'డెకాయిట్' సామాజిక ప్రేమకథ..!

by Ravi |   (  Updated:2026-04-11 01:00:47  IST  )

డెకాయిట్ కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, కుల వివక్ష, మెడికల్ మాఫియా వెనుక ఉన్న చీకటి నిజాలను ప్రశ్నించే చిత్రం. అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌ల అద్భుత నటనతో సాగే ఈ సినిమాపై పూర్తి విశ్లేషణ..

డెకాయిట్ సామాజిక ప్రేమకథ..!
X

తెలుగు తెరపై అడివి శేష్ కథ ఎంచుకున్నారంటే అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందని, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఆయన కేరాఫ్ అడ్రస్ అని సగటు ప్రేక్షకుడు ఆశిస్తాడు.. కానీ, ‘డెకాయిట్ ఒక ప్రేమకథ’ ఆ అంచనాలను దాటి, మన సామాజిక స్పృహను తట్టి లేపే ఒక సరికొత్త ప్రయోగం.

షానీల్ డియో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం ఒక ప్రేమకథా లేక వ్యవస్థపై సంధించిన అస్త్రమా? అనే కుతూహలం సినిమా ఆరంభం నుండే మొదలవుతుంది. సాధారణంగా శేష్ సినిమాల్లో కనిపించే వేగం కంటే, ఇందులో కనిపించే భావోద్వేగాల బరువు ప్రేక్షకుడిని మరింత లోతుగా కథలో లీనం చేస్తుంది.

కథేంటంటే..

హరిదాస్, సరస్వతిల ప్రేమ ఒక స్వచ్ఛమైన కావ్యంలా అనిపిస్తుంది. కానీ, ఈ ప్రేమకథ వెనుక దాగి ఉన్న చీకటి కోణాలేమిటి? ఒక యువకుడిని సమాజం ఎందుకు వెలివేసింది? కేవలం కులం ప్రాతిపదికన ఒక నిష్కల్మషమైన ప్రేమికుడు ‘డెకాయిట్’గా మారాల్సి రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలే ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి.. హరిని హత్య కేసులో ఇరికించినప్పుడు వ్యవస్థ చూపిన క్రూరత్వం, చట్టం చేతుల్లో చిక్కిన ఒక సామాన్యుడి ఆర్తనాదంలా మన గుండెను తాకుతుంది.

ప్రపంచం పెద్ద జాతి ప్రజలదేనా?

కులం అనే అడ్డుగోడ మనుషుల మధ్య దూరాన్ని పెంచడమే కాదు, ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో ఈ చిత్రం కళ్లకు కడుతుంది. అడివి శేష్ తన గంభీరమైన నటనతో హరి పాత్రలోని వేదనను అద్భుతంగా పండించారు. ఆయన మునుపటి పాత్రల కంటే ఇందులో ఒక రకమైన పరిణతి, నిశ్శబ్దంతో కూడిన ఆవేశం కని పిస్తుంది. ‘ప్రపంచం పెద్ద జాతి ప్రజలదే’ అనే డైలాగ్ విన్నప్పుడు, మన చుట్టూ ఉన్న వ్యవస్థలోని వివక్షను ప్రశ్నించు‌కోకుండా ఉండలేం. అధికారం, అణచివేత మధ్య నలిగిపోయే సామాన్యుడి ఆవేదన వెనుక ఉన్న రాజకీయం ఏమిటో అర్థం చేసుకోవాలంటే సినిమాలోని ప్రతి సన్ని వేశాన్ని నిశితంగా గమనించాల్సిందే. దర్శకుడు కుల వివక్షను కేవలం ఒక పాయింట్‌లా కాకుండా, కథలో అంతర్భా‌గంగా చూపిస్తూనే అది ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మార్చేస్తుందో అద్భుతంగా ఆవిష్కరించారు.

ఆసుపత్రిలో అవయవ విక్రయాలు..

సినిమా ద్వితీయార్థం మరో మలుపు తిరుగుతుంది. కోవిడ్ కాలంలోని చీకటి రోజులను గుర్తుచేస్తూ, వైద్య రంగంలోని మాఫియాను ఎండగట్టిన తీరు విస్తుపోయేలా చేస్తుంది. ఆసుపత్రిలో జరిగే అవయవ విక్రయాలు, మృత దేహాల అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్న వేళ, శవాల మీద పైసలు ఏరుకునే నీచమైన వ్యవస్థను హరి ఎలా ఎదురించాడనేది వెండితెరపై ఒక హై-వోల్టేజ్ డ్రామాగా మలిచారు.. తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి సరస్వతి పడే తపన, ఆమెను హరి వైపు ఎలా నడిపించింది నైతికత, అవసరాల మధ్య సాగే ఈ పోరాటంలో మృణాల్ నటన హైలైట్. ఆమె పాత్రలోని సంఘర్షణ, ఆమె భావాలు ప్రేక్షకుడిని ఆ పాత్రతో పాటు ప్రయాణించేలా చేస్తాయి.

ప్రతి డైలాగూ అంతర్గత మథనం..

సాంకేతికంగా ఈ సినిమా ఒక అద్భుతం. షానీల్ డియో విజన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లోని రంగుల ప్రపంచానికి, వర్తమానంలోని గ్రే-స్కేల్ నిశ్శబ్దానికి మధ్య ఉన్న వ్యత్యాసం కాలం మిగిల్చిన గాయాలను గుర్తుచేస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం, జ్ఞాని నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లాయి.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లోని సౌండ్ డిజైన్ సరికొత్త అనుభూతినిస్తుంది. ధనుష్ భాస్కర్ విజువల్స్ కొత్తగా ఆవిష్కరించాయి. అబ్బూరి రవి రాసిన సూటిగా, సుత్తి లేకుండా ఉండే మాటలు ఆలోచింప జేస్తాయి. ప్రతి సంభాషణ ఒక సందేశంలా కాకుండా, పాత్రల అంతర్గత మథనంగా వినిపిస్తుంది.

జీవితానికి దక్కిన విముక్తి!

క్లైమాక్స్‌లో అనురాగ్ కశ్యప్ ఇచ్చే వివరణ ఈ కథలోని చిక్కుముడులను ఎలా విప్పుతుంది? న్యాయం అందని చోట ప్రతీకారం పుట్టడం సహజమేనా? చట్టం దృష్టిలో హరి చేసిన నేరాలు, మానవత్వపు కోణంలో సబబేనా? అనే ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. ప్రతీకారం కంటే మన్నింపు గొప్పదని చెబుతూనే, చివరికి ప్రేమ ఎలా గెలిచింది అనేది మనసును హత్తుకునేలా చిత్రీకరించారు. విచారణ సన్నివేశం కేవలం ఒక క్రైమ్ కేసు ముగింపు కాదు, అది ఒక మనిషి జీవితానికి దక్కిన విముక్తి. మన చుట్టూ ఉన్న అసమానతలపై నిలదీసే ఒక ప్రశ్న. అడివి శేష్, మృణాల్‌ల అద్భుత కెమిస్ట్రీ, దర్శకుడి సాహసోపేతమైన కథనం కలిసి ఈ చిత్రాన్ని ఒక మైలురాయిగా నిలబెట్టాయి. ఆసక్తికరమైన మలుపులు, మనసును కదిలించే భావోద్వేగాలతో సాగే ఈ సినిమా, ప్రేక్షకుల మెదళ్లలో ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది.

-డా. కట్కూరి

[email protected]

Next Story