- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థి సంఘం ఎన్నికలు జరపండి!
విద్యార్థి రాజకీయాలు రావాలనే సీఎం రేవంత్ ప్రకటన విశ్వ విద్యాలయ విద్యార్థులైన మాకు ఓ ఆశను రేకెత్తించింది.

విద్యార్థి రాజకీయాలు రావాలనే సీఎం రేవంత్ ప్రకటన విశ్వ విద్యాలయ విద్యార్థులైన మాకు ఓ ఆశను రేకెత్తించింది. విద్యార్థుల్లో రాజకీయ పరిపక్వతను సహించలేని ఈ స్థితిలో రేవంత్ ప్రకటన గొప్ప ఊరట కల్పించింది. అయితే, ఈ ఆకాంక్ష ఆచరణ రూపం దాల్చేందుకు గొప్ప అవకాశం ఉన్నది. దశాబ్దాలుగా నిషేధించబడిన విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే విశ్వ విద్యాలయాల్లో, రాజకీయాల్లో ఎన్నో చిక్కుముడులకు పరిష్కారం చూపిన వారవుతారు.
విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తున్న కేంద్ర విశ్వవిద్యాలయాలు చదువులో పురోగమిస్తున్నాయి. కొత్త నాయ కత్వాన్ని అందిస్తున్నాయి. సమాజ చలనశీలత పరిక్షిస్తున్నాయి. సమీక్షిస్తున్నాయి. విశ్లేషిస్తున్నాయి.
ఆందోళన వద్దే ఆగిపోయాయి..
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశ రాజకీయ దశ దిశను మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాల విశ్లేషణ చేసిన ఓయూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విశ్లేషణ నుంచి విషాదంలోకి వెళ్లిపోయింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయాలకు దీటుగా ఉస్మానియాను మెరుగుపరచకుండా ఉరికంబం మీద నిల్చోబెట్టారు. మనిషిని ఉరికంబం మీద నిల్చోబెట్టినప్పుడు చివరి కోరిక ఏంటని అడుగుతారు కానీ, ఓయూకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. గతంలో రేవంత్ టీమ్‌లో పని చేసిన అనుభవం, దగ్గరి నుంచి చూసిన అనుభవం రీత్యా రేవంత్ నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్నది. ఆశ అంపశయ్య మీద ఉన్న ఈ సమయంలో విద్యార్థి రాజకీయాల ప్రస్తావన ఆశను కల్పించింది. విద్యార్థి సంఘ ఎన్నికలు జరుగుతున్న సెంట్రల్ వర్సిటీలు, విద్యార్థి ఎన్నికల్లేని రాష్ట్ర వర్సిటీల మధ్య వ్యత్యాసం గమనించారా? చదువుల్లో, పరిశోధనల్లో సెంట్రల్ వర్సిటీలు రాటుదేలుతుంటే...ఓయూ వంటి రాష్ట్రీయ విద్యాలయాలు ఇంకా నాసిరకం భోజనం అందిస్తున్నారనే ఆందోళనల వద్దే ఆగిపోయాయి. ప్రొఫెసర్ల కొరత విషయం వద్దే ఆగిపోయాయి. ఎందుకీ పరిస్థితి? ఎందుకీ వ్యత్యాసం?
విద్యార్థి సంఘాలు దారితప్పాయి..
రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా విద్యార్థి సంఘలు పుట్టుకొస్తున్నా..విద్యార్థి సమస్యలపై నిలదీసే చైతన్యవంతమైన విద్యార్థి సంఘాలు ఎప్పుడో ట్రాక్ తప్పాయి. అందుకే బాధ్యతయుతమైన విద్యార్థి సంఘం, విద్యార్థులకు జవాబుదారీగా ఉండే గుర్తింపు సంఘం ఉండాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం విద్యార్థి సమస్యలపై మాత్రమే పరిమితం కాదు. ఇక్కడి ఈ చైతన్యం తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలను ఎత్తిపడుతోంది. మీరు గమనించారా? పార్లమెంట్, అసెంబ్లీలో క్రిమినల్ స్వభావం ఉన్న నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లు సమాజానికి ఏ సందేశం ఇస్తారు? వీళ్లు ఎవరికోసం చట్టాలు రూపొందిస్తారు? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని మౌనముని అని ఎగతాళి చేసిన నోళ్లు.. ఆయన మరణం తర్వాత ఆకాశానికి ఎందుకు ఎత్తారు. కారణం తన ప్రతిభ, చదువు. విశ్వవిద్యాలయాల్లో తను నేర్చుకున్న విలువలు.. అందుకే విశ్వ విద్యాలయాల్లో ఎన్నికల నిర్వహణ జరగాల్సి ఉంది.
ఎప్పుడో హత్య జరిగిందని..
ఎప్పుడో ఓ హత్య జరిగిందని ఎన్నికలు నిషేధించారు. అలిపిరిలో చంద్రబాబుపై ఎటాక్ జరిగిందని... తిరుపతి వెళ్లడం ఆయన మానేశారా? రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటమి పాలయ్యాడని రాజకీయాల నుంచి తప్పుకున్నారా? అంబర్‌పేట్‌లో కిషన్ రెడ్డి ఓడిపోయాడు అని రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? అందుకే.. ఓ ఘటనను సాకుగా చూపి కాలయాపన చేయడం సరైంది కాదు.. అవసరమైతే లింగ్డో కమిషన్ సిఫార్సులను అమలు చేయండి. కానీ ఎన్నికల నిర్వహణకు పూనుకొని.. తెలంగాణ వర్సిటీలో ఓ చరిత్రత్మక ఘట్టానికి ఊపిరిలూదండి.
ప్రశాంత్ పగిళ్ళ
ఓయూ విద్యార్థి
95812 62429






