- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాక్రోచ్ జనతా పార్టీ.. నిరుద్యోగ యువత ఆవేదనకు డిజిటల్ ప్రతీక
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, యువతలో అసంతృప్తి, సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనుక ఉన్న ఆవేదన, రాజకీయ సందేశం, డిజిటల్ ఐడెంటిటీ పాలిటిక్స్‌పై విశ్లేషణ.

దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. డిగ్రీలు, సర్టిఫికెట్లు చేతిలో ఉన్నా ఉద్యోగం దొరకని పరిస్థితి యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఒకవైపు పోటీ పరీక్షల నిర్వహణలో లోపాలు, మరోవైపు ఉద్యోగ అవకాశాల కొరత, ఇంకోవైపు కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు యువతలో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయి. ఈ ఆవేదన, ఆగ్రహం ఇప్పుడు వీధుల్లో కాకుండా సోషల్ మీడియా వేదికలపై కొత్త రూపంలో వ్యక్తమవుతోంది. అలాంటి నేపథ్యంలోనే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) అనే వ్యంగ్య డిజిటల్ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు 9% పైగా ఉంటే దానికంటే ఆరు రెట్లు ఎక్కువగా యువత నిరుద్యోగిత ఉంది. యువతలో ప్రతి ఇద్దరిలో ఒకరు నిరుద్యోగి. ఉద్యోగాల కోసం యువత పోరుబాట పట్టింది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో 80 శాతం నిరుద్యోగిత ఉన్నదంటే నమ్మగలమా?
సీజేపీ.. ఒక తరం ఆవేదన
మే నెల 15న ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా.. నిరుద్యోగులను బొద్దింకలు (కాక్రోచ్)తో పోల్చుతూ వ్యాఖ్యానించిన 48 గంటల్లో బోస్టన్ వర్సిటీలో చదువుతున్న అభిజీత్ సీజేపీ పేరిట కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ (వ్యంగ్య) పోస్టులతో ఉద్యమం లేవదీశారు. నిరుద్యోగం, ప్రభుత్వాల విధానాల లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే ఆ ఉద్యమానికి దేశంలోని యువత లక్షల్లో ఆకర్షితులయ్యారు. సీజేపీ ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య వారం రోజుల్లోనే రెండు కోట్లకు చేరడాన్ని బట్టి యువతలో, నిరుద్యోగుల్లో అసంతృప్తి, నిరసన, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. దేశాన్ని షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విస్ఫోటనం ఇక్కడి యువతలో, ముఖ్యంగా నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న నిరసనాగ్నికి ప్రతిరూపం. కాగా సీజేపీ ఎత్తుకున్న సోషల్ మీడియా ఉద్యమం లావాలా ఎగసి పడుతుండటం, తక్కువ సమయంలోనే అత్యధిక ఫాలోవర్లతో సంచలనం కలిగించడం జరిగింది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) అనే వ్యంగ్య ఉద్యమం వెనుక దాగి ఉన్నది నవ్వు కాదు.. అవకాశాలు కోల్పోయిన తరం ఆవేదన.
మాటలు తప్పారు.. కోటలు కట్టారు!
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతోంది. అధికారంలోకి రాకముందు మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చి మాట తప్పారు. మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటివి నిరుద్యోగులను వెక్కిరిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎఫ్ఎఐలు, పెట్టుబడులు కార్పొరేట్లకే లాభిస్తున్నాయి. వాళ్ల కోసమే లేబర్ కోడ్‌లు. ప్రభుత్వ రంగంలో కొత్త రిక్రూట్మెంట్లు లేవు. డిజిల్ పేరిట ఉద్యోగాలు రద్దవు తున్నాయి. అవినీతి, నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వంటి వాటితో యువతలో, నిరుద్యోగుల్లో అసహనం తీవ్రమవుతోంది. సీజేపీ రేపిన సంచలనం సారాంశం ఇదే.
డిజిటల్ ఐడెంటిటీ పాలిటిక్స్..
2026 మే 16న అభిజీత్ దీప్కే ప్రారంభించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' మొదట సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టుల రూపంలో కనిపించింది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ చేసిన “బొద్దింకలు, పరాన్నజీవులు” వ్యాఖ్యల తర్వాత ఈ ఉద్యమం యువతలో వేగంగా వ్యాపించింది. కొద్ది రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించి, ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలకంటే ఎక్కువ చర్చకు దారి తీసింది. భారత యువతలో పెరుగుతున్న 'డిజిటల్ ఐడెంటిటీ పాలిటిక్స్'కు ప్రతీకగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయ పార్టీల జెండాల కింద నిలిచిన యువత, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్‌ల కింద ఏకమవుతోంది. భావోద్వేగాలు, అసంతృప్తి, సామాజిక ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే వేగంగా ఉద్యమాలుగా మారుతున్నాయి. యువత మనస్తత్వంలో వచ్చిన ఈ మార్పును రాజకీయ వ్యవస్థలు అర్థం చేసుకోకపోతే, రేపటి భారత రాజకీయ పటంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఇటీవల నేపాల్‌లో జరిగిన యువత ఉద్యమం ఒక ఉదాహరణ.
రైట్ టు ఎంప్లాయిమెంట్.. రేపటి ఎజెండా
ఇప్పటివరకు యువతను కేవలం ఎన్నికల సమయంలో గుర్తు చేసుకునే రాజకీయ వ్యవస్థ, ఇప్పుడు వారి ఆవేదనను వినకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయ పార్టీలకు ఇది ఒక గుణపాఠం కాబోతోంది. రైట్ టు ఎంప్లాయ్‌మెంట్ వంటి అంశాలు రేపటి రాజకీయ అజెండాలను ప్రభావితం చేస్తుంది. ప్రధాన పార్టీలు యువత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే, సీజేపీ వంటి ప్రత్యామ్నాయ ఉద్యమాలు మరింత బలపడతాయి. ఇవి సంప్రదాయ రాజకీయాలకు సవాల్‌గా మారవచ్చు. అదే సమయంలో, డిజిటల్ కోపం నియంత్రణ కోల్పోతే సామాజిక అస్థిరత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఉద్యమాన్ని కేవలం మీమ్ గ్యాంగ్‌గా తీసి పారేయడం ప్రమాదకరం.
దిక్కులేని యువతాగ్రహమే కాక్రోచ్
దేశ భవిష్యత్తు కావాల్సిన యువత, ఇప్పుడు తమ బాధను కాక్రోచ్ అనే ప్రతీకతో వ్యక్తం చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. మన వ్యవస్థల వైఫల్యానికి ఇది నిదర్శనం. కానీ వాళ్ల కలలు ఎందుకు సాకారం కాలేదో మనం అర్థం చేసు కోవాలి కదా. ఈ బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, విద్యా వ్యవస్థలపై ఉంది. దేశ భవిష్యత్తు యువశక్తిపై ఆధారపడి ఉంటుందనేది తెలిసిందే. జనాభాలో పనిచేసే వయసులో ఉన్నవారి శాతం పెరగడం యువశక్తి పెరుగు దలకు చిహ్నం. ఆర్థికాభివృద్ధిలో క్రియాశీలకంగా పాలు పంచుకునేది దేశాన్ని ముందుకు నడిపించేది వారే. అటు వంటిది వారే నిరాశ నిస్పృహలలో పనిపాట లేకుండా ఉంటే ఇక దేశానికి దిక్కెవరు?
-డాక్టర్ సమర్ స్నేహ ఎనుగొండ
81794 49079






