కామన్ మ్యాన్ డైరీ: కుక్క కాటుకు చెప్పు దెబ్బ

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ: కుక్క కాటుకు చెప్పు దెబ్బ
X

అక్కడి ఇల్లు అమ్మేసి హైదరాబాద్ తిరిగొచ్చారు. ఇక్కడ మాట్లాడే వాళ్లు లేరు.. ఊరికి వెళ్తే పట్టించుకునే వాళ్లు లేరు.. నాలుగెకరాల భూమి ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.. బాల్య మిత్రులు సైతం ఫోన్లు ఎత్తడం లేదు. అమ్మ చనిపోయినప్పుడు వచ్చినా.. నాన్న కన్నుమూసినప్పుడు వచ్చినా బాగుండేదనుకున్నాడు.. కోట్లు సంపాదించినా ఆ ఆదరణ పొందలేకపోతున్నాననే మనో వేదన వసంత్ ను వెంటాడుతూనే ఉన్నది. బిడ్డను ప్రయోజకుడిని చేసేందుకు ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఊరోళ్లంతా కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

వరంగల్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కృష్ణకు ఒక్కగానొక్క కొడుకు వసంత్ కుమార్. కృష్ణకు నాలుగెకరాల సాగు భూమి ఉన్నది. పత్తి, మిర్చి మాత్రమే పండుతుంది. కొడుకు ప్రయోజకుడు కావాలని కలలుగన్న కృష్ణ.. వసంత్‌ను వరంగల్‌లోని కార్పొరేట్ కాలేజీలో చదివించాడు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని ఓ పేరున్న ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. కొడుకును విడిచి ఉండలేక.. ఊళ్లో ఉన్న సాగు భూమిని కౌలుకు ఇచ్చి హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు కృష్ణ ,శ్యామల దంపతులు. కృష్ణ ఖాళీగా ఉండలేక బంధువుల రియల్ ఎస్టేట్ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం చేసేవాడు.

వసంత్ కుమార్ ఇంజినీరింగ్ పూర్తయింది. కాలేజీ నుంచే ఇంటర్న్‌షిప్ కోసం అమెరికాకు వెళ్లే అవకాశం వచ్చింది. మంచి అవకాశం జారవిడుచుకోవద్దనుకుంటూనే.. వసంత్ కుమార్‌ను అమెరికా పంపారు. కొడుకు వెళ్లి వారం రోజులు గడిచింది. హైదరాబాద్​ లో ఉండటం ఎందుకనుకొని మళ్లీ ఊరి బాట పట్టారు. రోజూ కొడుకుతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఆరు నెలల్లో ఇంటర్న్ షిప్ కంప్లీట్ అయ్యింది. అదే సంస్థ భారీ ప్యాకేజీతో కొలువు ఇచ్చింది.

*

కృష్ణ, శ్యామల దంపతులు సంతోషపడ్డారు. కానీ, బిడ్డ తమ వద్ద లేడనే బాధ వాళ్లను వెంటాడుతున్నది. ఏడాది పూర్తయ్యాక స్వగ్రామానికి వచ్చాడు వసంత్ కుమార్. నెల రోజులున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన మేన మరదలును పెళ్లి చేసుకోమ్మని బతిమాలారు. 'ఇప్పుడే వద్దు. వచ్చే ఏడాది చేసుకుంటానంటూ'మళ్లీ అమెరికా బాటపట్టాడు వసంత్ కుమార్. అమెరికా వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు కాల్ చేశాడు. తనకు మరదలంటే ఇష్టం లేదని, తనను ఆ భావనతో ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. చిన్నప్పటినుంచి అనుకున్నం కదా అంటూ వాదనకు దిగారు శ్యామల, కృష్ణ... వసంత్ కుమార్ మాత్రం దిగి రాలేదు. తను సాఫ్ట్‌వేర్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాడు. కొడుకును చెడామడా తిట్టేసి ఫోన్ పెట్టేశారు. రెండు రోజులు గడిచిపోయాయి. విషయాన్ని తమ్ముడికి చెప్పింది శ్యామల. 'మీకు మాకు తెగదెంపులు.. ఇక మీ బంధుత్వమే వద్దన్నాడు' శ్యామల తమ్ముడు శ్రీను. రక్తసంబంధం దూరమై పోయిందనే బాధ శ్యామలను వెంటాడుతున్నది.

