సుస్థిర సాగుకు సరికొత్త బాట!

by Ravi |   (  Updated:2026-03-18 00:30:53  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆదాయం పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, సాంకేతికతతో సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు పంచసూత్ర ప్రణాళిక, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వంటి కీలక కార్యక్రమాలను ప్రారంభించారు.

సుస్థిర సాగుకు సరికొత్త బాట!
X

మనిషి మనుగడకు మూల స్తంభంగా నిలిచిన వాడు రైతు. నేలను దున్ని మట్టి నుండి అన్నాన్ని బయటకు తీసిన తొలి శాస్త్రవేత్త రైతు. నాగటి చాళ్లలో దేశ భవిష్యత్తును చూపించిన తొలి దార్శనికుడు రైతు. తాను తింటూ పది మందికి పెడుతూ అందరూ సుఖంగా బతకాలని కోరుకునే తొలి సమ సమాజ సిద్ధాంత కర్త రైతు. దేశానికి అన్నం పెట్టే రైతును గౌరవంగా చూసే ఆదర్శ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతు పచ్చగా ఉంటేనే దేశం,రాష్ట్రం పచ్చగా ఉంటుందనేది సీఎం చంద్రబాబు నమ్మకం.

అందుకే నేడు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక వ్యవసాయం ఆవిష్క రణకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చే లక్ష్యంగా సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచి సుస్థిర వ్యవసాయానికి సరికొత్త బాట వేసేందుకు రైతన్న కోసం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. సాగు లాభదాయకం కావాలంటే ఏం చేయాలో ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రైతులకు వివరిం‌చనున్నది. సాంకేతికతను, సంప్రదాయాన్ని మేళవించి రైతుకు భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రకటించిన పంచ సూత్ర ప్రణాళిక వ్యవసాయ రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలకనున్నది.

రైతే రాజు.. అక్షర సత్యం కావాలంటే

రైతే రాజు అనే మాట అక్షర సత్యం కావాలంటే ఈ ప్రణాళి‌కాబద్ధమైన మార్పులు ఎంతో అవసరం. వ్యవసాయం స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేసి లాభసాటిగా మార్చి వేసేందుకు నీటి భద్రత. డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మార్పులకు శ్రీకారం చుట్టారు.. ఎరువుల వినియోగం, వాతావరణ ఆధారిత వ్యవసాయం, నీటిపారుదల సలహాలు, పంటలకు అనుగుణంగా డేటా ఆధారిత సలహాలు, డ్రోన్లు, వ్యవసాయ యంత్రాల సేవలతో అనుసంధానం చెయ్యడం, డ్రోన్‌తో పిచికారీ, ఏఐ ఆధారిత కీటక గుర్తింపు వంటి అనేక విధానాలను అందుబాటులోకి తెనున్నారు. గిట్టుబాటు ధర భరోసా, పంట పండిన తర్వాత దళారీల ప్రమేయం లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్ము కునేలా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం. ప్రత్యామ్నాయ పంటలు వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా, తక్కువ నీటితో ఎక్కువ లాభాన్నిచ్చే ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహించడం, ప్రతి గ్రామంలోనూ రైతు సదస్సులు నిర్వహించి, వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులతో ముఖాముఖి మాట్లాడి వారికి అవ గాహన కల్పించనున్నారు..

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టి తద్వారా సాగు ప్రక్రియలో పెను మార్పులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యం పెట్టుకొన్నారు. అందుకే గతంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏ స్థాయిలో గుర్తింపు పొందిందో, అదే తరహాలో వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ స్థాయిలో, అత్యాధునిక సాంకేతికతతో అను సంధానించాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయిం‌చారు. అగ్రి బిజినెస్‌మెన్‌ కోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్ఏ) ఏర్పాటు చేసి సాగును బాగు చెయ్యడానికి బాబు ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యవసాయాన్ని కేవలం ఒక కాయకష్టంగా కాకుండా, లాభసాటి వ్యాపారంగా మార్చడం, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సాగు పద్ధతులను, మార్కెటింగ్ మెళకువలను మన రైతులకు, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లకు అందుబాటులోకి తీసుకు‌రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే మార్గాలను పరిశోధించడం. పంటను నేరుగా అమ్మడమే కాకుండా, దానికి ప్రాసెసింగ్ చేసి విదేశా‌లకు ఎగుమతి చేసే విధంగా యువతకు శిక్షణ ఇవ్వడం.

ఐఎస్ఏ లక్ష్యం అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్

అంటే రైతు బిడ్డ కేవలం పంట పండించడమే కాకుండా, తన పొలాన్ని ఒక కంపెనీలాగా ఎలా నిర్వహించాలి? లాభనష్టాల అంచనా ఎలా వేయాలి? అనే అంశాలపై ఇక్కడ శిక్షణ ఉంటుంది. సాగు రంగంలోకి యువతను ఆకర్షిం చడానికి ‘అగ్రి-స్టార్టప్స్’కు ఈ యూనివర్సిటీ ఒక ఇంక్యు బేషన్ సెంటర్ లాగా పనిచేస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఎకరం భూమికి సంబంధించిన డేటాను (నేల స్వభావం, నీటి లభ్యత) విశ్లేషించి రైతులకు ముందే సూచనలు ఇచ్చే వ్యవస్థ ఇక్కడ రూపొందుతుంది. నాడు ఐఎస్‌బి ద్వారా ప్రపంచ స్థాయి మేనేజర్లను అందించిన విజన్, నేడు ఐఎస్ఏ ద్వారా మట్టిలో మాణిక్యాలుగా రైతులను, గ్లోబల్ బిజినెస్ లీడర్లుగా తీర్చిదిద్దబోతోంది. ఇది కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, భారతీయ వ్యవసాయ భవిష్యత్తుకు ఒక దిక్సూచి కూడా నిలవనున్నది. సుస్థిర సాగు అంటే కేవలం రసాయనా లను తగ్గించడం మాత్రమే కాదు. ఇది నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, జీవ వైవిధ్యం, రైతు ఆదాయం అన్నింటినీ సమతుల్యంగా చూసే సమగ్ర విధానం.

లాభసాటి వ్యవసాయమే ధ్యేయంగా..

ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ వనరులతో ఎక్కువ స్థిరమైన దిగుబడి సాధించడం సుస్థిర సాగు లక్ష్యం. రాష్ట్రంలో సుస్థిర సాగుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం కూడా సహజ వ్యవ సాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు శిక్షణలు, ప్రోత్సా హకాలు అందిస్తూ ప్రభుత్వం పంచ సూత్రాలను అమలు చేయడానికి ముందుకు రావడం ఆశాజనక పరిణామం. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేం దుకు అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా వ్యవ సాయంలో ఖర్చులు తగ్గించి రైతులు ఆదాయాన్ని పెంచాలని ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి లాభసాటి వ్యవసాయమే ధ్యేయంగా పనిచేస్తున్నారు సీఎం చంద్రబాబు.

- నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story