చెరిగిపోని అంటరానితనం.. ఫిర్యాదు చేయడానికి కూడా భయమే!

by Ravi |   (  Updated:2025-06-24 01:00:19  IST  )

ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో జరిగిన ఘటన, భారత సమాజంలో ఇంకా కణ కణమంటున్న కుల వివక్ష అనే పుండుపై కారం చల్లినట్లయింది.

చెరిగిపోని అంటరానితనం.. ఫిర్యాదు చేయడానికి కూడా భయమే!
X

ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో జరిగిన ఘటన, భారత సమాజంలో ఇంకా కణ కణమంటున్న కుల వివక్ష అనే పుండుపై కారం చల్లినట్లయింది. 'సర్పంచ్ ఎస్సీ' అన్న పదునైన మాట, ఆ తర్వాత జరిగిన అవమానకరమైన పరిణామాలు.. ఆధునిక యుగంలోనూ దళితులు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవాలను, సమాజంలో పేరు కు పోయిన అసమానతలను కళ్లకు కట్టి నట్లు చూపాయి. మన రాజ్యాంగం కల్పిం చిన సమానత్వ ఆదర్శాలకు, వాస్తవ ప్రపం చంలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు మధ్య ఉన్న అగాధాన్ని ఈ ఘటన మరో సారి నిర్మొహమాటంగా ప్రశ్నిస్తుంది.

చెరిగిపోని అంటరానితనం..

ధనాపురం గ్రామంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను దేవాలయ ప్రాంగణం‌లో జరిగిన కార్యక్రమంలో వేదికపైకి అనుమ తించకపోవడం, ఆయనను 'ఎస్సీ' అని బహిరంగంగా గుర్తించడం ఒక సామాజిక కుష్టు వ్యాధి లాంటిది. భారతదేశం చంద్రయాన్ లాంటి మిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రపంచ వేదికపై తన సాంకేతిక పటిమను చాటుకుంటున్న వేళ, ఒక ప్రజాప్రతినిధిని ఆయన కులం కారణంగా వేదికపైకి రానివ్వకపోవడం మన నాగరికతకు ఒక చేదు వాస్తవం.

కనిపించని కుల గీతలు..

మన రాజకీయ నాయకుల ఆలోచనా ధోరణి ఎంత నిమ్న స్థాయిలో ఉందో ఈ ఘటన తెలియజేస్తుంది. మతం, కులం ఆధారంగా వ్యక్తులను వర్గీకరించడం, వారికి ప్రత్యేక స్థానాలను కేటాయించడం అనేది రాజ్యాంగ ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధం. ఇది కేవలం సర్పంచ్‌కు జరిగిన అవమానం కాదు, ఇది భారత ప్రజాస్వామ్యానికే తగిలిన తీవ్రమైన గాయం. ఈ సంభాషణలు కేవలం మాటలు కావు, అవి మన రాజకీయ నాయకుల్లో ఇంకా ఎంత లోతుగా కుల మదం, వివక్షాపూరిత ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయో.. తెలియ జేస్తాయి. మతం పేరుతో వ్యక్తులను విభజించడం, కులం ఆధారంగా వారి స్థాయిని నిర్ణయించడం రాజ్యాంగ ఆదర్శాలకు పూర్తి విరుద్ధం. ఇది దేశంలోని ప్రతి దళితుని ఆత్మగౌరవంపై జరిగిన దాడి.

క్షమాపణలు.. మాటలకేనా?

వివాదం ముదరడంతో, ఎమ్మెల్యే పార్థసారథి క్షమాపణలు చెప్పారు. అయితే, ఈ 'క్షమాపణ'ల వెనుక ఎంతవరకు చిత్త శుద్ధి ఉందనేది సందేహాస్పదం. "కావాలని వీడియో వైరల్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య, సమస్యను తేలికపరచడానికే తప్ప, దాని తీవ్రతను గుర్తించినట్లు లేదు. ఇక్కడ సమస్య వీడియో వైరల్ కావడం కాదు, అసలు ఆ వివక్షపూరిత చర్య జరగడం. "మా ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో దళితులు.. ఆలయాల దగ్గరికి రారు" అని అక్కడి అధికార పార్టీ నాయకురాలు చెప్పిన మాట, కుల వివక్షను ఒక ఆచా రంగా, సహజమైన సామాజిక వాస్తవంగా సమర్థించుకునే ప్రయత్నమే. ఇలాంటి వాదనలు వివక్షను అంతం చేయవు.. పైగా దాన్ని మరింత బలపరుస్తాయి. ఆధునికత ముసుగులో సమాజంలో కుల అహంకారం, అజ్ఞానం ఎంత ప్రబలంగా ఉన్నాయో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి.

ఆదోని చెబుతున్న పాఠం

దళితుల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉన్నప్పటికీ, అవి ఎందుకు సమర్థవంతంగా అమలు కావడం లేదో ఆదోని ఘటన తేటతెల్లం చేస్తుంది. సర్పంచ్ చంద్రశేఖర్ మొదట ఫిర్యాదు చేయడానికి సంకోచించడం, దళిత సంఘాల ఒత్తిడి తర్వాతే ముందుకు రావడం చూస్తే, బాధితులు తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పడానికి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. ఇది చట్టంపై నమ్మకం లేకపోవడాన్ని, లేదా సమాజంలో బలమైన వర్గా ల ముందు నిస్సహాయతను సూచిస్తుంది.

ఎక్కడ నిలబడాలో కులమే నిర్ణయిస్తే..?

ప్రజాస్వామ్యంలో పౌరులందరూ సమానులే అన్న ప్రాథమిక సూత్రం మన సమాజంలో ఇంకా అసంపూర్ణంగానే ఉంది. కులం అనేది ఒక వ్యక్తి గుర్తింపును, సామాజిక స్థానాన్ని, చివరికి ఒక కార్య క్రమంలో ఆయన ఎక్కడ నిలబడాలో కూడా నిర్ణయిస్తున్నప్పుడు, మనం నిజంగా అభివృద్ధి పథంలో ఉన్నామా? అని ప్రశ్నించుకోవాలి. ఆదోని ఘటన ఒక మేలుకొలుపు.. ఇది కేవలం ఒక గ్రామం లో జరిగిన సంఘటన కాదు, ఇది మన జాతీయ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే ఒక చిహ్నం. కులం లేని, వివక్ష రహిత సమాజం కోసం నిజమైన సంకల్పం, సమర్థవంతమైన చర్యలు, చిత్తశుద్ధి అవసరం. అప్పుడే మనం 'ప్రగతిశీల సమాజం' అనే బిరుదును సగర్వంగా ధరించగలం.

– మేకల ఎల్లయ్య,

99121 78129

Next Story