పోలీసు వ్యవస్థను బాగుపర్చలేమా...?

by Ravi |   (  Updated:2025-05-18 01:15:42  IST  )

భారతదేశంలో వేదకాలం నుండి సమాజంలో పోలీసు వ్యవస్థ ఏదో ఒక రూపంలో కొనసా గుతూ వస్తోంది. కానీ ప్రభుత్వ పాలనలో ఒక విభాగంగా

పోలీసు వ్యవస్థను బాగుపర్చలేమా...?
X

భారతదేశంలో వేదకాలం నుండి సమాజంలో పోలీసు వ్యవస్థ ఏదో ఒక రూపంలో కొనసా గుతూ వస్తోంది. కానీ ప్రభుత్వ పాలనలో ఒక విభాగంగా మౌర్య సామ్రాజ్యంలోనే తొలిసారి పోలీసు శాఖ వేళ్ళూనుకున్నది. హరప్పా నాగరికతలో బయల్పడిన హరప్ప ముద్రలో కర్ర పట్టుకొని నిలుచున్న మనిషిని మొట్ట మొదటి పోలీసుగా చరిత్రకారులు వ్యాఖ్యా నించారు. అయితే పోలీసు అనే పదం అప్పట్లో వ్యవహరంలో లేదు.

భారతదేశంలో పోలీసు శాఖ ఆవిర్భావం, వికాస దశలను అయిదు విభాగాలుగా విడదీసి పరిశీలించవచ్చు అవి.. పూర్పే తిహాస పోలీసు వ్యవస్థ, ప్రాచీన భారతీయ పోలీసు వ్యవస్థ, మొఘలుల పరిపాలనా కాల పోలీసు వ్యవస్థ, బ్రిటిష్ పరిపాలనా కాల పోలీసు వ్యవస్థ, స్వతంత్ర భారత పరిపాలనా కాల పోలీసు వ్యవస్థ. ఆ కాలంలో చదవగలిగినవారు, చదువులేని వారునూ మానవ విలువలను పాటించేవారు. మానవ చర్య లను తప్పు, ఒప్పులుగా ఎంచుకొని స్వీయ క్రమ శిక్షణకు బద్ధులై మెలిగేవారు. దోపిడీ దొంగతనాల ఊసే ఉండేది కాదు. ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణతో మెలిగేవాడు. కావున ప్రజలు, పాలకులు సామాజిక ఆర్థిక విధానాలపై తమ దృష్టిని సారించి సమాజ వికాసానికై పాటుపడేవారు. ప్రాచీన కాలం నుండి ఆచరిస్తూ వస్తున్న స్వాభావిక సనాతన సాంప్రదాయాలను మనుషులు మెల్లమెల్లగా విస్మరించడం ఆరంభించారు. వారి ఆలోచనల్లో సంఘర్షణల ఒరవడి ప్రవేశాన్ని పొందింది. స్వార్థచింతన బలపడడంతో 'మత్స్య న్యాయం' విధానం ప్రబలడం ఆరంభమైంది.

నేర న్యాయ వ్యవస్థకు నాంది

బయటి శత్రువుల నుండి ప్రజల ధన, మాన, ప్రాణాదులకు రక్షణ కల్పించడం రాజు ప్రధాన బాధ్యతగా పరిపాలన సాగుతుండేది. ఆ కాలం నాటి భారతదేశ పరిపాలన విధానంలో సేనా నాయకులు, న్యాయాధికారి, నగర పాలకుడు, కొత్వాల్, దుర్గ పాలకుడు తదితర పదాధికారుల నియామకాల ద్వారా పరిపాలన సాగుతుండేదని కౌటిల్యుని వర్గీకరణ ద్వారా తెలుస్తున్నది. ఆ విధానం నేటి నేర న్యాయ వ్యవస్థ ప్రారంభ దిశగా ఎంచవచ్చును. మౌర్యులు, గుప్తుల పరిపాలనా కాలంలో న్యాయ పరిపాలనా విధానం ఎంతో అభివృద్ధి చెంది విధి నిర్వహణ క్రమ విధానం, దండనీతి విధానం ప్రవేశ పెట్టబడి నిరాఘాటంగా కొనసాగింది.

సుబేదారీ, కొత్వాలీ వ్యవస్థ

13వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలతో భారతదేశ సనాతన సంస్కృతి నిర్మూలనకు నాందీ ప్రస్తావన జరిగింది. మత పరమైన పాలన ప్రాధాన్యత కారణంగా పోలీసు వ్యవస్థ తదనుసారంగా వ్యవస్థీకరించ బడింది. ''సుబేదారీ'', ''కొత్వాలీ'' వ్యవస్థ ప్రవేశపెట్టడంతో హిందువులపై దౌర్జన్యాలు మొదలైనాయి. 14వ శతాబ్ది కాలంలో 200 సంవత్సరాలు దక్కన్, దక్షిణ భారత దేశంలో కాకతీయులు, బహమనీలు, విజయనగర రాజుల ఆధీనంలో కొనసాగింది. అక్బర్‌, ఔరంగజేబుల కాలంలో ఘోర మతపరమైన, అమానవీయ దాడులతో హిందూ దేశం తల్లడిల్లిపోయింది. ఆ దిశలో పనిచేయ డానికి పోలీసు వ్యవస్థ పరిపాలన సూత్రీకరించబడింది.

