అట్టడుగున అతి పెద్ద సామాజికవర్గం

by Ravi |   (  Updated:2026-04-26 00:46:10  IST  )

అసమానతలు లేవని చెప్పే వాదనలకు తెలంగాణ కుల గణాంకాలు ఎలా సవాలు విసురుతున్నాయో.. దళితుల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం, భూమి పంపిణీలో అసమానతలు, ఉపాధి సమస్యలపై ఈ వ్యాసం స్పష్టమైన దృక్కోణం అందిస్తుంది.

అట్టడుగున అతి పెద్ద సామాజికవర్గం
X

కులం ఎక్కడుంది..! కుల అసమానతలు, అంటరానితనం ఎక్కడున్నాయి.. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయంటూ సహజంగా మాట్లాడు తుంటారు. కానీ కుల రక్కసి, సమాజంలో అంటరానితనం, అవమానాలు అవి భరించే వారికి మాత్రమే వాటి బాధలు తెలుసు.. ఎంత ప్రతిభ ఉన్నా కులం అనే ఓ బ్రాండ్ లేకపోతే ఆ మనిషిని ఎలా నిర్వీర్యం చేయాలో తరతరాలుగా చరిత్రలో జరుగుతున్నది. అంటరాని వారిగా సమాజం చూస్తున్న దళితుల శ్రమ తరతరాల దోపిడీకి గురైందనే సాక్ష్యాన్ని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లెక్కల్లో బయటపెట్టింది. అంటరానితనం, అస మానతలు లేవంటూ మాట్లాడే వారికి ఇదే గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది.

దళితుల బతుకులను చూపిన సర్వే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల జనాభా గణన, సామాజిక, ఆర్థిక గణనలో.. దళితుల అంధకార బతుకులకు అద్దం పడుతున్నాయి. అత్యంత జనాభా కలిగి విద్య, రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధిక అవకాశాలకు ఎంత దూరంగా ఉన్నారనేది స్పష్టం చేసింది. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 54 లక్షల జనాభా ఉంటే అందులో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం అత్యధిక జనాభా కలిగి ఉంది 10.3 శాతం ఉండి 36 లక్షల జనాభా కలిగి ఉంది. మాలల జనాభా కలుపుకుంటే సుమారు దళితుల జనాభా మొత్తం కలిపితే 60 లక్షలకు పై చిలుకు ఉన్నప్పటికీ కేవలం ఓటేసే సమూహంగా మాత్రంగానే చూస్తున్నారన్నది స్పష్టం అవుతుంది. 42 అంశాలను ప్రామాణికంగా తీసుకొని నిర్వహించిన సర్వేలో 242 కులాలపై సర్వే చేస్తే దాదాపు 135 కులాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే.. అందులో దక్కలి మరింత అదమ స్థానంలో 116 స్థానంలో సామాజిక అసమానతలో చిట్టచివరిలో నిలిచింది.

తాత్కాలిక హామీలతో వారి పరిస్థితి మారదు!

రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న మాదిగలు ఇంకా అగాథమంత అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు. దాదాపు 98 శాతం మాదిగలు దినసరి కూలీలుగానే బతుకులు వెళ్కదీస్తున్నారు. దళితుల రిజర్వేషన్ల మీద మాట్లాడే వారు ఈ లెక్కలను గమనిస్తే భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. భూమి కూడా స్వల్ప సంఖ్యాకుల చేతిలోనే అధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. 4.5 శాతం ఉన్న వ్యక్తుల చేతిలో 13 శాతానికి మించి భూ వనరులు ఉన్నాయి. 10.3 శాతం ఉన్న మాదిగలకు కేవలం 6 శాతం భూమి ఉంది. తెలంగాణలో జరిగిన సర్వే ప్రకారం దళితులు, ముఖ్యంగా మాదిగలు ఇంకా విద్య, ఉపాధి, భూమి వంటి రంగాల్లో వెనుకబాటులోనే ఉన్నారు.. ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడుతూ, ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. తాత్కాలిక హామీలతో వారి పరిస్థితి మారదని స్పష్టం అవుతోంది.

మాదిగల్లో చైతన్యం రాకపోతే..

రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి.. రాజకీయ అవకాశాలే కాకుండా సామాజిక అసమానతల విషయంలో ఇంకా ఎంతో దూరంలో ఈ వర్గాలు ఉన్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రవేశపెట్టే తాత్కాలిక హామీలతో వీరి బతుకులు మారవు.. సామాజిక అసమానతలను తొలగించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరెన్ని దశాబ్దాలైనా వీరి పరిస్థితి మరింత అంధకారంలో నిండుకునే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే సత్తా మాదిగలకు ఉంది. అంతటి శక్తిగా ఉన్న మాదిగలు ఇంకా చైతన్యం రాకపోతే పాలితులుగా బాధితులుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తేలిన లెక్క.. అందుతున్న ఫలాలు, జరుగుతున్న నష్టాన్ని మాదిగలు అంచనా వేసుకోవాలి. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పి సామాజిక సమానత్వాన్ని సాధించాలి. కలిసివచ్చే సామాజిక అణచివేతకు గురవుతున్న వర్గాలను సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ అధికారాన్ని సాధించి... తద్వారా సామాజిక సమానత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో పరచాల్సిన అవసరం ఉంది.

-సంపత్ గడ్డం

78933 03516

Next Story