- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దక్షిణాదిపై రాజకీయ దాడి?
డీలిమిటేషన్ ప్రక్రియ భారత సమాఖ్య వ్యవస్థపై చూపుతున్న ప్రభావం, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు, జనాభా ఆధారిత నియోజకవర్గ పునర్విభజన వల్ల కలిగే రాజకీయ అసమానతలు మరియు పరిష్కార మార్గాలపై వ్యాసం.

డీలిమిటేషన్ భారత సమాఖ్య వ్యవస్థ పునాదులను కదిలించివేస్తోంది. 'ఒక వ్యక్తి - ఒక ఓటు - ఒకే విలువ' అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన ఈ సూత్రాన్ని దక్షిణాది రాష్ట్రాల పాలిట శాపంగా మార్చబోతోందా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది.
జనాభాను నియంత్రించి, అభివృద్ధి పథంలో దూసుకు పోతున్న రాష్ట్రాలను రాజకీయంగా నిర్వీర్యం చేసేలా ఈ ప్రక్రియ ఉండబోతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.. 1971 జనాభా లెక్కల ఆధారంగా స్తంభింపజేసిన లోక్‌సభ స్థానాల గడువు ముగియనుండటంతో, రాబోయే మార్పులు సమాఖ్య వ్యవస్థ పునాదులనే కదిలించేలా కనిపిస్తున్నాయి.
రాజ్యాంగ సమానత్వానికి తూట్లు!
నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కీలకమైన మలుపుగా మారింది. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ సూత్రం నేడు దేశవ్యాప్తంగా నెలకొన్న జనాభా మార్పుల వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. గడిచిన ఐదు దశాబ్దాలలో రాష్ట్రాల మధ్య సామాజిక, ఆర్థిక, జనాభా పరమైన వ్యత్యాసాలు భారీగా పెరిగాయి. దీనివల్ల ఓటరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై వారి రాజకీయ ప్రాతినిధ్యం ఆధారపడే విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉత్తరాదిలోని ఒక రాష్ట్ర ఓటరు కంటే దక్షిణాదిలోని ఓటరుకు పార్లమెంటులో రెట్టింపు ప్రాతినిధ్యం లభిస్తుండడం సమానత్వపు హక్కుకు విరుద్ధంగా కనిపిస్తోంది.
జనాభా నియంత్రణకు శిక్ష విధింపు..!
ఈ అసమానతలకు ప్రధాన కారణం రాష్ట్రాలు సాధించిన అభివృద్ధిలోనే దాగి ఉంది. దక్షిణాది రాష్ట్రాలు విద్య, వైద్యం, మహిళా సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల అక్కడ సంతానోత్పత్తి రేటు తగ్గి జనాభా స్థిరీకరణ సాధ్యమైంది. అయితే, ఇదే సమయంలో ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలు సామాజిక అభివృద్ధిలో వెనుకబడటం వల్ల అక్కడ జనాభా పెరుగుదల తీవ్రంగా కొనసాగింది. ఇప్పుడు కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే, జనాభాను అదుపు చేసి దేశాభివృద్ధికి సహకరించిన రాష్ట్రాలు రాజకీయంగా తమ బలాన్ని కోల్పోతాయి. అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు ఆయా రాష్ట్రాలకు శిక్ష విధించినట్లు అవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది కేవలం ప్రాంతాల మధ్య వివాదం మాత్రమే కాదు, దేశ సమాఖ్య స్ఫూర్తికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.
వెనుకబడిన వర్గాలకు పెను నష్టం..!
మరోవైపు, ఈ జాప్యం వల్ల సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా అన్యాయం జరుగు తోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మైనారిటీ వర్గాలు ఎక్కువగా జనాభా సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.. నియోజకవర్గాల పరిధి అసాధారణంగా పెరగడం వల్ల ఈ వర్గాల సమస్యలు జాతీయ స్థాయిలో బలంగా వినిపించడం లేదు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు ప్రస్తుత జనాభా నిష్పత్తికి అనుగుణంగా అందకపోవడం వల్ల వారి సామాజిక, రాజకీయ సాధికారత కుంటు పడుతోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో యువత వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ, వారికి పార్లమెంటులో దక్కాల్సిన ప్రాతినిధ్యం లభించకపోవడం వారి రాజకీయ గొంతుకను బలహీనపరుస్తోంది.
దక్షిణాది నిధుల మళ్లింపు..
దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆదాయానికి అత్యధిక వాటాను పన్నుల రూపంలో అందిస్తుండగా, ఆ నిధులు కేంద్రం ద్వారా వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి మళ్లించబడుతున్నాయి. ఇప్పటివరకు రాజకీయ సమతుల్యత ఉండటం వల్ల ఈ ప్రక్రియ సాఫీగా సాగింది. కానీ భవిష్యత్తులో రాజకీయ అధికారం కూడా జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల వైపు మళ్లినప్పుడు, దక్షిణాది రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. తమ పన్నులు ఎక్కడ ఖర్చు చేయాలనే విషయంలో నిర్ణయాధికారం కోల్పోవడం రాష్ట్రాల మధ్య విభేదాలను మరింత పెంచుతుంది. ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి కేవలం సీట్ల పెంపు సరిపోదు, వ్యవస్థాగతమైన మార్పులు అవసరం. రాజ్యసభను మరింత శక్తివంతం చేయడం ద్వారా రాష్ట్రాల హక్కులను కాపాడవచ్చు.
అంకెల గారడీ కారాదు..
2026 తర్వాత జరగబోయే పునర్విభజన ప్రక్రియ కేవలం అంకెల గారడీగా కాకుండా, సమాఖ్య స్ఫూర్తిని కాపాడేలా ఉండాలి. రాజకీయ బలం ఆర్థిక వనరుల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే భారత ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో సుస్థిరంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రయోజనాలను, వెనుకబడిన రాష్ట్రాల ఓటర్ల హక్కులను సమతుల్యం చేయడమే నేటి తక్షణ కర్తవ్యం. ఏ ఒక్క ప్రాంతం కూడా రాజకీయంగా అణచివేతకు గురవుతున్నామనే భావన కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అప్పుడే దేశ అఖండత, సార్వభౌమత్వం పటిష్టంగా ఉంటాయి. నేటి నాయకత్వం ప్రదర్శించే విజ్ఞతపైనే రేపటి భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి అంటే కేవలం సంఖ్యల పెరుగుదల కాదు, అది అన్ని ప్రాంతాల సమాన భాగస్వామ్యమని గుర్తించినప్పుడే దేశం బలోపేతమవుతుంది.
-వెంక గారి భూమయ్య
98485 59863






