సహజీవనం vs వివాహబంధం.. ఏది సిసలైన జీవన మార్గం?

by Ravi |   (  Updated:2025-07-05 01:00:24  IST  )

ఇటీవలి కాలంలో వివాహేతర సహజీవన బంధాలపై దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. పెళ్లి చేసుకోకుండానే కలిసి

సహజీవనం vs వివాహబంధం.. ఏది సిసలైన జీవన మార్గం?
X

ఇటీవలి కాలంలో వివాహేతర సహజీవన బంధాలపై దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించడాన్ని స్వేచ్ఛగా భావిస్తే, అది సమాజం, కుటుంబ వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తుందా? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. కొందరు దీన్ని సమర్థిస్తూ, మానవ సంబంధాల ప్రామాణిక నైతిక నిర్మాణాన్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు.. అయితే, ఇది వ్యక్తిగత నిర్ణయం అనిపించినప్పటికీ దీని ప్రభావం సమాజంలోని పునాది వ్యవస్థనే ఢీ కొట్టే ప్రమాదం ఉంది.

భారతీయ సంస్కృతి వివాహాన్ని ఒక వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య ఏర్పడే సామాజిక ఒప్పందంగా కూడా పరిగణిస్తుంది. ఇది జీవితకాల పయనానికి శాశ్వత ప్రతిజ్ఞగా ఉంటుంది. ఈ బంధంలో గౌరవం, నిబద్ధత, పరస్పర బాధ్యత వంటి మూల విలువలు ఉంటాయి. కానీ సహజీవనం అనేది తాత్కాలిక అంగీకారంతో మొదలై, తక్కువ బాధ్యతతో నడిచే ఓ అస్థిరమైన జీవన పద్ధతి. ఈ బంధంలో స్థిరమైన నిబద్ధత ఉండదు. ఈ బంధంలో ఉన్నవారికి ఎప్పుడైనా విడిపోవచ్చన్న భావన ఉండటం వల్ల, అది ప్రేమను స్థిరమైన భావంగా కాకుండా, తాత్కాలిక అవసరంగా మారుస్తుంది.

తాత్కాలిక బంధాల వలన..

ప్యూవ్ రీసెర్చ్ సంస్థ 2021 నివేదిక ప్రకారం, వివాహితులలో 78 శాతం మంది తమ బంధంపై భద్రతా భావన కలిగి ఉన్నారు. కానీ సహజీవన బంధాల్లో ఈ నమ్మకం 55 శాతం మేరకే ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, తాత్కాలికంగా ఏర్పడే బంధాల్లో స్థిరత్వం, గౌరవం, భద్రత వంటి అంశాలు మిగిలిన జీవితం మీద ప్రభావం చూపుతాయి. ఇందులో భార్యాభర్తల మధ్య ఉండే సామరస్యత కొరవడుతుంది. పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ బంధాల్లో పుట్టి పెరిగే పిల్లలకు కుటుంబ అనుభవం లభించదు.. తల్లిదండ్రుల మధ్య విభేదాలు పిల్లల్లో అస్థిరత, ఒంటరితనం, విశ్వాస లోపం, విద్యాభ్యాసం మీద ప్రభావం వంటి దుష్పరిణామాలు ఏర్పడతాయి.. ఈ బంధాల్లో పెరిగిన పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదయ్యాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. భారతదేశ భవిష్యత్తు సుస్థిరంగా ఉండాలంటే, మనం పిల్లలకు భద్రతతో కూడిన జీవన పునాది అందించాలి. అది పూర్తిస్థాయి కుటుంబం నుంచే వస్తుంది.

సహజీవనం చట్టబద్ధమే కానీ..

ఇక చట్టపరంగా చూస్తే, సహజీవనం తప్పుకాదని కోర్టులు పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డాయి. కానీ అది చట్టబద్ధతే తప్ప, సామాజిక లేదా నైతిక అంగీకారం కాదు. భారత న్యాయవ్యవస్థ సహజీవన బంధాన్ని 'లెజిటిమేట్'గా గుర్తించినా, అదే బంధాన్ని ఆదర్శంగా, శ్రేష్టంగా ప్రమాణీ కరించలేదు. కొన్ని సందర్భాల్లో మహిళల హక్కులను కాపాడేందుకు మాత్రమే ఈ బంధాన్ని ఆమోదించింది. కుటుంబ కోర్టుల్లో, పిల్లల సంరక్షణ విషయంలో, ఆస్తి హక్కుల విషయంలో సహజీవన బంధాల చట్టపరమైన పరిమితి స్పష్టంగా తెలుస్తుంది. భారతీయ సంస్కృతి, ధార్మిక వ్వవస్థ సహజీవనాన్ని సమర్ధించలేదు.. పైగా అన్ని ప్రధాన మతాలు నైతిక జీవనశైలిని వివాహ బంధం ద్వారానే కట్టుబడి ఉండాలన్న భావనను ప్రతిపాదించాయి. సహ జీవనం అనేది ఈ బంధాన్ని ధ్వంసం చేసే మార్గం. ఇది ఇంద్రియానుభూతిపై ఆధారపడి, బాధ్యతల నుండి తప్పుకునే విధానంగా ఉంది.

ఇది అనైతికతను ప్రోత్సహించే ముసుగు..

భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది ప్రపంచంలోని అత్యంత బలమైన సామాజిక నిర్మాణాలలో ఒకటి. ఒకే ఇంట్లో మూడు తరాలూ కలిసి నివసించగలిగే సామరస్యం ఇందులో ఉంది. చిన్నారులకు, యువతకు, వృద్ధులకు ఇదొక భద్రతా వ్యవస్థ. వివాహేతర బంధాలు ఈ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. యువత ప్రేమను గౌరవించాలి. కానీ ప్రేమ పేరుతో బాధ్యతను విస్మరించి, తాత్కాలిక అవసరంగా ఒకరి మీద ఒకరు ఆధారపడే పరిస్థితిని బలపరచడం సమాజాన్ని నైతికంగా సంక్షోభంలోకి నెట్టే చర్య. బాధ్యత తీసుకునే ధైర్యం ఉన్నప్పుడే ప్రేమకు విలువ ఉంటుంది. ప్రేమను శాశ్వతమైన బంధంగా మలచే ప్రయత్నమే వివాహం. అదే జీవన విధానంగా నిలవాలి. సహజీవనం అనేది స్వేచ్ఛ పేరుతో అనైతికతను ప్రోత్సహించే ముసుగు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. దీర్ఘకాలికంగా కలిసి జీవించదగిన మార్గం కూడా కాదు. భారతీయ విలువలు, కుటుంబ నిర్మాణం, మానవ సంబంధాల్లో స్థిరత్వం ఇవన్నీ బలపడాలంటే మనం వివాహ వ్యవస్థను మరింతగా సమర్థించాలి. ఒక బంధం నిలవాలంటే అది నైతికంగా, చట్టపరంగా, మానవీయంగా స్థిరంగా ఉండాలి. అందుకే సహజీవనం కాదు, వివాహ బంధమే అసలు సిసలైన జీవన మార్గం.

- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Next Story