సినిమా ప్రజాస్వామీకరణ చెందాల్సిందే!

by Ravi |   (  Updated:2025-12-13 00:46:01  IST  )

విధ ప్రాంతాల నుంచి భాగ్యనగరం చూడటానికి వచ్చిన టూరిస్టులను ఫిలిం‌నగర్‌కు తీసుకెళ్లారు. వారితో వచ్చిన గైడ్ అక్కడి విశేషాలను వివరిస్తూ అది ఫలానా హీరో బంగాళా.. ఇది ఫలానా హీరో భవనం.. అది ఫలానా హీరోయిన్ మహల్..

సినిమా ప్రజాస్వామీకరణ చెందాల్సిందే!
X

వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరం చూడటానికి వచ్చిన టూరిస్టులను ఫిలిం‌నగర్‌కు తీసుకెళ్లారు. వారితో వచ్చిన గైడ్ అక్కడి విశేషాలను వివరిస్తూ అది ఫలానా హీరో బంగాళా.. ఇది ఫలానా హీరో భవనం.. అది ఫలానా హీరోయిన్ మహల్.. అది ఆ డైరెక్టర్ నివాసం అంటూ ఒక పదిమంది బంగళాలు చూపించిన తరువాత ఒక టూరిస్ట్ అన్నీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లేనా నిర్మాతల బంగళాలు ఎక్కడ అడిగాడు. గైడ్ నవ్వి నిర్మాతల నివాసాలు అమీర్‌పేట, యూసుఫ్ గూడ దగ్గర చిన్న చిన్న అపార్ట్మెంట్స్‌లో ఉంటాయని చెప్పాడట!

నిర్మాతను బతికించిన కాలం..

నిజమే మరి...ఒకప్పుడు అద్భుతమైన కళాఖండాలు తీసిన జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ చివరకు ఎంత ఆస్తులు మిగుల్చుకున్నారు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలు ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారో ఎంతమందికి తెలుసు? మరి వారితో సినిమాలు తీసిన నిర్మాతకు ఎన్నికార్లు ఉన్నాయి. సినిమా తీసి ఉన్న ఇల్లూ వాకిలి, కార్లు స్థలాలు అమ్ముకునే నిర్మాతలే ఎక్కువ మనకు. ఒకప్పుడు ఆదుర్తి సుబ్బారావు, వి. మధుసూదనరావు, కె విశ్వనాధ్, దాసరి నారాయణరావు, జంధ్యాల, రేలంగి నరసింహారావు సృజనాత్మక దర్శకులుగా పేరొందారు. అందరూ కొత్తవారితో సినిమాలు తీసి అఖండ విజయాలు సాధించారు. సృజనాత్మకత అనేది లవలేశం కూడా లేని నేటి దర్శకులు గ్రాఫిక్స్‌ను నమ్ముకుని కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు. బడ్జెట్ పెంచుతూ నిర్మాతలను ముంచుతున్నారు.

చిన్న సినిమాలకు పన్ను తీసేయండి!

సంవత్సరానికి పెద్ద హీరోల సినిమాలు మహా అయితే పది పన్నెండు వస్తాయి. తొంభై సినిమాలు చిన్న హీరోలవి. కాబట్టి వీలైనంత వరకు చిన్న హీరోల సినిమాలు మాత్రమే ప్రదర్శించేట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రోత్సహించ దలచుకుంటే చిన్న హీరోల సినిమాలకు పన్నులే వసూలు చేయొద్దు. వంద కోట్లతో ఒక్క సినిమా తీస్తే వంద కుటుంబాలు బతుకుతాయి. వంద కోట్లతో వంద సినిమాలు తీస్తే పదివేల కుటుంబాలు బతుకుతాయి. మళ్లీ సినిమాహాళ్లు ఫ్యామిలీ ఆడియన్స్‌తో కిటకిటలాడుతాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసుకోమనండి. వందల కోట్లను గడించమనండి.

నిర్మాత రెక్కల కష్టం సినిమా..

సినిమా అనేది నిర్మాత రెక్కల కష్టం. అతని కష్టంతో కనీసం వంద కుటుంబాలు జీవిస్తాయి. సినిమా టికెట్ ధరలు పెంచడం వలనే సామాన్య మధ్యతరగతి వారికి సినిమా వినోదం దూరమైంది. మధ్యతరగతి వారు, మహిళలు థియేటర్ ముఖం చూడటం మానేశారు.. అందులో ఇప్పుడు ఇంట్లోనే ఓటీటీ, యూట్యూబ్ లాంటి అనేక సాధనాలు ఉన్నాయి. సినిమాలు చూడటానికి శ్రమపడి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నిర్మాతలు ఈ లోకంలోకి వచ్చి ముందుగా సినిమా నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించుకోవాలి. కొత్త నటీనటులను, దర్శకులను తయారు చేసుకోవాలి. ఎక్కడో ఫారిన్ దేశాల్లో పాటలు చిత్రీకరిస్తే ఎగబడి చూస్తారని భ్రమప డవద్దు. ఎన్ని విదేశీ లొకోషన్లలో తీశారని లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి సినిమాలను జనం ఆదరిస్తున్నారు?

డజన్ హీరోలను బలిపించడానికి సినిమాలా?

సినిమా అనేది చౌకలో లభించే వినోదం. ఎవరో డజను మంది హీరోలను వేల కోట్లాధిపతులను చెయ్యడానికి సినిమా పరిశ్రమను చంపవద్దు. అగ్ర హీరోలు, నిర్మాతలు సినిమాలు నిర్మించకపోతే ప్రభుత్వమే కల్పించుకుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించి కొత్త నిర్మాతలను, కళాకా రులను తయారు చేయాలి. బయట ఎన్ని కులాలు, ఎంతమంది ప్రతిభగల వాళ్లు, ఎంతమంది అవకాశం కోసం ఎదురుచూసే వాళ్లు మీ కోసం తమ జీవితాలను బలి పెట్టుకున్నారో మీకు తెలియదా? మిగిలిన సినిమా హాళ్ల యజమానులు ఇప్పటికే తమ హాళ్లని కల్యాణ మండపాలుగా మల్చుకున్నారు. సైకిల్ స్టాండ్ కుర్రాడు వేరే వ్యాపారం పెట్టుకున్నాడు. కొత్త కుర్రాళ్లు తమ టాలెంట్ ప్రదర్శించుకోవడం కోసం తొక్కులాడుతున్నారు. సినిమా ప్రజాస్వామీకరణ చెందాల్సిందే, అందరికీ అవకాశాలు ఉండాల్సిందే..

-నాగార్జున

94415 49530

Next Story