- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీజర్ భార్య అనుమానాలకు అతీతం.. మరి ఎన్నికల సంఘం?
సీజర్ భార్య అనుమానాలకు అతీతంగా ఉండాలి అని సామెత. అంటే పాలనా వ్యవస్థలో లేదా ప్రముఖ పదవుల్లో ఉన్న వ్యక్తులు

సీజర్ భార్య అనుమానాలకు అతీతంగా ఉండాలి అని సామెత. అంటే పాలనా వ్యవస్థలో లేదా ప్రముఖ పదవుల్లో ఉన్న వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములు కూడా తప్పు లేదా అవినీతికి సంబంధించిన ఏ చిన్న ఆరోపణలకు కూడా తావు లేకుండా ఉండాలని అర్థం. ఏదైనా అక్రమం జరగకపోయినా, అది జరుగుతున్నట్లుగా కనిపించినా, లేదా అలాంటి అనుమానాలు తలెత్తినా అది పదవీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించే గురుతర బాధ్యత వహిస్తున్న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
పటిష్టమైన ఎన్నికల నిర్వహణ కోసం భారత రాజ్యాంగం ఎన్నో అధికారాలను ఈసీఐకు దాఖలు పరచినా కానీ ఈసీఐ అధికార పార్టీకి అనుగుణంగా నడుచుకోవడమో లేదంటే నిష్క్రియాపరంగా ఉండటమో తప్ప స్వతంత్ర ప్రతిపత్తి చూపిన సందర్భాలు అరుదు. ఇటీవల ఓటరు జాబితాలలో అవకతవకలు, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపం, నమూనా ప్రవర్తనా నియమావళి అమలులో ద్వంద్వ వైఖరి, ఈవీఎం వివాదాలు, పోలింగ్ శాతం ప్రకటనలో అసాధారణ జాప్యం వంటి కారణాల వలన ఈసీఐ సమగ్రత ప్రశ్నార్థకం అయింది. ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం.
ఓట్ల పెరుగుదలే దెబ్బకొడితే...
ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగాలంటే ఓటరు జాబితా సక్రమంగా తయారవ్వాలి. కానీ ఓటరు జాబితా రూపొందించడంలో ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఎక్కడైతే ఓట్లు పెరిగాయో అక్కడ అంచనాలకు భిన్నంగా ఎన్డీయే కూటమికి లబ్ధి చేకూరిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్ర విధాన సభ ఎన్నికలకు సంబంధించిన వాస్తవాలను పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన గణాంకాలు బయటపడతాయి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 43.71శాతం ఓట్లతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ 30 ఎంపీ సీట్లు గెలుచుకోగా, 43.55 శాతం ఓట్లతో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి 17 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. తర్వాత అదే ఏడాది జరిగిన విధాన సభ ఎన్నికల్లో 49.30 శాతం ఓట్లతో మహాయుతి 235 స్థానాల్లో గెలుపొందితే, ఎంవీఏ 35.16 శాతం ఓట్లతో 50 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. ఎన్డీయే కూటమికి లబ్ది చేకూరడానికి ఓట్ల పెరుగుదల కారణమని ఇండియా కూటమి ఆరోపించింది.
లక్షల ఓట్లర్లు అధికంగా నమోదు..
