- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెలబ్రిటీల వివాదాలు.. నిజానిజాలు తేలేదెన్నడు?
సెలబ్రిటీల ప్రభావం జెన్‌జీ యువతపై ఎలా పడుతోంది? మంగ్లీ, బండి భగీరథ్ సాయి వివాదాల నేపథ్యంలో ప్రజా తీర్పులు, బాధ్యతలపై విశ్లేషణాత్మక కథనం.

సెలబ్రిటీల ఆహార్యం అనుసరించజూస్తారు. వాళ్ల వేషధారణ అనుకరిస్తారు. వాళ్ల అనుచరగణాన్ని పరిశీలిస్తారు. వాళ్ల ప్రతీ కదలికను గమనించి, తాము కూడా అలాగే చేయాలనుకుంటారు. ఇది జెన్ జీలో అత్యధికంగా ఉండే మధ్యతరగతి మనస్తత్వం. వీళ్లను అనుసరించడం కోసం, అలాగే వీళ్ల కదలికలను అనుక్షణం పరికించడం కోసం నూతన తరాలు సదా అప్రమత్తం అయి ఉంటాయి. అయితే వీళ్లేం చేస్తున్నారు?
ఓఆర్ఆర్‌పై రాష్ డ్రైవింగ్‌లు, పబ్బుల్లో తాగి తందనాలు ఆడడం, ఫామ్ హౌజుల్లో హుక్కాలు, రేవ్ పార్టీల్లో మునిగితేలడం, గంజాయి మత్తులో ఊగడం, డ్రగ్స్ సేవిస్తూ తాత్కాలిక వినోదాలతో తులతూగడం, మహిళలు, అమ్మాయిలతో తప్పుడు మార్గాల్లో పయనించటం, ఇది వీళ్లు సమాజానికి ఇస్తున్న సంకేతం.
సమాజం ప్రతిదీ చూస్తోంది జాగ్రత్త!
ఒకప్పుడు “ప్రజా జీవితంలో ఉన్నవారిని అందరూ గమనిస్తారు” అనే మాట కేవలం తాత్విక వ్యాఖ్యలా ఉండేది. ఇప్పుడు అది రోజువారీ వాస్తవంగా మారింది. సమాజం కేవలం వీరిని చూస్తుండదు. వారి జీవితాల్లో తనకూ వాటా ఉందన్న భావనతో ప్రతి చర్యను పరిశీలిస్తుంది. ఒకవైపు పరిపూర్ణతను ఆశిస్తూ, మరోవైపు చిన్న పొరపాటునే పెద్ద నేరంగా ముద్ర వేయడానికి సిద్ధమై ఉంటుంది. ఇటీవల వెలుగు చూసిన రెండు ఘటనలు అలాంటివే.. తెలంగాణలో సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన గాయని మంగ్లీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ సాయి చుట్టూ నెలకొన్న వివాదాలు ఈ ఖ్యాతి - ప్రభావాల ద్వంద్వ స్వరూపాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. సెలబ్రిటీల విజయాలు కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తాయి. అయితే వారిపై వచ్చే చిన్న ఆరోపణ కూడా క్షణాల్లో దేశవ్యాప్త చర్చగా మారుతుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో నిజాలు పూర్తిగా వెలుగులోకి రాకముందే ఆరోపణలు తీర్పులుగా మారిపోతున్నాయి. ఒకవైపు ఈ నిఘా బాధ్యతా యుత వ్యవహారానికి దోహదపడుతున్నా, మరోవైపు “మీడియా విచారణ” రూపంలో న్యాయ ప్రక్రియకు ముందే వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం పెరుగుతోంది.
ఒక్కరోజులో కుప్పకూలిన గాయని ఖ్యాతి!
