పెత్తనం సాగనీయం

by Disha edit |
పెత్తనం సాగనీయం
X

మేకల మంద మీద తోడేళ్ల గుంపు పడ్డట్లు అధికారమే ధ్యేయంగా రాజకీయ రాబందులు తెలంగాణ మీద పడాలని చూస్తున్నారు. తెలంగాణలో ఏదైనా చేసి వారు అధికారంలోకి రావాలన్నదే ధ్యేయం. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఏ ఢిల్లీ మెడలు వంచిందో, ఆ ఢిల్లీ పెద్దలు నేడు తెలంగాణ మీద మరోసారి పంజా విసరడానికి కాసుకొని కూర్చున్నారు.

ఉద్యమ సమయంలో చోద్యం చూసిన పార్టీలు నేడు తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్నాయి. ఉద్యమం సాగుతున్న క్రమంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం వందలాది మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైంది. తెలంగాణ రథసారథి ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్గాల చైతన్యం వలన ఢిల్లీ దిగిరాక తప్పలేదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఉద్యమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమంలో పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమానికి అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నది.

వారితో వెనుకబాటు తప్పదు

తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటున్న కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ పట్ల ఎప్పుడూ ఇంత ప్రేమను చూపలేదు. కేసీఆర్ నాయకత్వ పటిమను, భవిష్యత్తులో కేసీఆర్ జాతీయ నాయకత్వం వహించే అవకాశాలు ఉండటంతో ఎన్నడూ లేనంతగా ఢిల్లీ నుంచి ఏడాది ముందే అధికారం కోసం ఇక్కడి ప్రజలలో అయోమయం కలిగించడానికి దిగుతున్నారు. దీనిని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలన్నా ఢిల్లీ అనుమతి తప్పనిసరి. జాతీయ పార్టీలతో తెలంగాణ వెనుకబాటుకు కారణమయ్యే అవకాశాలే ఉన్నాయి.

కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక అట్టడుగు వర్గాలను అగ్రభాగాన నిలపడానికి అనేక సంస్కరణలతో పథకాలను రూపొందించి శాశ్వతంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎంతటి ఆపత్కాలం, గత్తర వచ్చినా తెలంగాణ సమాజానికి అండగా ఉంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి సంపద సృష్టించే సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్న సర్కారు, రోజురోజుకు ధరలు పెంచుకుంటూ పోతున్న సర్కారు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అని నినదించిన సర్కారు నేడు తెలంగాణలోకి వచ్చి కొలువులు అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కేంద్రం సంస్థలను అమ్ముతుంటే తెలంగాణ సర్కారు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఎంతో మంది కొలువులకు వేదికగా మారింది. ఇదే తెలంగాణ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.

పెత్తనం చెలాయించాలని

దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఆ సమస్యను కేంద్రం పట్టించుకోవడం లేదు. ఎస్సీ వర్గీకరణ మీద చర్యలు చేపట్టలేదు. పైగా దేశంలో బలవంతంగా ఓ భాషను రుద్దాలనే కుట్రలకు పాల్పడడం చూస్తుంటే వారి అధికార దాహాన్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ రాజకీయ అధికారం కోసం ప్రాంతీయ పార్టీలపై పంజా విసరాలని చూస్తున్నాయి. ఢిల్లీ దూతలు సభలతో ప్రజలను అయోమయం, గందరగోళంలోకి నెట్టడానికి యత్నిస్తున్నాయి.

తెలంగాణలో పథకాలను స్వయంగా కేంద్ర మంత్రులే అభినందించడంతో పాటు అనేక రాష్ట్రాలు తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నాయి. అందరికీ సమానంగా అందేలా సంపద సృష్టించుకునేలా గుణాత్మక పారిశ్రామిక పథకాలు, దళితబంధులాంటి పథకాలతో తెలంగాణలో ఆదర్శంగా నిలుస్తున్నది ఈ క్రమంలో కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఢిల్లీ పెత్తనాన్ని తెలంగాణలో చెలాయించాలని చూస్తున్నారు. మతం పేరుతో మానవత్వం మరిచిపోయే కుట్రదారులకు తెలంగాణలో తావు లేకుండా తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి నాయకుడు

కామారెడ్డి, 78933 03516


Next Story

Most Viewed