పిల్లలు.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?

by Ravi |   (  Updated:2025-08-26 00:46:23  IST  )

నేటి బాలలే రేపటి భావి పౌరులని సగర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ హైదరాబాద్‌లో చిన్నారి సహస్రను పొరుగింటి పిల్లవాడు

పిల్లలు.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?
X

నేటి బాలలే రేపటి భావి పౌరులని సగర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ హైదరాబాద్‌లో చిన్నారి సహస్రను పొరుగింటి పిల్లవాడు చోరీకి వచ్చి దారుణంగా హత్య చేసిన ఉదంతం యావత్ సమాజానికి షాక్ కలిగించింది. కొందరు పిల్లలు వారి స్థాయిని మించి ప్రవర్తిస్తున్నట్లు బోధపడుతుంది.

వేగంగా చెడు మార్గంలో..

ఈ మధ్య జరుగుతున్న పలు సంఘటనలను పరిశీలిస్తే, కొందరు పిల్లలు చెడు మార్గంలో వేగంగా దూసుకుపోతున్నట్టు అర్థమవుతుంది! వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కుటుంబీకులది, సమాజానిది! అనునిత్యం పిల్లలు రోజువారీగా చేస్తున్న పనులు ఏంటి? ఏ అంశాలపై పిల్లలు ఆసక్తికరంగా వ్యవహరిస్తున్నారు? ఎటువంటి అంశాల పట్ల వారు మొగ్గు చూపుతున్నారు? వారిలో హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది? సాధారణ స్థితి నుంచి ఎందుకు ఇలా మార్పు చెందుతున్నారు? అనే విషయాలను పరిశీలించాల్సి ఉంది.

సాంకేతిక పరిజ్ఞానం దీనికోసమా?

పిల్లలు సాంకేతిక పరిజ్ఞానంతో కూడా చెడు వైపు ఆకర్షితులవుతున్న సందర్భాలు ఉన్నట్లు పలు సంఘటనలు అనేకం రుజువు చేస్తున్నాయి.! పిల్లల ప్రతి కదలికను పెద్దలు గమనించి వెంటనే చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఎంతో భవిష్యత్తు ఉండి, రేపటి తరానికి మార్గదర్శకత్వంగా నిలవాల్సిన పిల్లలు, సునాయాసంగా చెడు మార్గంలో పయనిస్తున్నారు. ఇది మనమంతా బాధపడాల్సిన దుస్థితి. మత్తు పదార్థాలకు బానిసలవడం, చోరీలకు, హింసకు పాల్పడటం, నేర ప్రవృత్తితో వ్యవహరించడం‌, ఏదో హీరోయిజాన్ని వెలగబెడుతున్నట్లు ఫీల్ అవుతూ.. ఫాంటసీ లైఫ్ ఎంజాయ్ చేయడం వంటి దుశ్చర్యకు చర్యలకు పాల్పడుతూ, విలాసంగా జీవించాలన్న ఆలోచనలో కొంతమంది పిల్లలు తయారవుతున్నారు.

ఇలా చేయొద్దు అంటే దాడి!

పిల్లలు తప్పుడు విధానాలను అవలంబిస్తున్న సమయంలో, ఎవరైనా ఇలా చేయడం తప్పు అని చెప్పితే.. వారిపై ఎదురు దాడి చేయడం, నోటికి వచ్చినట్లు మాటలు అనడం.. ఈ రకమైన క్రూర శైలిలో నేటి పిల్లలు కొంతమంది తయారవ్వడం గమనార్హం. కొందరు పేరెంట్స్ కూడా పిల్లల విధానాలను కట్టడి చేయడంలో విఫలం కావడం బాధాకరం. కనీసం విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకులు.. పిల్లలను చక్కదిద్దే కృషి చేస్తున్నప్పటికీ కొందరు పిల్లలు ఎదురు తిరుగుతూ రభస సృష్టిస్తున్నట్టు కొంత సమాచారం.

పేరెంట్స్ సపోర్ట్ చేస్తే..

ఈ తరహా సంఘటనలకు సంబంధించిన విషయాన్ని సంబంధిత తల్లిదండ్రుల దృష్టిలో పెట్టినా, వారు నిర్లక్ష్యం చేయడమే కాకుండా పిల్లలను సమర్థించే ప్రయత్నాలు చేస్తుండటం కొసమెరుపు. ఇలాంటి పరిస్థితిని రూపుమాపడం కోసం సమాజ హితులుగా, ప్రతి ఒక్కరూ పిల్లల కదలికలపై నిఘా వేసి వారిని నియంత్రించేందుకు మన వంతు సహకారాన్ని అందించాలి. లేదంటే, పిల్లల్లో ఈ రకమైన నేర ప్రవృత్తి అధికమై.. రేపటి సమాజంలో నైతిక విలువలు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.

ప్రతి అడుగు మంచి వైపు పడేలా..

ప్రతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులూ, సమాజ హితులూ.. ప్రభుత్వ పరంగా వ్యవస్థను చక్కదిద్దేందుకు కృషి చేస్తున్న విభాగాలన్నింటికీ మన వంతుగా మంచి సహకారాన్ని అందించి.. పిల్లల ప్రతి అడుగు మంచి వైపు పడేలా.. మంచి విలువలను కాపాడేలా.. రేపటి బంగారు భవిష్యత్తును పిల్లలు చేరుకునేలా, ఓ మంచి లక్ష్య సాధన వైపు అడుగులు వేసే విధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి. మంచి వ్యవస్థ రూపకల్పన కోసం మన వంతు సహకారాన్ని అందించాలి.

-బొల్లెద్దు వెంకట్ రత్నం

99636 16381

Next Story