- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సానుభూతి కంటే.. స్థానికత గెలిచింది!
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయ పతాకం ఎగుర వేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయ పతాకం ఎగుర వేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా, బీజేపీ ఈసారి డిపాజిట్ కూడా కోల్పోయింది. ఎన్నికల చివరి దశ వరకు కాంగ్రెస్ శిబిరంలో కనిపించిన అనిశ్చితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థంగా చెరిపేశారు.
ముఖ్యంగా ఎన్నికల చివరి వారంలో రేవంత్ ప్రత్యక్ష ప్రచారం, స్పష్టమైన వ్యూహాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. బీఆర్ఎస్ కంచుకోటకు బీటలు వారడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం మరీ విశేషం. నాలుగు సార్లు వరుస పరాజయాలు పొందినా తలవంచని కాంగ్రెస్ అభ్యర్తి నవీన్ యాదవ్‌కి ఇది వ్యక్తిగత విజయం కూడా అని చెప్పాల్సి ఉంటుంది.
వరుస ఓటములకు చలించని తత్వం..
నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం పట్టుదలతో నిండినది. 16 ఏళ్ల రాజకీయ జీవితంలో వరుసగా నాలుగు ఓటములు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ప్రజలతో కలిసి పనిచేయడం, ‘నవ యువ ఫౌండేషన్’ ద్వారా సేవా కార్య క్రమాలు నిర్వహించడం, సరైన సమయంలో కాంగ్రెస్‌లో చేరడం ఈ విజయానికి కీలకం అయ్యాయి. స్థానికత, బీసీ సామాజికవర్గం ప్రాతినిధ్యం కూడా ఆయన్ని ముందుకు నెట్టాయి. గతంలో నాలుగుసార్లు ఇక్కడే ఓడిపోయిన నవీన్ యాదవ్ ప్రస్తుత ఉప ఎన్నికల్లో తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందడం విశేషం. మరోవైపున సెంటిమెంటుపై ఆశలు పెట్టుకున్న మాగంటి సునీత ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యం దక్కించు కోలేక పోయారు. నిస్సందేహంగానే ఈ గెలుపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఎంతో ఉత్సాహన్నిచ్చింది.
విజయానికి అయిదు మెట్లు..
కాంగ్రెస్ విజయంలో ఐదు ప్రధాన అంశాలు సహకరించాయి. నోటిఫికేషన్‌కు ముందే పకడ్బందీ ప్రణాళిక, సరైన అభ్యర్థి ఎంపిక, ఎంఐఎంను పోటీలో లేకుండా చేయడంలో వ్యూహం, రేవంత్ రెడ్డి దూకుడు ప్రచారం, చివరగా ఓటింగ్ రోజు వరకు నిబద్ధతతో కొనసాగిన పోలింగ్ మేనేజ్మెంట్.. ఇవి అన్నీ కలిసి ఫలితం ఇచ్చాయి. ముఖ్యంగా ఎంఐఎం పోటీ చేయకపోవడం కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు సమీకరించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక పరీక్షగా మారింది. తనపై వస్తున్న విమర్శలకు ఈ విజయం సమాధానంగా నిలిచింది. జూబ్లీహిల్స్‌లో కష్టపడిన నాయకత్వం, అభ్యర్థి పట్టుదల, వ్యూహాత్మక రాజ కీయాలు, కాంగ్రెస్‌కు ఈ ప్రతిష్టాత్మక స్థానం దక్కేలా చేశాయి. ఈ విజయం హైదరాబాద్ పాలిటిక్స్‌లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం స్పష్టంగా కనబడుతోంది.
సానుభూతిని చీల్చేసిన విభేదాలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాగంటి కుటుంబానికి శిరోభారం కలిగించాయి. సెంటిమెంట్ ప్రాతిపదికన గెలుపుపై నమ్మకం పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీని కుటుంబ కలహాలు దెబ్బతీశాయి. ఎన్నికల ముందు మాగంటి కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, లుకలుకలు బీఆర్ఎస్‌కు అతిపెద్ద నష్టాన్ని కలిగించాయి. మాగంటి తల్లి, మొదటి భార్య, కొడుకు తెరపైకి వచ్చి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతిని చీల్చి, బీఆర్ఎస్ అభ్యర్థి విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపాయి. స్థానిక ఓటర్లలో ఇది గందరగోళాన్ని సృష్టించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా జూబ్లీహిల్స్ గులాబీ పార్టీకి కంచుకోట అని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్స్‌లో బొక్క బోర్లా పడింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి పనిని భూతద్దంలో పెట్టి చూపించిన బీఆర్ఎస్ శ్రేణులు విపరీతమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేశాయి. అలాగే బీఆర్ఎస్ ఓటమికి అత్యంత బలమైన కారణం టీడీపీ ఓటర్ల మద్దతు కోల్పోవడం.
స్థానిక నాయకత్వం వైపు ఓటర్ల మొగ్గు
గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన జూబ్లీహిల్స్ ఈసారి సెంటిమెంట్‌ని పక్కనబెట్టి స్థానిక నేత నవీన్ యాదవ్‌వైపు మొగ్గు చూపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికి, 23 నెలల కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అటూ ప్రధాన, ప్రతిపక్షాలు సవాలు చేసినప్పటికీ తమ చాయిస్ పట్ల జూబ్లీ ఓటర్లు పరిణతి చూపారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలతో ప్రభావం చూపిన నవీన్ యాదవ్ తమకు అందుబాటులో ఉంటాడనే విశ్వాసంతో భారీ మెజారిటీతో గెలిపించు కున్నారు. కాగా మూడు ఎమ్మెల్సీ స్థానాలను వరుసగా కైవసం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని డిపాజిట్ సైతం కోల్పోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్థానాన్ని మరింతగా బలపరిచిన ఎన్నికగా జూబ్లీహిల్స్ ఫలితం నిలిచిపోతుంది.
-ప్రత్యూష
73964 94557






