సంక్షేమ హాస్టల్లో సంక్షోభం..

by Ravi |   (  Updated:2026-07-17 00:45:42  IST  )

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత, పోషకాహారం, అద్దె భవనాలు, వార్డెన్ పోస్టుల ఖాళీలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రభావం, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు..

సంక్షేమ హాస్టల్లో సంక్షోభం..
X

తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కలిపి సుమారు 1,862 హాస్టళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో దాదాపు 1.95 లక్షల మంది విద్యార్థులు నివసిస్తూ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ హాస్టళ్లు కేవలం వసతి గృహాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, విద్యా సమానత్వం, అవకాశాల సమాన పంపిణీకి ప్రతీకలు.

సంక్షేమం ఎక్కడుంది?..

తెలంగాణలో వేలాదిమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ హాస్టళ్లు వారి జీవితాలను మార్చే విద్యాలయాలుగా ఉండాలి. కానీ నేడు అనేక హాస్టళ్లు సమస్యల నిలయాలుగా మారుతున్నాయి. హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత, సిబ్బంది లోపం, నిర్వహణ సమస్యలు, పోషకాహార నాణ్యత వంటి అనేక అంశాలు విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి.

ఆకలి తీరడం కూడా కష్టంగా మారితే..!

పోషకాహారం అందాల్సిన చోట ఆకలి తీరడం కూడా కష్టంగా మారితే... విద్యార్థులు ఎలా చదువుతారు? పోటీ పరీక్షల్లో ఎలా విజయం సాధిస్తారు? చదవడానికి వచ్చిన విద్యార్థులు నాసిరకం భోజనం తినాల్సి వస్తోంది. తాగడానికి పరిశుభ్రమైన నీరు లేదు. పడుకోవడానికి సరైన పడకలు లేవు.. మరుగుదొడ్లు శుభ్రంగా లేవు. చాలాచోట్ల గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్య సహాయం అందని పరిస్థితులు ఉన్నాయి. లైబ్రరీలు, స్టడీ హాల్స్, డిజిటల్ సౌకర్యాలు కూడా తగినంతగా లేవు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, కొత్త హాస్టళ్లు తగినంతగా ప్రారంభం కావడం లేదు. కొత్త భవనాల నిర్మాణం మందగిస్తోంది. గదుల సామర్థ్యం పెరగడం లేదు. పడకల కొరత కొనసాగుతోంది. దీనివల్ల ఒక గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అద్దె భవనాల సమస్య..

ఇప్పటికీ అనేక హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల భద్రతా సమస్యలు, ఇరుకైన గదులు, సరైన వంటశాల లేకపోవడం, తాగునీటి సమస్య, పరిశుభ్రత లోపించడం, వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. బాలికల భద్రత అత్యంత ముఖ్యమైన అంశం. ప్రతి బాలికల హాస్టల్‌లో మహిళా వార్డెన్, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సానిటరీ వెండింగ్ మెషీన్లు, 24 గంటల భద్రత, ఆరోగ్య పరీక్షలు, తప్పనిసరిగా ఉండాలి. ఆహార ధరలు, వంటగ్యాస్, కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో డైట్ ఛార్జీల పెంపు అవసరం అంతగానో ఉంది. అయితే బడ్జెట్ పెరగడం మాత్రమే సరిపోదు. ఆ నిధులు పూర్తిగా విద్యార్థుల ఆహారంపైనే ఖర్చవుతున్నాయా? మెనూ ప్రకారం భోజనం అందుతోందా అనే అంశాలను కూడా సమీక్షించాలి.

వార్డెన్ పోస్టుల సమస్య..

ప్రతిరోజూ నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందుతోందా? గుడ్లు, పాలు, పండ్లు క్రమం తప్పకుండా అందుతు న్నాయా? బియ్యం, పప్పులు, కూరగాయల నాణ్యత ఎలా ఉంది? వంటశాలలు పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారా? జిల్లా స్థాయిలో అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారా? వీటిపై నిరంతర పర్యవేక్షణ అవసరం. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో అన్ని మంజూరైన వార్డెన్ పోస్టులు భర్తీ అయ్యాయా? ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? జిల్లా వారీగా ఖాళీల వివరాలను ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో ప్రజలకు వెల్లడించాలి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రతి హాస్టల్‌కు పూర్తి స్థాయి వార్డెన్‌ను నియమించాలి.

ఇది పేద పిల్లల కలల నిలయం..

విద్యార్థి సంక్షేమం అంటే కేవలం సంక్షేమ పథకాలు ప్రకటించడం కాదు. ఆ పథకాల ప్రయోజనం నిజంగా హాస్టల్‌లో ఉండే ప్రతి విద్యార్థికి చేరేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. సంక్షేమ హాస్టళ్లు బలపడితే పేద విద్యార్థి బలపడతాడు, పేద విద్యార్థి బలపడితే, సమాజం బలపడుతుంది. హాస్టల్ గది ఒక పేద విద్యార్థి కలలకు నిలయం. అవి కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత.

-పుల్ల కళ్యాణి

స్టేట్ గర్ల్స్ కన్వీనర్, ఏబీవీపీ

80743 90686

Next Story