- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని ఆపరా..?
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం ఈ సారి కూడా పట్టించుకోకపోవడం తో అవి ఈ ఏడాది కూడా

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం ఈ సారి కూడా పట్టించుకోకపోవడం తో అవి ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి. గత ఏడాది ఫీజులు నియం త్రిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం కూడా చర్చించింది. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు.. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు.. దీంతో ఈ సంవత్సరం ఫీజు దోపిడీ తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సిందే..
నిజానికి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీవో నంబరు 1 ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించి ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ సమావేశ తీర్మా నాల ప్రకారం పాఠశాలలు నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్టంలో ఎక్కడా గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు..
వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా..
గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం, ప్రైవేటు పాఠశాలలో సౌకర్యాలను బట్టి ఫీజు ఉండాలి. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాలు కలిపి 90 శాతంగా లెక్కవేసి మిగిలిన 10% పాఠశాల లాభంగా నిర్ణయించి దాన్ని బట్టే ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ లెక్కన చిన్న పాఠశాలకు ఎంత ఫీజు ఉండాలి? కార్పొరేట్ సంస్థలకు ఎంత ఫీజు ఉండాలనేది తెలుస్తుంది. ఆ ఫీజులు అమలు ఎలా ఉందనే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తూ పాఠశాలలను నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ స్కూళ్లను నడిపిస్తున్నటువంటి పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు తూతూ మంత్రంగానే ఉన్నాయి. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవ త్సరం ఉండటం లేదు. పైగా స్కూల్‌లోనే పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టులు తమ వద్దనే కొనాలని కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు స్టడీ మెటీరియల్, అదీ ఇదీ అంటూ వేలాది రూపా యలు వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు పాఠశాలల వైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో..
ఇక అడ్డగోలుగా ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై దృష్టి సారించి వాటిని నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు దేశంలోని 15 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్లుగా ఆలోచిస్తోంది. దీనికోసం ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా కార్యాచరణకు పూనుకుని మంత్రులతో కమిటీ వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది. కానీ వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు..
చట్టంలో నిబంధనలు ఉన్నప్పటికీ..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్- 12 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని చట్టం చెబుతుంది. చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. ప్రతి సంవత్సరం తల్లి దండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యావేత్తలు, మేధావులు, అధికారులు సభ్యు లుగా ఉన్నటువంటి ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫీజులను నియంత్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ఇవే కాకుండా పాఠ శాలల్లో మున్సిపాలిటీ పరిధిలో అయితే 1000 చదరపు మీటర్ల ఆట స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు దేన్నీ పాటించడం లేదు.. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను, నిబంధనలను ధిక్కరించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి.
తీగల అశోక్ కుమార్
79891 14086






