ఉప ఎన్నికలు మాకాడ వచ్చినా బాగుండు..!

by Ravi |   (  Updated:2025-11-12 01:15:26  IST  )

నవంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇంటరాక్టివ్ సెషన్ విత్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ జూబ్లీ‌హిల్స్ బైపోల్’ అనే కార్యక్రమం ఉందని FGG నుంచి ఆహ్వానం వచ్చింది.

ఉప ఎన్నికలు మాకాడ వచ్చినా బాగుండు..!
X

నవంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇంటరాక్టివ్ సెషన్ విత్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ జూబ్లీ‌హిల్స్ బైపోల్’ అనే కార్యక్రమం ఉందని FGG నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఇంట్లో ఒక ముఖ్యమైన పని పడటంతో రాలేనని చెప్పాను. ఇంటి పని కోసం కూలీ కావలసి వచ్చి లేబర్ అడ్డకు పోయాను.

టోలిచౌకి అడ్డ కాడికి ఒకడు భుజం మీద తువాల ఏసుకొని వచ్చి నిలబడ్డడు. వెళ్లి అడిగితే, ఐదువందలు ఎక్కువిస్తే వస్తా అన్నాడు. సరే, పని జరగడం ముఖ్యం కాబట్టి, ఏమి వాదించకుండా, కార్లో ఎక్కించుకొని ఇంటి దిక్కుపోతూ పోతూ. ‘నువ్వు పోలేదా ఎలక్షన్ మీటింగులకు’ అని అడిగితే. ‘మొన్న కాంగ్రెస్ వాళ్లకు, నిన్న బీఆర్ఎస్ వాల్లకు పోయిన, ఇయ్యాల బీజేపి ఓళ్లకు పోయేదుండే.. పోలేదు. అందరూ అటు పోయినారు కాబట్టి, ఒకైదువందలు ఎక్కువ వస్తాయని ఆశ పడి అడ్డ మీదికి వచ్చిన సర్’ అన్నాడు. అతడి దిక్కు చూసి ‘బాగ హుషార్ ఉన్నావ్ నువ్వు! వాళ్లు రోజుకు ఎంతిచ్చారు’ అని అడిగితే. ‘అక్కడ మనిషికి వెయ్యి రూపాయలు, ఎక్కడ మీటింగ్ ఉంటే ఆడికి వాళ్లే తీసుకొని పోతారు, చేతికో జెండా ఇచ్చి, మెడమీద ఒక కండువా వేసి, గట్టిగ అరవాలే అంటారు, మధ్య మధ్యల గట్టిగ సప్పట్లు కొట్టాలే, పులహోరతో పాటు, నీళ్లు పాకెట్లిస్తారు. ఈ ఎలక్షన్ పుణ్యమా అని అందరికీ పని దొరుకతుంది సార్, గిసొంటి ఎన్నికలు మళ్లా మళ్లా రావాలే సార్!” అన్నడు.

గంటలోపే పరిష్కరించేశారు..

మర్నాడు FGG మీటింగ్ ఎలా జరిగిందో తెలుసుకుందామని మిత్రునికి ఫోన్ చేస్తే.. నిన్న పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వెళ్లిన కాంగ్రెస్ వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి వచ్చి వెళ్ళినారు. ఎంతో కాలం నుండి మా అపార్ట్మెంట్స్‌కి సాంక్షన్ అయినంత సరిపడా నీరు ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఫలితం దక్కలేదని, అట్లనే మా కాంపౌండ్ ముందు ఉండవలసిన రోడ్ యూ‌టర్న్, ఒక కిలోమీటర్ దూరంలో పెట్టి ఉండడం వల్ల అవస్థ పడు తున్నామని, సాయంత్రం ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు చెప్తే, కొద్ది సేపట్లోనే ఒక పెద్ద క్రేన్‌తో డివైడర్ దిమ్మెలను జరిపేసి, యుటర్న్ మా కమ్యూనిటీ ముందే ఏర్పాటు చేసేసారని, నీళ్ల సమస్య కూడా పరిష్కరించేశారని, ఈ ఉప ఎన్నిక పుణ్యమా అని ప్రభుత్వం అస్సలు పట్టిం చుకోని రెండు ముఖ్యమైన పనులను తక్షణమే పూర్తి చేసేసిందని నా మిత్రుడు అభిప్రాయపడ్డాడు. తర్వాత హుస్నాబాద్ నుండి చిన్నప్పటి దోస్తు.. పలకరించాడు. అతనికి, షేక్ పేట్‌లో మూసేసిన యుటర్న్‌ని అధికార పార్టీ కొన్ని గంటల్లోనే ఓపెన్ చేసేస్తే, ఆ అపార్ట్మెంట్ ఓటర్లు, ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ దిక్కు ఎట్ల యుటర్న్ తీసుకున్నరో వివరించాను. ‘అప్పట్లో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చి నప్పుడు కూడా, ఒక్క వారం‌లోనే మొత్తం నియోజకవర్గంలో అన్ని రోడ్లు, అభివృద్ధి పనులు చకచకా జరిగిపోయాయని, అలాగే, మన హుస్నాబాద్‌లో కూడా ఉపఎన్నిక వస్తే బాగుండు కదా..! రూపు రేఖలు మారిపోయేవి!’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినాడు.

