గందరగోళంగా బీసీ బంద్.. ఈ బంద్‌లో ఎవరు ఎవరిని నిరసించారు?

by Ravi |   (  Updated:2025-10-24 01:00:34  IST  )

యుద్ధం అంటే శత్రువు ఉండాలి.. కానీ ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువో తెలీదు.. అందరూ ఒకే యుద్ధ శిబిరంలో ఉన్నారు.. వలస పాలన నుంచి విముక్తి కావాలంటూ స్వాతంత్ర్య పోరాటం..

గందరగోళంగా బీసీ బంద్.. ఈ బంద్‌లో ఎవరు ఎవరిని నిరసించారు?
X

యుద్ధం అంటే శత్రువు ఉండాలి.. కానీ ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువో తెలీదు.. అందరూ ఒకే యుద్ధ శిబిరంలో ఉన్నారు.. వలస పాలన నుంచి విముక్తి కావాలంటూ స్వాతంత్ర్య పోరాటం.. నిజాం నవాబును గద్దె దించాలంటూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ తెలంగాణ ఉద్యమం.. ఇలా ప్రతి ఉద్యమానికి ఓ శత్రువు, గమ్యం ఉన్నాయి. కానీ గత శనివారం నాటి బీసీ బంద్‌లో శత్రువు ఎవరో తెలియకుండానే బంద్ రూపంలో పోరాటం చేశారు..

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత, రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు డిమాండ్‌తో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌‌లో బీసీ రిజర్వేషన్ల అనుమతి కోరేవారు శిబిరంలో ఉన్నారు.. విచిత్రంగా అనుమతి ఇవ్వాల్సిన వారూ అదే శిబిరంలో ఉన్నారు.. ఆ బంద్‌ను చూస్తే రాజుగారి దేవతా వస్త్రాలు కథ కచ్చితంగా గుర్తుకు వస్తుంది.. దేశ చరిత్రలో కనివిని ఎరుగని బంద్ ఇదే అంటే అతిశయోక్తి కాదేమో..? అని పలువురు రాజకీయ పరిశీలకులు, మేధావుల అభిప్రాయం..

ఎవరిపై నిరసన తెలియజేస్తున్నారు..?

బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండుతో అఖిల పక్షాల ఆధ్వర్యంలో గత శనివారం రాష్ట్ర బంద్ నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీల వారు తమ నాయకులు, కార్యకర్తలకు పిలుపులిచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో సవరణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆశ్చర్యకరంగా ఆ పార్టీ వారూ ఈ బంద్‌లో పాల్గొన్నారు. 9వ షెడ్యూల్‌లో సవరణ సాధించిన తమిళనాడు ప్రభుత్వం ఇవాళ ఆ రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు పొందుతోంది. తమిళనాడు తరహాలో పోరాటం చేయాల్సిన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ శనివారం నాటి బంద్‌లో పాల్గొంది.. దీంతో ఎవరిపై ఎవరు నిరసన వ్యక్తం చేస్తున్నారో అర్థం కాక సామాన్యులు జుట్టు పీక్కున్నారు. చట్ట సభల్లో పోరాడాల్సిన గెలిచిన నాయకులు నడి వీధికి ఎందుకు ఎక్కారో అర్థం కాకుండా ఉందని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇదిలా ఉంటే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుటకు తీసుకెళ్లకుండా ఒంటరి ప్రయాణం ఎందుకు చేశారని బీఆర్ఎస్ పార్టీ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్య నాయకులు కనిపించకుండానే..

ఇక తానా తందానా అనే చిన్నా చితకా పార్టీలు తమ గత కాలపు ఉద్యమ ప్రస్థానాలను విస్మరించి గాలివాటు నిర్ణయాలతో ప్రజలను గందరగోళానికి నెట్టేశాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఏ హింసాయుత ఘటన జరగకుండా బంద్ విజయవంతంగా జరిగింది. అయితే, ఆశ్చర్యకరంగా ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో రిజర్వేషన్లపై సవాళ్లు విసురుకున్న రాజకీయ పార్టీల కొందరు ముఖ్య నాయకులు, ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు బంద్‌లో కనిపించలేదు. కొన్ని పార్టీల నాయకులు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఆ ప్రాంత బీసీలంతా గొంగట్లో కూర్చుని ఏదో ఏరుకున్నట్లా? అనేది ప్రధాన ప్రశ్న.

నష్టపోయింది సామాన్యులే..

శనివారం బంద్ దృష్ట్యా ఏ ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. ఎక్కడ ఆందోళనకారులు ఇబ్బందులు సృష్టిస్తారో అని. కానీ అంత పరిస్థితి కనిపించలేదు. కరెక్టుగా బంద్ తర్వాతి రోజు నుండి దీపావళి సెలవులు రావడంతో హైదరాబాద్‌, ఇతర పట్టణాల నుంచి సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి సందులో సడేమియాగా ఆటోల వారు, ప్రైవేట్ వావానాల వారు ఛార్జీలను రెండు, మూడింతలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు మూసేయడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లింది. దుకాణాలు యధావిధిగా తెరిచారు. చిత్రమేమిటంటే శనివారం బంద్ ఉన్నట్లు తమకు సమాచారం కూడా ఇవ్వలేదని పలు దుకాణాల వారు అంటున్నారు. ఇదీ బంద్‌పై రాజకీయ పార్టీల నిబద్ధత అని సామాన్య ప్రజల ఆవేదన. న్యాయస్థానం మాత్రం తమ పని తాము నింపాదిగా చేస్తూ ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలంటూ తాఖీదు జారీ చేసింది.

స్థానిక సంస్థలకే పరిమితమైతే..?

ఈ రిజర్వేషన్ల వివాదం స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితమైతే ఉపయోగం అంతంత మాత్రమే అని విద్యావంతుల ఆవేదన. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా సవరణ చేస్తేనే ప్రయోజనం ఉంటుందని వారి వాదన.. ఏం జరుగుతుందో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

-రవీంద్రబాబు గండెల

93900 90235

Next Story