ఆగుతూ.. సాగుతూ.. మూడేళ్లుగా పూర్తి కాని హై లెవెల్ బిడ్జి పనులు

by Ajay Maddhiboyina |

మండలంలో గంభీరావుపేట నుంచి లింగన్నపేట హై లెవెల్ బిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరై దాదాపు 34 నెలలు దాటినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలంలో ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా, పనులు నత్తనడకన సాగుతున్నాయి. పిల్లర్ల దశలోనే వంతెన పనులు ఉండటంతో ఈ వర్షాకాలం సైతం ఇబ్బందులు తప్పవని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ఆగుతూ.. సాగుతూ.. మూడేళ్లుగా పూర్తి కాని హై లెవెల్ బిడ్జి  పనులు
X

దిశ, గంభీరావుపేట : మండలంలో గంభీరావుపేట నుంచి లింగన్నపేట హై లెవెల్ బిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరై దాదాపు 34 నెలలు దాటినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలంలో ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా, పనులు నత్తనడకన సాగుతున్నాయి. పిల్లర్ల దశలోనే వంతెన పనులు ఉండటంతో ఈ వర్షాకాలం సైతం ఇబ్బందులు తప్పవని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గంభీరావుపేట నుంచి లింగన్నపేటకు వెళ్లే దారిలో మానేరు వాగుపై లోలెవల్ వంతెన ఉంది. ఏటా వర్షాకాలంలో అధిక వర్షాలకు మానేరు మత్తడి దూకడంతో వంతెన మునిగి రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో హై లెవల్ వంతెన నిర్మించాలని వివిధ పార్టీల కార్యకర్తలు గతంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. దీంతో అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ రూ.10.60 కోట్లను హై లెవల్ వంతెనకు నిధులు మంజూరు చేశారు. 2023 సంవత్సరం సెప్టెంబరులో పనులకు శంకుస్థాపన చేశారు. లో లెవల్ వంతెన పక్కన పైప్లాన్లు వేసి మట్టి రోడ్డు ఏర్పాటు చేసి పూర్తిగా తొలగించారు.

గత రెండేళ్లలో అధిక వర్షాలకు మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట, ముస్తాబాద్, కొత్తపల్లి, లింగన్నపేటకు వెళ్లే బస్సులు కోరుట్లపేట మీదుగా వెళ్లేవి. మల్లారెడ్డిపేట వంతెన మీదుగా చిన్న వాహనాలు వెళ్లేవి. దాదాపు మూడేళ్లు కావస్తున్నా పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి. గతేడాది వర్షాకాలం ముగియగానే అప్పటి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గుత్తేదారులను పిలిచి పనులు చేయాలని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రతి రోజు కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా లింగన్నపేట, కొత్తపల్లి, ముస్తాబాద్ సిద్దిపేటకు వెళ్లే వారు చాలా మంది ప్రయాణికులు ఉంటారు. ఇప్పటికే రెండేళ్లు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం తొమ్మిది పిల్లర్లు, ఒక అబర్డ్ మెంట్ పనులు నడుస్తున్నాయి. దాదాపు 35 శాతం వరకు పనులైనట్లు గుత్తేదారు చెబుతున్నారు.త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు.

వేగవంతం చేస్తాం..

నిఖిల్, ఏఈ, ఆర్అండ్ బీ

గతంలో పనులు నిలిచిపోయిన మాట వాస్తవమే. ప్రస్తుతం వేగవంతంగా నడుస్తున్నాయి. పిల్లర్ల పని నడుస్తోంది.దాదాపు 30 శాతం పని పూర్తయింది. ఇంకా దాదాపు ఆరు నెలలు టైం పడుతుందని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వేగవంతంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

త్వరగా పూర్తి చేయాలి

-కూర సురేశ్, గంభీరావుపేట

లింగన్నపేట వెళ్లే దారి మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ముందుకు సాగటం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని వేగవంతంగా జరిగేలా కృషి చేయాలి.

Next Story