- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొగ్గు రంగం ప్రైవేట్ బాటలో..
భారతదేశంలో బొగ్గు రంగ ప్రైవేటీకరణ వేగం పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు గనుల వేలం, ఎండీఓ విధానం, ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర, ఇంధన భద్రత, ప్రజా వనరుల పరిరక్షణ వంటి అంశాలపై విశ్లేషణ.

కేంద్ర ప్రభుత్వం బొగ్గు రంగాన్ని మూడు ప్రధాన మార్గాల్లో ప్రైవేటీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. మొదటగా, ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను వెనక్కి తీసుకుని ప్రైవేట్ కంపెనీలకు వేలం వేస్తోంది. రెండవదిగా, ప్రభుత్వ రంగ బొగ్గు గనులను దీర్ఘకాలిక ఎండీఓ (Mine Developer and Operator) విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోంది. మూడవదిగా, ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలలో ప్రభుత్వ వాటాను క్రమంగా తగ్గిస్తూ భవిష్యత్తులో పూర్తి స్థాయి ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తోంది. భారత దేశంలో బొగ్గు రంగ ప్రైవేటీకరణ 1993లో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాల భాగంగా ప్రారంభమైంది. 2015లో కోల్‌మైన్స్ (ప్రత్యేక నిబంధనలు) చట్టం అమల్లోకి రావడంతో బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేట్ కంపెనీలకు కేటాయించే విధానానికి చట్టబద్ధత లభించింది. అనంతరం 2018లో వాణిజ్య బొగ్గు తవ్వకాలకు, 2020లో మినరల్ లాస్ (సవరణ) చట్టం ద్వారా మరింత సరళీకరణకు అవకాశం కల్పించారు. 2026 మార్చి నాటికి ప్రభుత్వం 13 విడతల్లో 135 బొగ్గు గనులను వేలం వేసింది. ఇప్పటికే ప్రైవేట్ క్యాప్టివ్, వాణిజ్య గనులు దేశ బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వేలం వేసిన గనుల్లో అనేకం గతంలో కోల్ ఇండియా, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించినవే కావడం గమనార్హం. ఉత్పత్తి పెంపు పేరుతో ప్రవేశపెట్టిన ఎండీఓ విధానంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, దిలీప్ బిల్డ్‌కాన్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్, ఎన్‌సీసీ వంటి సంస్థలు భాగస్వాములయ్యాయి. అయితే కోల్ ఇండియా, సింగరేణి వంటి సంస్థలకు దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలపై ఆధారపడడం ప్రైవేటీకరణను ముందుకు తీసుకెళ్లడానికేనని విమర్శలు ఉన్నాయి. దేశ విద్యుత్ ఉత్పత్తిలో 70–75 శాతం బొగ్గుపైనే ఆధారపడి ఉంది. ఉక్కు, సిమెంట్ వంటి కీలక పరిశ్రమలకు కూడా ఇది ప్రధాన ఇంధనం. అందువల్ల బొగ్గు వంటి వ్యూహాత్మక సహజ వనరును ప్రైవేటీకరించడం ప్రజా ప్రయోజనాలకు, దేశ ఆర్థిక స్వావలంబనకు విరుద్ధమని, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడమే దేశానికి మేలు చేస్తుందని అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-ఆళవందార్ వేణు మాధవ్
86860 51752