తెలంగాణ జానపద గాన ప్రపంచంలో శక్తివంతమైన స్వరంగా ఎదిగిన సత్యవతి అలియాస్ మంగ్లీ ప్రయాణం ఎంతోమందికి ఆశ, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆమె పేరు ఆర్థిక మోసాల ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. సినీ ప్రాజెక్టుల పేరుతో మైక్రో ఫైనాన్స్ పథకంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు తదితరులపై కేసు నమోదు చేశారు. పెట్టుబడిదారులు తమను ఆకర్షించి, తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. బాధితుల వేదనతో కూడిన వీడియోలు వైరల్ అవడంతో బహిష్కరణ పిలుపులు, వెంటనే అరెస్టులు చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. మంగ్లీ మాత్రం తనకు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదని, తన ఎదుగుదలను అసూయపడే వర్గాల కుట్ర కూడా కావచ్చని వాదిస్తోంది. తుది నిజం ఏమిటన్నది న్యాయస్థానాలు తేల్చాల్సి ఉన్నప్పటికీ, ప్రజల అభిమానాన్ని కోపంగా మార్చడానికి ఈరోజు ఎంత తక్కువ సమయం సరిపోతుందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
హనీ ట్రాప్, పోక్సో కేసు.. ఏది నిజం?
ఇక మరోవైపు బండి భగీరథ్ సాయి వ్యవహారం రాజకీయ కుటుంబాల పిల్లలు ఎదుర్కొనే విపరీత ఒత్తిడిని బయటపెడుతోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టగా, మహిళా సంఘాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భగీరథ్ సాయి మాత్రం తనపై ఇది కుట్రపూరిత “హనీ ట్రాప్” ఆపరేషన్ అని, ₹5 కోట్ల వసూళ్ల కోసం తనను లక్ష్యంగా చేసుకున్నారని ఎదురుదాడి చేశాడు. ఈ కేసులో ప్రతి మలుపు మీడియా బ్రేకింగ్ న్యూస్‌గా మారుతోంది. రాజకీయ కుటుంబాలకు చెందిన వారిపై వచ్చే ఆరోపణలు కేవలం వ్యక్తిగత వ్యవహారాలుగా కాకుండా, అధికార దుర్వినియోగం, వారసత్వ అహంకారం వంటి పెద్ద ప్రశ్నలతో ముడిపడిపోతాయని ఈ ఘటన చూపిస్తోంది.
తీవ్ర ఒత్తిడి.. ముందే తీర్పు చెప్పేయడం..
డిజిటల్ యుగంలో ఈ నిరంతర ప్రజా నిఘాకు కొన్ని సానుకూల పార్శ్వాలు కూడా ఉన్నాయి. ఇది అధికారంలో ఉన్నవారిని బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. బాధితులకు తమ గొంతు వినిపించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభావశీలులపై చర్య తీసుకునేలా ప్రజా ఒత్తిడిని సృష్టిస్తుంది. కానీ అదే సమయంలో మానసిక ఒత్తిడి, కుటుంబాలపై సామాజిక ముద్ర, ‘నేరం రుజువయ్యే వరకు నిర్దోషి’ అనే న్యాయ సూత్రం క్షీణించడం వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ప్రజా జీవితంలో ఉన్నవారు మరింత పారదర్శకత, నైతిక ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది.
సెలబ్రిటీలు చెల్లించాల్సిన మూల్యం..
అదే సమయంలో సమాజం, మీడియా కూడా అప్రమ త్తతతో పాటు సమతుల్యతను పాటించాలి. న్యాయం కోరడం అవసరమే కానీ సంచలనాల కోసం వ్యక్తుల జీవితా లను తక్షణ తీర్పులతో తుడిచి పెట్టేయడం ప్రమాదకరం. మంగ్లీ, భగీరథ్ సాయి ఘటనలు ఆధునిక భారతదేశంలో సెలబ్రిటీ అనే పదం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో గుర్తు చేస్తున్నాయి. ఈ కాలంలో ప్రజా దృష్టి నుంచి తప్పించుకునే అవకాశం లేనప్పుడు, ప్రతిభతో పాటు ఆత్మ నియంత్రణ, నైతిక బలం, మానసిక స్థైర్యం కూడా అత్యంత అవసరమవుతున్నాయి.
-పెండ్యాల కొండల్
75694 95833






