కులగణన.. అడ్డంకులతో నష్టమెవరికి?

by Ravi |   (  Updated:2025-03-13 00:01:09  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టకరంగా నిర్వహించిన ఆర్థిక, సామాజిక, విద్య, కులాల వారీగా తీసిన సర్వే లెక్కల గురించి

కులగణన.. అడ్డంకులతో నష్టమెవరికి?
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టకరంగా నిర్వహించిన ఆర్థిక, సామాజిక, విద్య, కులాల వారీగా తీసిన సర్వే లెక్కల గురించి ప్రతిపక్ష పార్టీలు, కొన్ని బీసీ సంఘాల నాయకులు రచ్చ చేస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో జరిపిన తంతుతో ఈ సర్వేను పోల్చి కొందరు బీసీ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. కానీ ఆ సర్వే ఈ సర్వే వేరువేరు. 150 ఇళ్లను ఒక క్లస్టర్‌గా తీసుకుని మొత్తం 1.03 లక్షల మంది ఉద్యోగులు, 50 రోజుల పాటు, 56 ప్రశ్నల బుక్ లెట్‌తో ఇంటింటికీ తిరిగి, ఇంటి యజమాని, ఎన్యుమరేటర్‌, సూపర్‌వైజర్‌ సంతకాలు తీసుకొని చేసిన చట్టబద్ధమైన సర్వే ఇది.

మా "కులం గింతేనా"?

ప్రభుత్వం కులగణన లెక్కలు విడుదల చేశాకా.. 'మా కులం గింతేనా? అని వాదించడం మొదలు పెట్టారు. 2014 లెక్కల్లో ఓసీలు 7 శాతం, బీసీలు 56 శాతం. కానీ ప్రస్తుత ప్రభుత్వం 46.25 శాతం బీసీలు, ఓసీలు 13.31 శాతం ఎందుకు ఉంటారని వాదిస్తున్నారు. ఓసీలు 7 నుండి 13.31 శాతం ఎలా పెరిగారు? బీసీలు ఎలా తగ్గారు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సింది గతంలో ఓసీలది 7 శాతమే అని ఖచ్చితంగా ఎలా చెప్పుతున్నారు? చాలా రోజుల నుంచి దూదేకుల లాంటి ఇతరత్రా మైనారిటీలను కూడా బీసీ-ఈ గ్రూప్ క్రింద రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీకి అందిన సర్వే రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల 70 లక్షల జనాభా ఉంది. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల జనాభా ఉంది. ఈ జనాభా లెక్కలు నిర్వహించి 14 ఏండ్ల గడుస్తున్నాయి. ఇన్నేండ్లలో కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల దాకా జనాభా పెరిగి ఉంటుందని, కానీ ఆఫీసర్ల సర్వేలో ఏకంగా 50 లక్షల దాకా జనాభా తగ్గడంపై పలువురికి అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి.

కావాల్సింది ఇదీ....

తాజా సర్వేలో కులాల సంఖ్యలో తప్పులు ఉన్నాయన్నది కొంత వరకు వాస్తవమే, అయితే మనకు అతి పెద్ద సమస్య కాదు. అతిపెద్ద సమస్య మన బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడం. మన ఫోకస్ అంతా రాజ్యాంగంలోనీ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం గురించే ఉండాలి. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా ఎంత జనాభా ఉన్నా... మనకు ఒరిగేది ఏమీ లేదు. దీనిని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపే ప్రయత్నాలు చేస్తున్నది. ఇటువంటి ఈ సందర్భంలో అన్ని బీసీ సంఘాలు నాయకులు సంఘటితంగా ఈ బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించే విషయంలో పోరాటం చేయాలి. అలాగే సుప్రీం కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదం టూ పార్టీ పరంగా ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని సీఎంతో సహా మంత్రులు చెబుతున్నారు. దీన్ని కూడా ఒప్పు కునే ప్రసక్తే లేదు. గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో.. జనాభా లెక్కల వివరాలు లేకుండానే పార్లమెంటులో క్షణాల్లో బిల్లును పాస్ చేసుకున్న వ్యూహాలే ఇక్కడ పనిచేయాలి. అందుకే సంఖ్యా బలంపైన జరుగుతున్న పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం సముచితం.

గుడ్డిగా వ్యతిరేకించకండి!

హైదరాబాదు నగరంలోని చాలా ప్రాంతాలలో పూర్తిగా సర్వే జరగనేలేదనేది నిజం. చాలా అపార్ట్మెంట్లలో ఓనర్ అపార్ట్మెంట్లో ఎన్యుమరేటర్లు కూర్చొని మిగతా వాళ్ల వివరాలు సేకరించి తూతూ మంత్రంగా, మరి కొన్ని చోట్లకి వెళ్లకుండానే లేరు అనే సమాధానంతో సర్వే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే పెద్ద పట్టణాలలోని జనాభా లెక్కలు కొద్ది తేడాగా కనపడుతున్నాయి. ఈ తేడాను సరిచేస్తే పూర్తిస్థాయిలో లెక్కలు వచ్చే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం 50 రోజులు చేయించిన సర్వేను ఒక రోజు సర్వేతో ఎలా పోల్చగలుగుతున్నారో అర్థం కావటం లేదు. కులాల సంఖ్యకు మరోసారి రీ సర్వే చేసుకోవచ్చు. కానీ రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్లో చేర్చటానికి మద్దతు ఇవ్వని ప్రతిపక్ష పార్టీలపై పోరాటాలు చేయాల్సిన తరుణంలో కులగణనకు మద్దతు ఇచ్చే పార్టీల ప్రయత్నాలకు అడ్డుపడటం ఎంతవరకు సమంజసమో కుల సంఘాల పెద్దలు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డాక్టర్. బి. కేశవులు నేత . ఎండి. సైకియాట్రీ.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Next Story