- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా.. వినిపించాలా.. అనుభూతించాలా?
సినిమా ఒక దృశ్య - శ్రవ్య కళా మాధ్యమం. సినిమాల్లో దృశ్యం ఎంత ముఖ్యమో, శబ్దం కూడా అంతే ముఖ్యమైన అంశం. కానీ శబ్దం అంటే ఒక ధ్వని మాత్రమే కాదు..

సినిమా ఒక దృశ్య - శ్రవ్య కళా మాధ్యమం. సినిమాల్లో దృశ్యం ఎంత ముఖ్యమో, శబ్దం కూడా అంతే ముఖ్యమైన అంశం. కానీ శబ్దం అంటే ఒక ధ్వని మాత్రమే కాదు.. దానిలో సంగీతం, పాటలు, సహజ ప్రకృతి ధ్వనులు, నిశ్శబ్దం అన్నీ భాగాలే..
శబ్దాన్ని ప్రధానంగా నాలుగు భాగాలుగా చూడొచ్చు.. నేపథ్య సంగీతం, పాటలు, ధ్వని. నేపథ్య సంగీతం ఒక భావోద్వేగాన్ని ఏర్పరుస్తుంది. సహజ ధ్వనులు (Ambient / Diegetic Sound) వాస్తవికతను సృష్టిస్తాయి. వీటికి తోడు సంభాషణలు సమాచారాన్ని నేరుగా ప్రేక్షకులకు చేరుస్తాయి.. ఈ నాలుగింటి సమతుల్యతే సినిమాకు చెందిన శబ్ద భాషను నిర్ణయిస్తుంది.
ధ్వని, నిశ్శబ్దం.. ఏది కేంద్ర బిందువు..?
మౌలికంగా సినిమాకు ప్రాణం ‘దృశ్యం’. దాని ఊపిరి నిశ్శబ్దం. శబ్దం మాత్రం ఆ ఊపిరికి ఇచ్చే దిశ. శబ్దం సినిమాను వినిపిస్తుంది. నిశ్శబ్దం సినిమాను అనుభూతింపజేస్తుంది. మాటలు ముగిసిన తర్వాత కూడా మనతో ఉండిపోయేది నిశ్శబ్దమే.. అదే నిజమైన సినిమా. వాస్తవంగా సినిమా మొదట చూపించాలి. మాటలు అవసరమైతే మాత్రమే వినిపించాలి. సినిమా నిర్మాణంలో నిశ్శబ్ద వినియోగానికి దర్శకుడు భయపడకూడదు.. ఎందుకంటే నిశ్శబ్దం సినిమాకు అంతర్ముఖ అనుభూతిని కలిగిస్తుంది. లోతును నేర్పుతుంది. శబ్దం దానికి దిశను ఇస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యతే నిజమైన సినిమా భాష. సినిమాకు ప్రాణం శబ్దమా లేక నిశ్శబ్దమా? అనే ప్రశ్నను సిద్ధాంత, చారిత్రక, అనుభూతి స్థాయిలలో విశ్లేషించాలి..
సినిమా ఆత్మ దృశ్యాల్లో ఉంది!
చారిత్రకంగా చూస్తే సినిమా మొదట పుట్టినప్పుడు అది మాట్లాడలేదు.. మాటలు లేవు. పాటలు లేవు. నేపథ్య సంగీతం కూడా చాలా పరిమితంగా ఉండేది. అది మూకీ సినిమా.. అయినా ఆ సినిమాలు ప్రేక్షకులను ఏడిపించాయి, నవ్వించాయి, ఆలోచింపజేశాయి. సినిమా ఆత్మ మాటల్లో కాదు, దృశ్యాల్లో ఉందని ఆ సినిమాలు నిరూపించాయి.. కానీ కాలం మారింది సాంకేతికత పెరిగింది క్రమంగా శబ్దం సినిమాను ఆక్రమించింది. అలా శబ్దం భావోద్వేగాల బాహ్య స్వరంగా మారింది. ఒకరకంగా శబ్దం సినిమాకు తక్షణ ప్రభావం ఇస్తుంది. డైలాగులు కథను ముందుకు నడిపిస్తాయి. నేపథ్య సంగీతం భావోద్వేగాలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఒక గంభీరమైన సన్నివేశంలో వయోలిన్ వినిపిస్తే, మన హృదయం వెంటనే కదులుతుంది. ఒక యాక్షన్ సీన్‌లో డ్రమ్స్ మోగితే రక్తం వేగంగా ప్రవహిస్తుంది. కానీ ఇక్కడే ఒక ప్రమాదం ఉంది. శబ్దం ఎక్కువైతే దృశ్యం బలహీనమవుతుంది. చెప్పాల్సిన భావాన్ని చూపించలేక, కేవలం మాటలతో నింపడం ప్రారంభమవుతుంది. సంగీతం భావాన్ని పుట్టించకుండా, దాచిపెట్టే కేవలం ముసుగుగా మారుతుంది. అప్పుడు సినిమా వినిపిస్తుంది, కానీ కనిపించదు.
