమైన పౌరులను కాదు. దేశ భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక చైతన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే విద్యా విధానంలో సామాజిక శాస్త్రాలకు మళ్లీ కేంద్ర స్థానం కల్పించడం అత్యవసరం.

సామాజిక శాస్త్రాలకు రెండో స్థానం

మన దేశం ప్రజాస్వామ్యమని గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆ ప్రజాస్వామ్యానికి అవసరమైన పౌర చైతన్యం రోజు రోజుకు తగ్గిపోతోంది. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు పెరిగి “నేను–నాది” అనే సంకుచిత భావన సమాజాన్ని కబళిస్తోంది. ఫలితంగా కుల, మత, ప్రాంతీయ విభేదాలు బలపడుతూ, సామాజిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి. దీనివల్ల దేశాభివృద్ధే గుదిబండగా మారుతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటి సమాజాన్ని అర్థం చేసుకునే శాస్త్రాలైన చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భూగోళ శాస్త్రం వంటి సామాజిక శాస్త్రాలపై పెరిగిన నిర్లక్ష్యం. నేటి విద్యా వ్యవస్థలో వైద్య, ఇంజినీరింగ్, శాస్త్రసాంకేతిక, వాణిజ్య విద్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే సామాజిక శాస్త్రాలను రెండో స్థాయికి పరిమితం చేస్తున్నాం. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారు అవసరమే కానీ, సామాజిక అవగాహన లేని వ్యక్తులతో దేశాన్ని సరైన దిశలో నడిపించడం సాధ్యం కాదు.

చరిత్ర తెలియని తరంతో ప్రమాదం

ఓటు హక్కు ఎందుకు విలువైనది ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు ఏ అంశాలను పరిశీలించాలి ప్రభుత్వాలు చేసే విధానాలు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయి పౌరులుగా మన బాధ్యతలు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత సామాజిక శాస్త్రాలదే. కానీ నేటి తరానికి ఈ అంశాలు సరిగా బోధించబడకపోవడం వల్లే ఓటు విలువ తగ్గిపోతుంది, ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో అపసవ్య ధోరణులు పెరుగుతున్నాయి. సామాజిక శాస్త్రాలను కేవలం పరీక్షల కోసమే చదివి ఉద్యోగాలు సాధిస్తే, వాటి అసలైన ఉద్దేశం నెరవేరినట్లుకాదు. చరిత్ర తెలియని తరానికి దేశ గతం అర్థం కాదు. ఆర్థిక శాస్త్రంపై అవగాహన లేనివాళ్లకు అసమానతల అసలు కారణాలు తెలియవు. పౌరశాస్త్రం తెలియకపోతే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విధులు స్పష్టంగా అవగతం కావు. ఫలితంగా బాధ్యత లేని పౌర సమాజం తయారవుతుంది.

చైనాలో సోషల్ క్రెడిట్ స్కోర్

ఈ పరిస్థితుల్లో నైతిక ప్రవర్తన పెంపొందించే మార్గాలపై చర్చ అవసరం. ఈ సందర్భంలో చైనాలో అమలులో ఉన్న సోషల్ క్రెడిట్ స్కోర్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. పౌరులు చేసే పనుల ఆధారంగా వారికి మంచి లేదా చెడు రేటింగ్ ఇస్తూ, మంచివారికి ప్రోత్సాహం, తప్పులు చేసిన వారికి పరిమితులు విధించే విధానం ఇది. సామాజిక సేవలు, రక్తదానం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం, పేదలకు దోహదం, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వంటివన్నీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, సామాజిక బాధ్యతారాహిత్యం, తప్పుడు ప్రచారాలు వంటి చర్యలు క్రెడిట్‌ను తగ్గిస్తాయి. ఈ విధానం అక్కడ ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ, నిఘా వ్యవస్థల సహాయంతో అమలవుతోంది. అయితే భారతదేశంలో ఇలాంటి విధానం అమలు చేయాలంటే వ్యక్తిగత స్వేచ్ఛలు, రాజ్యాంగ హక్కులు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

రాజకీయ నేతలకూ ప్రమాణాలు

అయినప్పటికీ నైతిక ప్రవర్తనకు ప్రోత్సాహం ఇచ్చే విధానాలపై కనీసం సమగ్ర చర్చ జరగడం అత్యావశ్యకం. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ తరహా బాధ్యత ప్రమాణాలను రాజకీయ పార్టీలకు, నాయకులకు వర్తింపజేయడం. ఎన్నికల హామీలు, పాలనలో పారదర్శకత, అవినీతిపై చర్యలు, ప్రజలకు జవాబుదారీతనం వంటి అంశాలను మదింపు చేసే సోషల్ క్రెడిట్ స్కోర్ సామాజిక పరపతి విలువ (స్వతంత్ర వ్యవస్థ) పరిధిలోకి తీసుకువస్తే.. రాజకీయ అవినీతి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్య విలువలు బలపడతాయి.

తక్షణ కర్తవ్యం..

సామాజిక శాస్త్రాలు లేని విద్యా విధానం సమాజానికి కేవలం ఉద్యోగులు, నిపుణులను మాత్రమే ఇస్తుంది; బాధ్యతాయుతమైన పౌరులను కాదు. దేశ భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక చైతన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే విద్యా విధానంలో సామాజిక శాస్త్రాలకు మళ్లీ కేంద్ర స్థానం కల్పించడం అత్యవసరం. ప్రభుత్వాలు, విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజం కలిసి ఈ విషయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. సామాజిక శాస్త్రాల పునరుజ్జీవనం లేకుండా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. విలువలను అర్థం చేసుకుని జీవించే పౌరులే దేశాన్ని నిజమైన అర్థంలో అభివృద్ధి పథంలో నడిపించగలరు.

మేకిరి దామోదర్,

95736 66650

Next Story