డోపమైన్ బానిసలవుతున్న చిన్నారులు.. ఎవరి బాధ్యత?

by Ravi |   (  Updated:2026-07-17 01:16:17  IST  )

ఆన్‌లైన్ గేమ్స్, మొబైల్ వ్యసనం పిల్లల మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, చదువు, సామాజిక జీవనంపై చూపుతున్న ప్రభావం ఏమిటి? డిజిటల్ వ్యసనం నుంచి చిన్నారులను రక్షించేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు..

డోపమైన్ బానిసలవుతున్న చిన్నారులు.. ఎవరి బాధ్యత?
X

ఒకప్పుడు సాయంత్రం అయిందంటే వీధులన్నీ పిల్లల ఆటపాటలతో, అరుపులతో సందడిగా ఉండేవి. కానీ నేడు ఇళ్లల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. పిల్లల చేతుల్లో మొబైల్ స్క్రీన్లు వెలుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక విప్లవం మానవ జీవితాన్ని సులువు చేసిన మాట నిజమే అయినప్పటికీ, అది నేటి తరం పిల్లల బాల్యాన్ని, ముఖ్యంగా 9-12 ఏండ్ల లోపు వయసున్న చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నది.

రంగురంగుల గ్రాఫిక్స్, అద్భుతమైన శబ్దాలు, క్షణాల్లో లభించే వర్చువల్ రివార్డులతో ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచం పిల్లలను ఒక మాయాజాలంలో బంధిస్తున్నది. కేవలం కాలక్షేపం కోసం మొదలయ్యే ఈ అలవాటు, క్రమంగా వారి మానసిక ఎదుగుదలను దెబ్బతీసే ఒక తీవ్రమైన వ్యసనంగా మారిపోతున్నది.

డోపమైన్ ఉచ్చు.. ఏకాగ్రతకు భంగం

ఆన్‌లైన్ గేమ్స్ కొన్ని ప్రత్యేకమైన షార్ట్ వీడియో యాప్‌లు పిల్లల మెదడులోని రసాయన సమతుల్యతను పూర్తిగా మార్చేస్తు‌న్నాయి. ఈ యాప్‌లు పిల్లలను ఆకర్షించేలా, ప్రతి కొన్ని సెకన్లకూ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా అల్గారిథమ్‌లను రూపొందించుకున్నాయి. గేమ్‌లో ఒక లెవెల్ దాటడం లేదా ఒక టాస్క్ పూర్తి చేయగానే లభించే పాయింట్లు పిల్లల మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విపరీతంగా విడుదల చేస్తాయి. ఇది ‘ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్’ అలవాటు చేస్తుంది. దీనివల్ల పిల్లలు ప్రతి ఐదు నిమిషాలకూ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఫలితంగా వారిలో ఏకాగ్రత లోపించడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా పుస్తకాలు చదవడం, హోంవర్క్ చేయడంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. చివరికి క్లాసు రూముల్లో టీచర్లు చెప్పే పాఠాలపై కూడా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. చిన్న విషయాలకే చిరాకు పడటం, మొండిగా ప్రవర్తించే స్థాయికి చేరుతున్నారు. ఫలితంగా వారు చేస్తున్న పనులను వారు ఆమోదించలేక చివరికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

యాప్‌ల టార్గెట్.. పిల్లలే

ప్రస్తుతం డిజిటల్ మార్కెట్లో ఉన్న అనేక వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు వ్యూహాత్మకంగా 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలనే తమ ప్రధాన టార్గెట్‌గా ఎంచుకుంటున్నాయి. ఈ వయస్సులో పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంటుంది. ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకునే విచక్షణ పూర్తిగా పరిపక్వం చెందదు. టెక్ కంపెనీలు ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని, పిల్లలు ఆయా యాప్‌లకు బానిసలయ్యేలా ఆకర్షణీయమైన అప్‌డేట్‌లను ఇస్తుంటాయి. ఒక్కసారి వాటి ఉచ్చులో పడితే పిల్లలు బాహ్య ప్రపంచాన్ని, తోటి స్నేహితులను, ఆటలనే కాదు.. తమ సొంత కుటుంబ సభ్యులను కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చే ప్రమాదం లేకపోలేదు.

పొంచి ఉన్న సైబర్ ముప్పు..

ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల వల్ల కుటుంబాల భద్రత కూడా తీవ్రమైన ప్రమాదంలో పడుతున్నది. నేడు పిల్లలు తమ తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లనే ఆటల కోసం వాడుతున్నారు. ఈ ఫోన్లలోనే తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారం, గ్యాలరీ ఫోటోలు, ఇ-మెయిళ్లతో పాటు బ్యాంక్ ఖాతాల వివరాలు ఉంటాయి. సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గేమ్స్ ముసుగులో మాల్వేర్‌లను పంపుతుంటారు. ఉచితంగా పాయింట్లు వస్తాయని లేదా గేమ్‌లో కొత్త ఆయుధాలు, దుస్తులు లభిస్తాయని నమ్మి పిల్లలు ఆ లింక్‌లను క్లిక్ చేస్తుంటారు. దీనివల్ల హ్యాకర్లు ఆ ఫోన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను హ్యాక్ చేసి అకౌంట్లలోని సొమ్మును ఊడ్చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు.

బాల్యాన్ని కాపాడుకుందాం!

కుటుంబంలో రోజుకు కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకూడదనే నియమాన్ని పెట్టుకోవాలి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు స్క్రీన్లకు దూరంగా ఉండాలి. వారంలో ఒక రోజును 'నో గ్యాడ్జెట్ డే' గా ప్రకటించి పిల్లలతో సమయం గడపాలి. ఈత, సైక్లింగ్, బ్యాడ్మింటన్ వంటి శారీరక శ్రమతో కూడిన ఆటల వైపు పిల్లలను మళ్లించాలి. చైనా తరహాలోనే మైనర్ల ఆన్‌లైన్ గేమింగ్ సమయంపై పరిమితులు విధించే చట్టాలను తీసుకురావాలి. 9-12 ఏళ్ల పిల్లలను టార్గెట్ చేసే యాప్‌లపై కఠినమైన నిఘా ఉంచాలి. పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు వాటిలో పేరంటల్ కంట్రోల్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయాలి. బ్యాంకింగ్.. వ్యక్తిగత యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లు, బయోమెట్రిక్ లాక్‌లను ఏర్పాటు చేయాలి. గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అల్గారిథమ్‌ల మాయాజాలంలో చిక్కుకుని నేటి బాల్యం నిర్వీర్యమైపోతుంటే చూస్తూ ఊరుకోవడం సమాజంగా మనందరి వైఫల్యమే అవుతుంది. కాలుష్యం కంటే ప్రమాదకరమైన ఈ డిజిటల్ చెర నుండి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. అప్పుడే మనం ఒక ఆరోగ్యకరమైన, సృజనాత్మకత కలిగిన బలమైన నవభారతాన్ని నిర్మించగలం.

-హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story