- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇకపై మార్చలేరా? ప్రభుత్వం ఏం చేయబోతుంది
అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని.. చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుందని

అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని.. చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుందని శుక్రవారం రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. అమరావతిలో 18 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘తల్లి దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. “అమరావతి ఒక నగరం కాదు.. అమరావతి ఒక శక్తి. దీనిని కేవలం ఒక నగరంగా కాకుండా నెరవేరిన కలగా చూస్తున్నానని మోడీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరా వతికి ఉంది. దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాం ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనాలు అని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి అగ్రగామి నగరం
అమరావతి యువత కలలు నెరవేరే నగరంగా మారనుంది. సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో అమరావతి అగ్రగామి నగరంగా ఆవిర్భవిస్తుంది. ఇది స్వర్ణాంధ్రకు సంకేతం ప్రజా రాజధానికి పునర్వికాసం ఆ పేరు తలచుకుంటే చాలు ప్రజా జీవనంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ, భారతీయ చరిత్రలోనే సర్వోత్కృష్టమైన ఒక మహాయుగం మన కనుల ముందు మెదులుతుంది.
రెండోసారి శంకుస్థాపన పరిపాటేనా?
అమరావతికి పదేళ్ల క్రితమే ప్రధాని మోడీ అట్టహాసంగా శంకుస్థాపన చేసినప్పటికీ, అప్పటి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టడం, సకాలంలో పనులు ప్రారంభించలేకపోవడమో, ప్రభుత్వాలే మారి కొత్త ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడమో .. ఇలా ఏదో ఒకటి జరగడం మామూలైపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అమరావతిపై ఆశలు ఏర్ప డ్డాయి. అంచనాలు పెరిగి భారం మరింత పెరిగింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులకు పునఃప్రారంభం అయ్యాయి. రాజధాని కొత్తగా రెక్కలు తొడిగే ఓ శుభ సందర్భం. ప్రభుత్వం అమరావతికి యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసుకుంది. టెండర్ల ప్రక్రియను నిర్వహించి వాటిని ఖరారు చేసి గుత్తేదారులకు అనుమతులు జారీ చేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు చాలా వరకు పనుల ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
వెల్లువలా నిధులు..
రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటివరకు రూ.26 వేల కోట్ల మేర సమీకరించారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు రుణం మంజూరైంది. హడ్కో కూడా రూ.11 వేల కోట్లు ఇచ్చింది. నిధుల కోసం డొమెస్టిక్ అండ్ ఇంటర్నే షనల్ బాండ్ మార్కెట్ ద్వారా, మల్టీలేటరల్ ఏజెన్సీలు, బ్యాంకుల ద్వారా, కేంద్ర ప్రభుత్వ సాయం, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ), భూ విక్రయాలు (ల్యాండ్ మానిటైజేషన్) వంటి మార్గాల ద్వారా సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) వంటి సంస్థల నుండి రాష్ట్రం గణనీయమైన ఆర్థిక సహాయాన్ని పొందినందున, అమరావతికి నిధుల కొరత లేదు.
నవ నగరాల నిర్మాణానికి నాంది
నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, మీడియా సిటీ, ఫైనాన్స్ సిటీ, జస్టిస్ సిటీ, టూరిజం సిటీ వంటి తొమ్మిది నేపథ్య నగరాలను కలిగి ఉంటుంది. రతన్ టాటా ఇన్నో వేషన్ హబ్, ఇతర విద్యా సంస్థలు అత్యాధునిక రహదారులు ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు మార్గం ద్వారా అమరావతిని కృష్ణపట్నం, కాకినాడ విశాఖపట్నం వంటి ప్రధాన ఓడరేవులతో అనుసంధానించడం వల్ల, ఎగుమతులు, వ్యవసాయ-మార్కెట్ ఏకీకరణను పెంచుతాయి. అమరావతిని నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా రూపుదిద్దుకోవటానికి విధి విధానాలు రూపొందించ బడ్డాయి ఈ దిశగా పెట్టుబడులు కూడా రానున్నాయి సౌర శక్తితో వినియోగం సాంప్రదాయేతర ఇంధనాల వినియోగంతో, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలనిది లక్ష్యం.
రాజధానికి చట్టబద్ధత అవసరం
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెర మీదకు వచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతులతో సమావేశం అయిన సందర్భంగా రైతులు ఇదే కోరిక కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్రం గుర్తించి, పార్లమెంట్‌లో చట్టం తీసుకువస్తే, ఇక రాజధానిని మార్చే వీలు కుదరదు. ఈ ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి కాకున్నా, వచ్చే ప్రభుత్వం కూడా పనులను కొనసాగిస్తుంది. రాజధాని భూములిచ్చిన రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా వీలైనంత త్వరలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
- వి. సుధాకర్
99898 55445






