- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాను సామ్రాజ్యవాదాన్ని పారదోలలేమా? చైనాకు సాధ్యమయింది మనకు సాధ్యం కాదా?
భారత్‌లో ఆనాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే మించిపోయింది ఈనాటి అమెరికా సామ్రాజ్యవాదం. మన దేశాభివృద్ధికి మన పాలకులు

భారత్‌లో ఆనాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే మించిపోయింది ఈనాటి అమెరికా సామ్రాజ్యవాదం. మన దేశాభివృద్ధికి మన పాలకులు అనుసరించే ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ విధానాలను ప్రశ్నించేందుకు, ఎదిరించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ మొదలైన ప్రాథమిక రంగాల నుంచి పారిశ్రామిక రక్షణ రంగాల వరకు మనం చేపట్టే విధానాలను ఎప్పుడూ వ్యతిరేకించడమేనా? అమెరికా పని. ఇలాంటి బెదిరింపులకు భారత్ లొంగకుండా స్వయం పోషకత్వాన్ని పెంపొందించుకోవాలి. జాతీయవాదంతో మనం వలస పాలనను పారదోలినట్టు ఈ సామ్రాజ్యవాదుల నయా వలస పాలనను కూడా పారదోలాలి.
అమెరికాలో 50 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తరచూ అభినందిస్తూ ఉంటారు. వీరు పెద్ద టెక్ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫైనాన్షియల్ సంస్థలను నడుపుతున్నారు. విద్యా విధాన నిర్ణయాత్మక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికాకు మనవాళ్లు ఇంత చేస్తున్నా.. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి విచారం వేయడం న్యాయమే కదా!
వ్యతిరేకిస్తే నియంతగా వ్యవహరిస్తారా?
అమెరికా తాను ఆపాదించుకున్న ప్రపంచ పెద్దన్న పెద్దరికంతో తాను విశ్వసనీయ భాగస్వామిగా గుర్తించాలంటే అమెరికా కనుసనాల్లో ఉండాల్సిందేనా? వ్యతిరేకిస్తే నియంతగా వ్యవహరిస్తారా? భారతదేశపు మార్కెట్ చాలా పెద్దదని అమెరికాకు తెలుసు. అమెరికాతో మనం శాస్త్ర సాంకేతిక రంగాలలో పోటీ పడుతున్నామని కూడా తెలుసు. మన మానవ వనరులు అమెరికా దేశాభివృద్ధికి ఎలా తోడ్పడుతున్నాయో తెలుసు.. మన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, విద్యావంతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్‌గా, డాక్టర్స్‌గా ఇతర సేవా రంగాలు, అమెరికా శాస్త్ర సాంకేతిక రంగాలలో తోడ్పడుతున్నారు. మార్కెట్ రీత్యా గాని మానవ వనరుల అభివృద్ధి పరంగా గాని భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే పటిష్టవంతమైన ఆర్థిక విధానాలు, ప్రభుత్వ నియంత్రణ లేనందున స్వయం పోషకత్వంలో చైనా లాగా మనం నిలదొక్కులేకపోతున్నాం. సామ్యవాద తరహా సమాజం నుంచి పెట్టుబడిదారి సమాజం వైపు అడుగులు వేశాం. దీనివలన ప్రపంచ పెట్టుబడిదారీ దేశాల కనుసనల్లో ముఖ్యంగా అమెరికా విధానాలకు లోబడిపోయే పరిస్థితి ఏర్పడింది.
అమెరికాను చైనా ఎలా భయపెడుతోంది?
78 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో అమెరికన్ సామ్రాజ్యవాదం తన ఆదేశాలను పాటించాలని ఇండియా ను బెదిరిస్తుంది. బ్రిటిష్ రాజ్యం నుంచి బిలినియర్ల రాజ్యం వైపుగా భారత్ ఇప్పటికే పునాదులు వేసుకున్నది. ఎందుకంటే మన పెట్టుబడిదారీ వర్గం ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో మమేకమైపోయింది. బడా బుర్జువా వర్గ ప్రయోజనాలను నెరవేరుస్తున్న ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలను, దేశాభివృద్ధిని ఆర్థిక వ్యవస్థ స్వయం పోషకత్వాన్ని పెంపొందించుకో గలదా? అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా తమ పెట్టు బడిదారులను ప్రోత్సహించి ప్రపంచ పెట్టుబడిదారులను నియంత్రించే పరిస్థితి ఉన్నది. నేడు ప్రభుత్వ పాలన పెట్టు బడిదారీ కనుసన్నల్లో కాకుండా ప్రజలను శాస్త్ర సాంకేతిక రంగాలలో మమేకం చేసి వస్తు ఉత్పత్తి చేస్తే ఎవరికీ ఏమీ మనం తీసిపోం. చైనాలో చాలామంది మంత్రులు శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులు కావడం వలన అక్కడ ప్రజలు పాలన ఉత్పత్తి ప్రపంచ పోటీని తట్టుకొని అగ్రరాజ్యం అమెరికాను కూడా భయపెడుతున్నది. అటువంటి ప్రభుత్వాలు మనకు ఏవి?
ప్రపంచ మార్కెట్‌ను ఎదుర్కోవాలంటే?
నరేంద్ర మోడీ, నెహ్రూ మాదిరి కాకుండా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. పారిశ్రామిక విధానాలలో అడ్డంకులు లేకుండా చేస్తున్నారు. కీలకమైన ఖనిజాలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ ఎరువులు, తదితర రంగాలు అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయాలని 79వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది నెహ్రూ విధానాల కన్నా భిన్నమైనది. స్వావలంబన దిశగా మనదేశం అభివృద్ధి చెందాలంటే స్వదేశీ మార్కెట్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. ప్రపంచ మార్కెట్‌ను ఎదుర్కోవడానికి ఏం చేయాలో ప్రణాళిక రూపకల్పన జరగాలి. ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సవాల్ చేసే రీతిలో అభివృద్ధి మన దేశంలో జరగాలి. స్వావలంబనకు భారత్ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సామ్రాజ్యవాద పెత్తనం నుండి మన దేశం బయటపడాలి.
భారతీయ వస్తువులనే కొనాలి!
అమెరికా చేస్తున్న ఎలాంటి బెదిరింపులకు భారత్ లొంగకుండా స్వయం పోషకత్వాన్ని పెంపొందించుకోవాలి. జాతీయ వాదంతో మనం వలస పాలన పారదోలినట్టు ఈ సామ్రాజ్యవాదుల నయా వలస పాలన కూడా పారదోలాలి. దేశాన్ని గ్లోబలైజేషన్ అనగా అమెరికా, యూరోప్ దేశాలపై ఆధారపడే ప్రభుత్వ విధానాల నుంచి తప్పించి స్వయం పోషకత్వ విధానాల వైపు ప్రభుత్వ విధానాలు ఉండాలి. ప్రపంచ ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న ఈ సుంకాల వలయం నుంచి బయటకు రావాలంటే మన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. మరలా వలస పాలనకు వ్యతిరేకంగా ఆనాడు విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి, స్వదేశీ వస్త్రాలైన ఖాదీ ధరించినట్లుగా ప్రస్తుతం భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని మనం గుర్తించాలి. ముందుగా మన అవసరాలు తీర్చుకోవాలి. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడకుండా చూసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ స్వయం పోష కత్వానికి ప్రాధాన్యతనివ్వాలి.
- డాక్టర్. ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్
anugondanaidu @yaho.co.in