బైపోల్స్ వస్తేనే పనులు జరుగుతాయ్..

నిజమే కదా.. ఇలాంటి ఉప ఎన్నికలన్నా వస్తే, ముఖ్యమంత్రితో సహా అన్ని శాఖల మంత్రులు మన వీధుల్లోనే కనప‌డుతారు, వాల్లే వచ్చి మనల్ని కలుస్తారు. అట్ల కాకుంటే పీఏల రుబాబు, గన్‌మ్యాన్లు అడ్డుకునుడు, ఫుల్లు బిజీ ఉన్నామని బిల్డ్అప్‌లు, ఓపిక నశించే వరకు మన చెక్కర్లు, రేపు రా మాపు రా.. అనుకుంట వాయిదాల మీద వాయిదాలు.. కలిసినప్పుడు అన్నింటికీ పేరుకే ఓకేలు, కానీ పనులు అవ్వకుండా అడుగడుగున పేచీలు.. ఎన్నెన్ని తిప్పలు! ఇప్పుడు అవసరం వాళ్లది, మన ఓటే వాళ్లకు జీవం. ఎంత డబ్బైనా గుమ్మరించి, గెలిచి బైటపడితే చాలు.! అనే భావన. ‘ఒక్కసారి పెట్టిన పెట్టుబడికి, పుష్కలంగా ఐదేండ్ల పంట’ లెక్క ఉంటుంది వీళ్ల వ్యవహారం! వ్యాపారం!

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ దొరకరు!

ఎన్నికలు, ఇలాంటి ఉపఎన్నికలు వస్తే గాని మంత్రులు మన వీధుల్లోకి, మన గడపల వద్దకు రారు. కాబట్టి ఇలాంటి ఉప ఎన్నికలు మళ్లీ -మళ్లీ రావాలి. పనులు పెండింగ్ పడి, అధికారులు అస్సలు పట్టించుకోని చోట, ఉప ఎన్నిక తొందరగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఉప ఎన్నికల పుణ్యాన అందుబాటులోకి వచ్చిన నాయ కులతో పాటు ప్రచారానికి తిరగడమో, ఇచ్చింది తీసుకో వడమో, చెప్పే సోది వినడమో, కాకుండా.. నా మిత్రుడు ఉండే ‘సత్త్వ మాగ్నస్’ కమ్యూనిటీ వాళ్ల లాగ మనం చెప్పులరగ తిరిగినా, కానీ పనులను, నిలదీసి చేయించుకోవాలి, లేకపోతే మల్లా వాళ్లు దొరకరు. దొరికినా మనల్ని దేకరు. కాబట్టి గిసొంటి ఉపఎన్నికలు ఊకే ఊకే రావలసిందే, అనిపిస్తుంది.

ఎన్నికలొస్తేనే పని దొరుకుతోందంటే..?

జూబ్లీ‌హిల్స్ నియోజకవర్గంలో ఉన్న కూలీలకు పని దొరినట్లు మావద్ద కూడా ఎన్నికలొచ్చి మాకు కూడా పని దొరికితే బాగుండేదని మిగతా నియోజక‌వర్గాలలో ఉన్న కూలీల ఆవేదన. ఓట్లు వేసే రోజు రానే వచ్చింది. అన్ని పార్టీల లోకల్ ఇంచార్జిలు బస్తీ‌వాసులకు డబ్బులు పుష్కలంగా పంచేశారు. ఈ సందర్భంలో పెండింగ్ పడ్డ పనులను ఎలా వేగవంతంగా జరిపించారో, అంతే బాధ్యతతో ఉపఎన్నికలు లేకున్నా కూడా, అదే రీతిలో, అంతే బాధ్యతతో విధులను ప్రభుత్వం నిర్వహిస్తే ఎంత బాగుండునో అని భావిస్తున్నారు నాలాంటి ఆశాజీవులు!

-సయ్యద్ రఫీ

చిత్ర దర్శకుడు

99660 25325

Next Story