ఎన్నికల సంఘం నాలుగు ముఖ్యమైన సందేహాలకు జవాబుదారీ వహించాలి. మొదటిది అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రభుత్వం అంచనా వేసిన 9.54 కోట్ల వయోజన (18+) జనాభా కన్నా 26 లక్షలు ఎక్కువగా నమోదిత తుది ఓటర్ల సంఖ్య (9,70,25,119) ఎలా నమోదయ్యింది? ఇక రెండవది ఎన్నడూ లేనంతగా (2004 ఎన్నికల్లో 29.53 లక్షలు, 2009లో 30.14 లక్షలు, 2014లో 27.29 లక్షలు, 2019లో 11.61 లక్షలు కొత్త ఓటర్లు) 2024 పార్లమెంట్, విధాన సభ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లో అనూహ్య వేగంతో 40,81,229 మంది కొత్త ఓటర్ల (27 లక్షల మంది మొదటి సారి ఓటర్లు) నమోదును ఎలా సమర్థించుకుంటారు? మూడవది, అసెంబ్లీ ఎన్నికల రోజు సాయంత్రం 5గం.లకు 58.22గా ప్రొవిజనల్ పోలింగ్ శాతం నమోదు కాగా మరుసటి రోజుకు తుది పోలింగ్ శాతం 66.05కు (7.83శాతం అధికం) చేరడానికి కారణాలు ఏమిటి? ఐదు గంటల తర్వాత దాదాపు 50.21 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యమా? అసలు 1,00,186 పోలింగ్ బూత్లలో ఐదు గంటల తరువాత ఎన్నింటిలో ఓటింగ్ కొనసాగిందనే డేటా ఎందుకు ఇవ్వలేదు? నాలుగవది, ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు కలిపి వాస్తవంగా 6,45,92,508 ఓట్లు పోలైతే, అంత కంటే ఎక్కువగా 6,46,26,420 ఓట్లు పోలైనట్లు ఈసీ ఎలా ప్రకటించింది పోలైన ఓట్ల కంటే 33,912 అధికంగా నమోదు కావడం ఏమిటి? ఇవన్నీ మహారాష్ట్ర విధానసభ ఎన్నికల్లో స్పష్టమైన, విధాన పరమైన అసమానతలను, ఎన్నికల సంఘం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి.
బిహార్‌లో ఈసీ దారుణ నిర్ణయం..
2019 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన 48 గంటలలోపే తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ 2024 సార్వత్రిక ఎన్నికలలో తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో జరిగిన అసాధారణ జాప్యం (మొదటి దశ 11 రోజులు, రెండవ దశ 4 రోజులు), ప్రాథమిక- తుది పోలింగ్ అంచనాల మధ్య 5-6 శాతం (సుమారు 5.4 కోట్లు ఓట్లు) పెరుగుదల ఎన్నికల నిర్వహణపై సహజంగా అనుమానాలు రేకెత్తించింది. ఇక బీహార్ విషయానికి వస్తే ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేక సమగ్ర సవరణలు అనుమతించకూడదన్న తన స్వీయ నియమాన్ని తానే ఉల్లంఘించి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కొన్ని నెలల ముందు ఆకస్మికంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో రాష్ట్రానికి చెందిన ఎనిమిది కోట్ల మంది ఓటర్లు తిరిగి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీఐ తీసుకున్న నిర్ణయం వివాదా స్పదంగా మారింది. తమను తాము అర్హులైన ఓటర్లుగా నిరూపించుకునే బాధ్యతను ప్రజలపై ఉంచే ఈ కసరత్తు 65 లక్షల మంది సామూహిక ఓటు హక్కు తొలగింపుకు దారితీసింది. తుదకు సుప్రీంకోర్టు కూడా తమ ఆదే శాలను పూర్తిగా పాటించకపోతే ఎస్ఐఆర్ రద్దు చేయడానికి కూడా వెనుకాడమని హెచ్చరించిన పరిస్థితిని దాపురించింది.
అఫిడవిట్ ఇస్తేనే సమాధానమా?
రాజకీయ పక్షాల విమర్శలకు సంయమనంతో సమాధానమిస్తూ తమ నిష్పాక్షికతను నిరూపించుకుంటే రాజ్యాంగ వ్యవస్థ గౌరవం ఇనుమడిస్తుంది. అంతేకానీ అఫిడవిట్ ఇస్తేనే సమాధానం చెబుతాము అనే సాకుతో ఈసీ తప్పించుకుంటే ప్రజలలో సంశయం రేకెత్తించిన వారవుతారు. రాజ్యాంగం తమకు కల్పించిన అధికారాలను నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యయుతంగా వినియోగించకపోతే ఎన్నికల సంఘం విశిష్టతను కోల్పోక తప్పదు. అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు చేస్తుంది.
-లింగమనేని శివరామ ప్రసాద్
రాజకీయ, సామాజిక విశ్లేషకులు
79813 20543