నాలుగు రోజుల తర్వాత వసంత్ ఫోన్ చేశాడు. తనతో ఉద్యోగం చేస్తున్న నల్లగొండ జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కులం, గోత్రం అన్నీ ఒక్కటే అన్నాడు. ఏదైతేనేం సరే అనుకున్నారు. నెల రోజుల తర్వాత స్వగ్రామానికి వచ్చాడు వసంత్.. వారం రోజులు గడిచాక నల్లగొండ వెళ్లి లాంఛనం ప్రకారం పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. వరంగల్ లో పెళ్లి చేయాలంటే వాళ్లు ససేమిరా అన్నారు. హైదరాబాద్‌లో నే చేస్తామని పట్టుబట్టారు. బంధువులు అక్కడే ఉంటారు. వారు రావడానికి ఇబ్బంది పడతారని ఎంత చెప్పినా వినలేదు. ఎట్టకేలకు హైదరాబాద్‌లోనే వేదికను ఖరారు చేశారు. ఊళ్లో నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేసి సమీప బంధువులను తీసుకొచ్చి పెళ్లి చేశారు. నెల రోజులు గడిచిపోయాయి.

*

వసంత్..నవ్య దంపతులు మళ్లీ అమెరికా బాట పట్టారు. రెక్కలు ముక్కలు చేసుకొని, ఆశలెన్నో పెట్టుకొని చదివించిన కొడుకు తమను విడిచి వెళ్తుంటే లోలోపల బాధపడుతూనే పైకి ఆనందాన్ని నటించారు కృష్ణ, శ్యామల. శంషాబాద్ వరకు వచ్చి సాగనంపారు. నల్లగొండ నుంచి అత్తింటి తరఫు బంధువులు కూడా వచ్చి సెండాఫ్ ఇచ్చారు. ఆరు నెలలు గడిచాయి. ఒంటరైపోయామన్న బెంగ శ్యామలను వెంటాడుతున్నది. అదే బెంగతో పక్షవాతం బారిన పడింది. ఒక కాలు చేయి పనిచేయడం లేదు.

కృష్ణ సపర్యలు చేస్తున్నారు. కనీసం మాట్లాడేవారు కరువయ్యారు. కొడుక్కు ఫోన్ చేశాడు కృష్ణ. విషయం చెప్పి బోరున విలపించాడు. డబ్బులు పంపుతున్నానని, మంచి దవాఖానలో చూపించాలని చెప్పాడు కొడుకు. 'అమ్మ నిన్ను చూడాలని కోరుకుంటుంది రా బిడ్డా' అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు కృష్ణ. 'నాకు సెలవులు దొరకడం లేదు నాన్న.. ఇబ్బందిగా ఉంది..' రాలేను.. మీరు మంచి దవాఖానలో చూపించండి.. నల్లగొండలో ఉండే మా మామయ్యకు చెప్పాను. అతను వస్తాడన్నాడు వసంత్..

*

రెండు రోజుల తర్వాత వియ్యంకుడు శేఖర్, వియ్యంకురాలు సుభద్ర వచ్చారు. 'ఎల్లుండి హైదరాబాద్ తీసుకొని రండి. మేం నల్లగొండ నుంచి వస్తాం'అంటూ వెళ్లిపోయారు. వియ్యంకురాలు నాలుగు రోజులుండి తన భార్యకు సపర్యలు చేస్తుందని ఆశపడ్డ కృష్ణకు నిరాశే మిగిలింది. ఇంటి పక్కన ఉండే సుమన్ అనే అబ్బాయిని తోడుగా తీసుకొని కారులో హైదరాబాద్ తీసుకెళ్లి చూపించారు. ఇప్పుడేమీ చేయలేమని మందులు వాడటం, ఫిజియోథెరపీ చేయించడం చాలన్నారు. వరంగల్‌లో ఉన్న ఓ ఫిజియో థెరపిస్ట్‌ను హోం సర్వీస్ ఇవ్వుమని కోరారు. ఆయన వచ్చి రోజూ థెరపీ చేసి వెళ్తున్నాడు.

ఓ రోజు రాత్రి భార్యకు అన్నం తినిపించి పక్కనే ఉన్న మంచంపై నడుం వాల్చాడు. అంతలోనే ధడేల్ మని శబ్దం వినిపించింది.. శ్యామల కింద పడిపోయింది.. భార్యను పైకి లేపాడు.. శ్యామల.. శ్యామాలా అంటూ పిలిచాడు. ఏ చప్పుడూ లేదు. భయం వేసింది. ఇంటి పక్కనే ఉన్న సుమన్‌ను పిలిచాడు.. 'మీ చిన్నమ్మ ఎటో చేస్తుంది రా బిడ్డా'అంటూ అరిచాడు. సుమన్ వచ్చాడు. అంబులెన్సుకు ఫోన్ చేశాడు. వరంగల్‌లోని దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే తనువు చాలించిందన్నారు డాక్టర్లు. కృష్ణ భోరున విలపించాడు.

