కులగణన రాజకీయ ఆలోచన కాదు.. న్యాయబద్ధ సమాజ నిర్మాణానికి పునాది!

by Ravi |   (  Updated:2025-05-03 00:46:23  IST  )

దేశవ్యాప్తంగా వివిధ కులాలకు చెందిన ప్రజల సంఖ్యను గణించడం అవసరమని రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు

కులగణన రాజకీయ ఆలోచన కాదు.. న్యాయబద్ధ సమాజ నిర్మాణానికి పునాది!
X

దేశవ్యాప్తంగా వివిధ కులాలకు చెందిన ప్రజల సంఖ్యను గణించడం అవసరమని రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు, కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసింది. బీజేపీ ప్రభుత్వం చివరికి జనాభా లెక్కల్లో కులగణనను చేర్చే నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలో దీర్ఘకాలంగా ఉన్న సామాజిక అసమానతలను తొలగించేందుకు కీలకమైన అడుగుగా చూడవచ్చు. కులగణన ద్వారా సమాజంలోని అసమానతలపై కళ్ళు తెరవాలన్న ఆశయం మొదలైంది.

వారి స్థితిగతులు తెలుసుకోవాలంటే..

భారత్ జోడో యాత్ర ద్వారా దేశం నలుమూలల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమైన రాహుల్ గాంధీ, కాలినడకతో దేశ సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నారు. ఈ యాత్రలో ఆయన్ను కొన్ని కులాలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను స్వయంగా చూశారు. దేశంలో చివరగా 1931లో మాత్రమే సంపూర్ణ కులగణన జరిగింది. షెడ్యూల్ కులాలు, తెగలపై మాత్రమే ప్రస్తుతం గణాంకాలు ఉన్నాయి. మిగిలిన కులాలపై సరైన గణాంకాలు లేకపోవడంతో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అసమానతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ కులగణన కోసం గళం విప్పారు. ఎంతో కాలంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులు తెలుసు కోవాలంటే, ముందు వారి సంఖ్యను అంచనా వేయాల్సిందే అనే సూత్రంతో ఆయన పోరాడారు.

ఆయన పోరాటం కారణంగా..

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ దిశగా ముందడుగు పడింది. తెలంగాణ, కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వెంటనే స్పందించి తమదైన కుల గణన ప్రక్రియను ప్రారంభించాయి. ముఖ్యంగా తెలంగాణ, దేశానికి మార్గదర్శకంగా నిలిచి ఆదర్శంగా నిలిచింది. కుల గణనపై రాష్ట్రాల కృషి, ప్రజల మధ్య పెరుగుతున్న చైతన్యం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశంపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కేంద్రం కూడా కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా చేపట్టేందుకు అంగీకరించింది. ఈ మార్పులో రాహుల్ గాంధీ స్థిరమైన పోరాటం ముఖ్య పాత్ర పోషించింది. రాహుల్ గాంధీ కులగణన రాజకీయ ఆలోచన కాదు. న్యాయబద్ధ సమాజ నిర్మాణానికి పునాదిగా భావించారు. ఆయన దృష్టిలో, వర్గాల సమస్యలు పరిష్కరించాలంటే మొదట వారికి గొంతు నివ్వాలి. పార్లమెంట్, శాసన సభల్లో కేవలం జనాభాకు అనుగుణంగా కాక, కులాల అనుగుణంగా కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఆయన నమ్మారు.

ఈ గణాంకాలు తెలిస్తే..

సోషల్ మీడియా ప్రభావంలో తప్పుడు సమాచారం విస్తరిస్తున్న కాలంలో, రాహుల్ గాంధీ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, వారి సమస్యలు విని, వారి ఆశయాలను అర్థం చేసుకున్న నాయకుడిగా ఎదిగారు. కులగణన ద్వారా ప్రామాణిక గణాంకాలు మన చేతిలోకి వచ్చాక ఈ డేటాను న్యాయవంతమైన విధానాల రూపకల్పనకు ఉపయోగించడానికి, అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థ నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఈ మార్గాన్ని చూపిన రాహుల్ గాంధీ, దేశ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారు.

- బుర్ర రవితేజ గౌడ్

94931 09462

Next Story