నిర్లక్ష్య కారక మరణాలు..

by Ravi |   (  Updated:2025-05-20 00:30:46  IST  )

రోజురోజుకూ హైదరాబాద్ పట్టణంలో జనసాంద్రత పెరుగుతూ పోతుంది. కూటి కోసం వస్తున్న వలస కార్మికులు తక్కువ ధరకు

నిర్లక్ష్య కారక మరణాలు..
X

రోజురోజుకూ హైదరాబాద్ పట్టణంలో జనసాంద్రత పెరుగుతూ పోతుంది. కూటి కోసం వస్తున్న వలస కార్మికులు తక్కువ ధరకు ఇరుకిరుకు గదుల్లో నివాసం ఉంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న నివాస యజమానులు ఇరుకిరుకు గదులల్లో ఎలాంటి వెంటిలేషన్ లేకుండా గదులను కట్టి ఎక్కువ సంపాదించాలనే ఆశతో వాటిని అగ్నికి ఆహుతి అయ్యేలా నిర్మించి జీవితాలను నాశనం చేస్తున్నారు. మొన్న మీర్ చౌక్‌లో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబంలోని పదిహేను మంది చనిపోవడం అత్యంత విషాదకరమైన సంఘటన. కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోతేనే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది ఒకే కుటుంబంలోని పదిహేను మంది చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. నగరంలో పదిహేను రోజులకొకసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అనుమతి లేకుండా కట్టే భవనాలపై ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం, నియమ నిబంధనలకు అనుగుణంగా భవనాలు కట్టకపోవడం వల్లనే ఇలాంటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నివాస యజమానులు ఇచ్చే డబ్బుకు ఆశపడి ఇరుకు ఇరుకు భవనాలు కడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సెట్ బ్యాక్ లేకుండా ఇళ్లు కట్టడం, బాల్కనీలూ లేకపోవడం, కనీసం కిటికీలు లేకపోవడం, చిన్న చిన్న మెట్లు కట్టడం, ఎలక్ట్రికల్ బోర్డులు సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఏర్పడి అభంశుభం తెలియని జీవితాలు దహనమై పోతున్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించవలసిన అగ్నిమాపక సిబ్బంది నిమ్మకు నీరెత్తకుండా మౌనంగా ఉంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వచ్చి సహాయపడే కంటే ముందు జాగ్రతలు తీసుకుంటే బాగుంటుంది కదా.. ఇప్పటికైనా ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఫైర్ స్టేషన్ సమకూర్చడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రతి ఫైర్ స్టేషన్‌కు ప్రత్యేక అంబులెన్స్ అటాచ్ చెయ్యాలి. నివాస భవనాల్లో ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్రతి ఇంట్లో అగ్నిమాపక సిలిండర్లు ఏర్పాటు చెయ్యాలి. ఒక ఇంటికి ఇంకో ఇంటికి కనీసం రెండు ఫీట్ల మార్గం ఉండేటట్టు అధికారులు అవగాహన కల్పించాలి.

అజీజుద్దీన్

70131 76656

Next Story