బ్రిటిష్ పోలీసు చట్టాల క్రూరత్వం

బ్రిటిష్‌ రాజ్యంలో (1858-1947) భారదేశంపై తమ గుత్తాధిపత్యాన్ని నిలపడానికి అవసరమైన విధంగా పోలీసు చట్టాలను రచించి అమలులోనికి తెచ్చారు. స్థానిక హిందువులపై దౌర్జన్యాలు, దేశ సంపదను లూటీ చేయడంలో తురుష్కుల పాలనను మరపించినంత పని చేశారు. లూటీ సొమ్ముతో ఇంగ్లాండ్ దేశాన్ని అభివృద్ధి చేసుకున్న ఆనవాళ్లు నేటికీ కాన వస్తున్నాయి. తొలిసారి భారతదేశంలో అమలు చేసిన పోలీసు చట్టానికి స్వల్ప మార్పులతో స్వాతంత్య్రానంతరం (1947) సుమారు ఏడున్నర దశాబ్దాల పాటు కొనసాగించుకొని ఈ మధ్యనే కొత్త చట్టాలను రచించుకున్నాం. చట్టాలు అప్పుడూ ఉన్నాయి. కాకపోతే, అప్పుడు విదేశీ దండయాత్రలకు ఒడి గట్టిన వారికి అనుకూలంగా పనిచేశాయి. అవిద్య, ఆర్థిక వెనుక బాటుతనం ఆవరించడంతో బానిసలుగా మారాల్సి వచ్చింది. అటు తురుష్కులు, ఇటు బ్రిటిషు వారి శత శతాబ్దాల దోపిడీలకు స్థానిక పౌర జీవన విధానం స్తంభించి పోయింది.

మకుటాయమైన స్థానమే కానీ..

లక్షల మంది భారతీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్రం వయసు 77 సంవత్సరాలు దాటింది. రచించుకున్న రాజ్యాంగంలో పౌర హక్కులు, విధులు, బాధ్యతలు లాంటి మరెన్నో పౌర స్వేచ్ఛకు సంబంధించిన అంశాలను చేర్చుకోవడం జరిగింది. తొలితరం స్వాతంత్య్ర సాధన సేనానుల నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలన అర్థవంతంగా, సమర్థవంతంగా సాగింది. పరిపాలన సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన శాఖలన్నింటిలో పోలీసు శాఖది మకుటాయమైన స్థానం. ఆ శాఖ నియమిత గాడిలో సమర్థవంతంగా పని చేసినంత కాలం పౌర సమాజం సుఖ శాంతులతో విలసిల్లింది.

నిజాయితీ కోల్పోయిందెప్పుడు?

క్రమేణా అవినీతికి, అరాచకాలకు, ఆశ్రిత పక్షపాతాలకు పెద్దపీట వేయడంతో పదాధికారుల పరపతి పలుచబడి పోయింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విశేషమైన అధికారాలు కలిగిన పోలీసు శాఖ సేవలను రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకై మళ్లించుకోవడంతో పోలీసు సేవల్లో నిజాయితీ కొరవడింది. పాలకుల కనుసన్నల్లో పని చేయవలసిన దుర్దశ మూలంగా పౌర హక్కులు, సామాజిక రక్షణ సంబంధిత సేవలు కొందరికే పరిమితమైనాయని చెప్పుకోవలసి ఉంటుంది. పర్యవసానంగా, పోలీసు శాఖ తన ప్రభావ శీలమైన ఉనికిని చాటుకొనలేక పోతోందనే సత్యం పౌర సమాజానికి తెలియంది కాదు. అవిద్య, చైతన్యతా లోపం కారణంగా మృగ్యమవుతున్న తమ భవిష్యత్తును గుర్తించలేని పౌరులు తమ హక్కులకై ఉద్యమించలేకున్నారు.

పరిపాలనను గాడిలో పెట్టేందుకు..

శాస్త్రీయ దృక్పథంతో సమగ్ర పరిణామ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న సమాజ వీక్షణంతో పౌరులు చైతన్యశీలురై వ్యవహరించడం తమ బాధ్యతగా ఎంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కోణంలో ఆలోచించే ప్రజానీకం, ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే ప్రభువులుగా సుపరిపాలన సాధన అత్యంతావశ్యకంగా భావించి పోలీసు పరిపాలనను గాడిలో పెట్టడం తక్షణ కర్తవ్యంగా ఎంచి ''పోలీసులకు స్వేచ్ఛ-ఫలితాలపై బాధ్యత'' అనే నినాదంతో ఉద్య మించవలసి ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేరే వరకు సామాన్య మానవుడు తిమిర సంచార జీవనంలో సమిధగా మిగలడం అనివార్యం.

- పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి

విశ్రాంత పోలీసు అధికారి

94400 11170

Next Story