*

ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కొడుక్కు ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు. అయ్యో.. అంటూ బాధపడటం మినహా ఏమీ చేయలేదు.శవాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఇంటికి ఊరోళ్లు ఫ్రీజర్ తెచ్చారు. శవాన్ని ఫ్రీజర్ లో పెట్టారు. కొడుకు అమెరికా నుంచి వచ్చి అంత్యక్రియలు చేస్తారని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతలోనే అమెరికా నుంచి వసంత్ ఫోన్ చేశాడు. తనకు రావడం కుదరని, మీ కోడలుకు సెలవు ఇవ్వడం లేదన్నాడు. మీరు కానిచ్చేయండి అన్నాడు. ఊరోళ్లంతా నోరెళ్లబెట్టారు. వృద్ధులైతే తిట్లు, శాపనార్థాలు పెట్టారు. కడచూపునకు నోచుకోలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. కార్యక్రమాలన్నీ కృష్ణ పూర్తి చేశారు. నల్లగొండ నుంచి వచ్చిన వియ్యంకులు, వియ్యంకురాలు మరుసటి రోజు వెళ్లిపోయారు.

*

ఇప్పుడు లంకంత ఇంట్లో కృష్ణ ఒక్కడే! ఓ మూలన పడి ఉండలేకపోతున్నాడు. శ్యామల జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తున్నాడు. కర్మకాండ కంప్లీట్ అయ్యింది. ఇంట్లో ఒక్కడు ఉండలేక..ఊరిడిచి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇంట్లోకి వెళ్లాలంటే భయం వెంటాడుతున్నది. ఒక్కడి కోసం ఏం వంట చేసుకోవాలంటూ పస్తులుంటున్నాడు. ఊరి హోటల్‌లో చాయి తాగే బతికేస్తున్నాడు.

ఓ రోజు రాత్రి మెలకువొచ్చింది.. ఇంట్లో ఉండలేక రోడ్డెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా భారీలోడ్ తో వస్తున్న వాహనం ఢీకొట్టడంతో కృష్ణ చనిపోయాడు.దేహం తునాతునకలైంది.. చుట్టుపక్కల వాళ్లు వసంత్ కు కాల్ చేశారు. విషయం చెప్పారు. కన్నీరు పెట్టుకున్నాడు. అంత్యక్రియలకు రావడం కుదరదని తన భార్య అదే రోజు ఉదయం డెలివరీ అయ్యిందన్నాడు. చుట్టుపక్కలవారు అంత్యక్రియలు నిర్వహించారు. ఎప్పటి మాదిరిగానే నల్లగొండ నుంచి వియ్యంకుడు, వియ్యంకురాలు వచ్చి అంత్యక్రియలయ్యాక వెళ్లిపోయారు.

*

ఊరోళ్లు నానా శాపనార్థాలు పెట్టసాగారు. పైసలెందుకు అయ్య అవ్వకు తలకొరివి పెట్టనోడు..పుట్టెందుకు,. సచ్చెందుకు అంటూ నానా బూతులు తిట్టసాగారు. రెండేళ్లు గడిచాయి. వసంత్ హైదరాబాద్​ లోని గచ్చిబౌలీలో విల్లా కొన్నాడు. భార్యను తీసుకొని హైదరాబాద్​ వచ్చాడు. కొత్త ఫ్లాట్ లో దిగాడు. గృహప్రవేశం అయిపోయింది. ఊరికి వెళ్లాడు. ఇల్లు శిథిలావస్థకు చేరింది. రిపేర్ చేయించాలనుకున్నాడు. ఎవరూ సహకరించలేదు. కనీసం కాలు ఆపి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. సాయంత్రం వరకు చూసి హైదరాబాద్ వెళ్లిపోయారు. నాలుగు ఎకరాల భూమి కూడా బీడుగా ఉంటున్నది. చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మళ్లీ అమెరికా ఫ్లయిట్ ఎక్కారు. అమెరికాలో కొత్త ఇల్లు కొన్నారు. అత్త,మామలను పిలుచుకొని నూతన గృహప్రవేశం చేశారు.

బిడ్డ పద్నాలుగేళ్ల అమ్మాయి అయ్యింది.స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకున్నారు. అక్కడి ఇల్లు అమ్మేసి హైదరాబాద్ తిరిగొచ్చారు. ఇక్కడ మాట్లాడే వాళ్లు లేరు.. ఊరికి వెళ్తే పట్టించుకునే వాళ్లు లేరు.. నాలుగెకరాల భూమి ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.. బాల్య మిత్రులు సైతం ఫోన్లు ఎత్తడం లేదు. అమ్మ చనిపోయినప్పుడు వచ్చినా.. నాన్న కన్నుమూసినప్పుడు వచ్చినా బాగుండేదనుకున్నాడు.. కోట్లు సంపాదించినా ఆ ఆదరణ పొందలేకపోతున్నాననే మనో వేదన వసంత్ ను వెంటాడుతూనే ఉన్నది. బిడ్డను ప్రయోజకుడిని చేసేందుకు ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఊరోళ్లంతా కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

మరిన్ని కామన్ మ్యాన్ డైరీ స్టోరీల కోసం క్లిక్ చెయ్యండి


ఎంఎస్‌ఎన్ చారి

79950 47580



Next Story

Most Viewed