నిశ్శబ్దం ఓ అంతర్ముఖ భాష..
మరోవైపు నిశ్శబ్దం అంతర్ముఖమైన సినిమా భాష. నిశ్శబ్దం వట్టి ఖాళీ కాదు.. అది మాటలకంటే లోతైన భాష. ఒక పాత్ర మాట్లాడకుండా కిటికీ బయట చూస్తున్న క్షణంలోని నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో వేదన ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, గత జ్ఞాపకాలు ఉంటాయి. నిశ్శబ్దం ప్రేక్షకుడిని ఆ దృశ్యంలో భాగ స్వామిగా మారుస్తుంది. మాటలు వినిపిస్తే మనం కేవలం శ్రోతలం అవుతాం. నిశ్శబ్దం ఉంటే మనం ఆలోచించేవాళ్లం అనుభూతించేవాళ్లం అవుతాం. అందుకే చాలా గొప్ప సినిమాల్లో నిశ్శబ్దం అనేది దర్శకుడి ప్రధాన భావ వ్యక్తీకరణ అదొక సాహసం అనే చెప్పాలి. అది ఆ దర్శకుడికి తన ప్రేక్షకుడిపై ఉన్న నమ్మకం.
శబ్దం- నిశ్శబ్దం రెంటి మధ్యా సరిహద్దు..
ఇంకా శబ్దం–నిశ్శబ్దం రెంటి మధ్య సరిహద్దు ఉన్నది. అది సమతుల్యతకు సంబంధించిన అంశం. సరైన చోట సరైన దిశలో స్థాయిలో శబ్దం ఉంటే అది భావాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్తుంది. అట్లాగే సరైన చోట నిశ్శబ్దం ఉంటే అది దర్శకుడి భావాన్ని ప్రేక్షకుడి మనసు లోపలికి చేరుస్తుంది.. మాటలతో చెప్పగలిగింది సంభాషణ అది కేవలం సమాచారం. నిశ్శబ్దంతో చెప్పగలిగింది గొప్ప అనుభవం సినిమా కేవలం కథ చెప్పే కళ కాదు. అది అనుభూతిని సృష్టించే కళ. ఇక నేపథ్య సంగీతాన్ని భావోద్వేగ నిర్మాణ సాధనంగా చెప్పు కోవచ్చు. అది సినిమా భావ వ్యవస్థను నిర్మించే ప్రధాన సాధనంగా ఉంటుంది. దాని ప్రాధాన్యతని చూస్తే అది సినిమాలోని దృశ్యానికి భావోద్వేగ తీవ్రతను ఇస్తుంది. కథా ప్రవాహానికి నిరంతరత్వాన్ని కలిగిస్తుంది, ఆయా పాత్రల మానసిక స్థితిని సూచిస్తుంది. కానీ నేటి వాణిజ్య సినిమాల్లో శబ్దం అధిక వినియోగం స్పష్టంగా కని పిస్తుంది. ప్రతి భావానికి సంగీతం, ప్రతి సంఘర్షణకు డైలాగ్. దీని ఫలితంగా ప్రేక్షకుడి ఊహకు అవకాశం లేకుండా పోతున్నది. సినిమా కేవలం వినోదంగా మిగులుతోంది. సినిమా కళాత్మకతను కోల్పోతోంది. దీన్ని ఒక రకంగా సినిమా ప్రభావం సంకుచితమవుతున్న సూచనగా చూడవచ్చు.
- వారాల ఆనంద్
94405 01281






