- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రి హామీ... అమలు ఎక్కడ...
ముఖ్యమంత్రి హామీ... అమలు ఎక్కడ... Chief Minister's promise not implemented in ts teachers implementations

తెలంగాణ రాష్ట్రంలో బదిలీలు పదోన్నతులకు కసరత్తు ప్రారంభమైంది. ఇది అన్ని వర్గాల ఉపాధ్యాయులకు సంతోషకరమైన వార్త. అయితే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులలో సింహభాగం ఉపాధ్యాయులకు మాత్రం నిరాశ కలిగిస్తున్నది. 2021 మార్చిలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి 10 వేల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల వివరాలు సేకరించింది. ఆ వివరాల ప్రకారం రాష్ట్రంలో 4429 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. మిగిలిన 5571 ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరుకి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు పంపి 22 నెలలు గడిచినా ఇంతవరకు ఫైలు ముందుకు కదలడం లేదు. వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులకు పచ్చ జెండా ఊపింది. పిఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి రాకపోవడంతో ఈ ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో ఎస్‌జిటి ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సీఎం ప్రకటించినా కదలని దస్త్రం
రాష్ట్రంలో ప్రస్తుతం 18240 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4429 ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుల పోస్టులుండగా ప్రస్తుతం 2386 మంది ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరోనా విలయతాండవం తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అలాగే పండిత పీఈటి అక్రిడేషన్‌లో భాగంగా ఎస్జిటీ ఉపాధ్యాయులకు కూడా న్యాయం చేయాలనే తలంపుతో పదివేల పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. దానికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసి రాష్ట్రంలో 4429 పోస్టులకు అదనంగా 5571 పోస్టులను మంజూరు కోసం ప్రతిపాదిత దస్త్రాన్ని ఆర్థిక శాఖకు అనుమతి కోసం 2021 ఏప్రిల్ లో పంపారు. 22 నెలలు గడిచిన ఇంతవరకు ప్రధానోపాధ్యాయులు మంజూరి దస్త్రం ముందుకు కదలడం లేదు. ఆర్థిక శాఖ అనుమతి రాలేదు. వారం రోజుల క్రితం బదిలీలు పదోన్నతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ దశలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోనుంది. దీంతో 20 సంవత్సరాల సీనియారిటీ కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకుండా పోయాయి. ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో కేవలం 200-250 పోస్టుల్లో మాత్రమే ఎస్జీటీలకు పదోన్నతులు దక్కనున్నాయి. మిగిలిన సీనియర్ ఎస్‌జిటి ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగనుంది.
పదోన్నతి లేకుండా పదవి విరమణ...
ప్రభుత్వ ఇతర శాఖలలో నియామకమైన ఉద్యోగులకు రెండు మూడు సంవత్సరాలు దాటగానే పదోన్నతులు లభిస్తున్నాయి. కానీ 20 సంవత్సరాలు పని చేసిన ఎస్జీటీలకు ఎలాంటి పదోన్నతులు రావడం లేదు. ఏళ్లుగా ఏకీకృత సర్వీసు రూల్స్‌కు మోక్షం లభించకపోవడం వల్ల ఎస్జిటి ఉపాధ్యాయులు పదోన్నతి పొందకుండానే పదవి విరమణ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో నెల నెల ప్రభుత్వ పంచాయతీరాజ్ యాజమాన్యాల వారీగా పదోన్నతులు ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కోర్టు కేసులు, ఏకీకృత సర్వీసు రూల్స్ అడ్డంకి పేరుతో ఏళ్ళుగా పదోన్నతులు ఇవ్వడం లేదు. ప్రాథమిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడం కూడా పదోన్నతులు రాకపోవడానికి ఒక కారణంగా కనబడుతుంది. ఇంకోపక్క రాష్ట్రంలో 13811 ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పోస్టులు లేవు. కరోనా తర్వాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల పోస్టులు లేకపోవడంతో విద్యార్థులకు గుణాత్మక విద్య అందని ద్రాక్షగా మారింది. ఫలితంగా జాతీయ సాధన సర్వే ఫలితాల్లో మన రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది. విద్యా వ్యవస్థకు పునాది అయినటువంటి ప్రాథమిక పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు ఇచ్చి సీనియర్ ఎస్ జి టి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.
అంకం నరేష్
6301650324






