- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరం చేసినా శిక్ష నుండి మినహాయింపు లభించే పరిస్థితులు..
పూర్వపు భారత శిక్షాస్మృతి, నేటి భారతీయ న్యాయ సంహితలు కొన్ని సందర్భాలలో చేసిన నేరాలకు శిక్షల నుండి మినహాయింపులు ఇచ్చాయి. చేసిన నేరానికి ఏ పరిస్థితుల్లో శిక్ష నుండి మినహాయింపు లభిస్తుందనే

పూర్వపు భారత శిక్షాస్మృతి, నేటి భారతీయ న్యాయ సంహితలు కొన్ని సందర్భాలలో చేసిన నేరాలకు శిక్షల నుండి మినహాయింపులు ఇచ్చాయి. చేసిన నేరానికి ఏ పరిస్థితుల్లో శిక్ష నుండి మినహాయింపు లభిస్తుందనే విషయాన్ని భారత శిక్షాస్మృతిలోని 76 నుండి 95 సెక్షన్లు.. భారతీయ న్యాయ సంహితలోని 14 నుండి 33 సెక్షన్లు తెలియజేస్తాయి.
ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకి వారి చర్యల స్వభావం, దాని పరిణామాలను అర్థం చేసుకునే పరిపక్వత, మానసిక సామర్థ్యం ఉండదని చట్టపరమైన అంచనా. ఇది నేర ఉద్దేశానికి (మెన్స్ రియా) అవసరమైన అంశం కావున వారిని నేరపూరిత చర్యల విచారణ నుండి మినహాయిస్తూ ఈ చట్టాలు రక్షణ కల్పించాయి.
పిల్లల నేర మినహాయింపులు..
ఏడు సంవత్సరాలకు మించిన వయస్సు, పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు పిల్లలు వారి చర్యల స్వభావం, వాటి పరిణామాలను అంచనా వేయడానికి తగినంత అవగాహన పరిపక్వత లేకుండా నేరం చేస్తే, అపరిపక్వ వయస్సు కారణంగా అది నేరంగా పరిగణించబడదని ఈ చట్టాలు చెబుతున్నాయి. అయితే జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం ఏడు సంవత్సరాలలోపు, పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు నేరం చేసినట్లయితే మిగతా చట్టాలతో ప్రమేయం లేకుండా ఆ చట్టం నిర్దేశించిన శిక్ష, జరిమానా, పునరావాసం లాంటివి కల్పించాలి. అంటే ఏడు సంవత్సరాలలోపు పిల్లలు నేరాలకు పాల్పడితే దేశంలోని చట్టాలు వారికి విచారణ లేదా శిక్ష నుండి సంపూర్ణ మినహాయింపును ఇచ్చినట్లుగా భావించరాదు.
మానసిక రుగ్మతను నిరూపించుకుంటే..
ఇక మానసిక రుగ్మత కారణంగా తన చర్యల స్వభావాన్ని అర్థం చేసుకోలేక చట్టానికి విరుద్ధంగా తప్పు చేస్తున్నట్లు తెలియకపోయినా.. చేసిన చర్యలకు శిక్ష నుండి చట్టపరమైన మినహాయింపు లభిస్తుంది. ఈ చట్టపరమైన మానసిక రుగ్మతను నిరూపించుకునే బాధ్యత నేరం చేసిన వారిపై ఉంటుంది. ఒక వ్యక్తి మద్యం మత్తులో ఉన్నప్పుడు నేరం చేస్తే, ఆ మత్తు అసంక ల్పితంగా జరిగిందని అంటే తనకు తెలియకుండా లేదా తన ఇష్టానికి వ్యతిరేకంగా మత్తు నిర్వహించబడిందని, చర్య సమయంలో దాని స్వభావాన్ని లేదా అది చట్ట విరుద్ధమని అర్థం చేసుకోలేని పరిస్థితిలో తాను ఉన్నట్లు రుజువు చేసుకుంటే శిక్ష నుండి రక్షణ లభిస్తుంది. అలాగే ఒక వ్యక్తి సమ్మతితో అతని ప్రయోజనం లేదా శ్రేయస్సు కోసం మంచి విశ్వాసంతో ఒక చర్య చేసి నప్పుడు, ఆ చర్య మరణానికి కారణమయ్యే అవకాశం ఉందని తెలిసినప్పటికీ, ఆ చర్య ద్వారా ఆ వ్యక్తికి ఏదేని హాని జరిగినా, ఆ చర్య నేరం నుండి మినహాయింపు లభిస్తుంది. ఇందుకు ఉదాహరణ, రోగి, డాక్టర్. ఎవరి నుండైనా తక్షణ మరణ బెదిరింపు మూలంగా ఒక వ్యక్తి ఏదేని చట్ట విరుద్దమైన చర్యకు పాల్పడితే, అది కూడా మినహాయింపు నుండి లభ్యత పొందుతుంది.
ఆత్మరక్షణ కోసం చేసే నేరాల్లో..
అదే విధంగా ఆత్మరక్షణార్ధం చేసే నేరాలు నేరాలుగా పరిగణింపబడవని భారత శిక్షాస్మృతిలోని 96 నుండి 106 సెక్షన్లు.. భారతీయ న్యాయ సంహితలోని 34 నుండి 44 సెక్షన్లు తెలియజేస్తున్నాయి. దొంగతనం, దోపిడీ, నేరపూరిత అతిక్రమణ, అల్లర్లు వంటి నేరాలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి తనను, ఇతరులను వారి స్థిర, చరాస్తులను రక్షించుకునే సందర్భంలో చేసే చర్య కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. మానసిక స్థితి సరిగా లేని, మత్తులో ఉన్న, లేదా పరి పక్వత లేని లేదా అపోహతో వ్యవహరించే వ్యక్తి నేరంగా పరిగణింపబడని ఏదేని చట్టవిరుద్దమైన చర్యకు పాల్పడితే దానికి వ్యతిరేకంగా వ్యక్తిగత రక్షణ కొరకు చేసే ప్రతిచర్యకు నేర విచారణ నుండి రక్షణ పొందవచ్చు.
నిరూపించుకోవాల్సింది బాధితుడే..
సాక్ష్య చట్టంలోని సెక్షన్ 105, భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 105 ప్రకారం, నేరం నుండి సాధారణ మినహాయింపు కోరినప్పుడు లేదా ప్రైవేట్ డిఫెన్స్ లేవనెత్తినప్పుడు వాటిని సమర్థించే పరిస్థితులను నిరూపించాల్సిన భారం నిందితుడి మీద ఉంటుంది. మొత్తంగా గమనించినట్లయితే నేరం ఏ పరిస్థితుల్లో చేశారు, నేర నిర్ధారణ మినహాయింపు కోరవచ్చునా, ఉపయోగించిన ఆత్మరక్షణ అవసరమైన విధంగానే ఉందా? అనే విషయాలు అంతిమంగా తేల్చవలసింది న్యాయస్థానాల పరిధిలోనే ఉంది.
- తడకమళ్ల మురళీధర్,
జిల్లా రిటైర్డ్ న్యాయమూర్తి
98485 45970






