వారిలోనూ అవినీతి కోరలు

by Disha edit |
వారిలోనూ అవినీతి కోరలు
X

ఎన్నికలలో గెలవడం, రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం కోసం 80-20 రాజకీయాలు, మైండ్ గేములు, ఒక వర్గం మీద దాడులు, బుల్‌డోజర్‌లతో కూల్చివేతలు షరామామూలు అయిపోయాయి. ఇలాంటి సందర్భాలలో ప్రజలకు లభించాల్సిన మానవహక్కులు, ఇప్పించాల్సిన అధికారులు సైతం అధికార పార్టీలకు వంత పాడితే ఎట్లా? ప్రమాణాలు ఏం కావాలి? దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, నేతలు తప్పు దారి పట్టినవుడు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నపుడు వారిని దారిలో పెట్టాల్సినవారు వంత పాడినా, మౌనంగా ఉన్నా తప్పు అవుతుంది. ఏది ఏమైనా నిజాయితీగా ప్రజల వైపు ఉండి, రాజకీయ పార్టీల నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రభుత్వాలను దారిలో పెట్టే ప్రయత్నాలు చేస్తూ, పేద పీడిత తాడిత జనం మేలు కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న అధికారులకు అభినందనలు.

దేశంలో అవినీతి ఆరోపణలు రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రుల మీదనే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైన కూడా ఉన్నాయి. కొందరు జైలు పాలు కూడా అయ్యారు. దేశంలో 6,553 మంది సివిల్స్ అధికారులు ఉండగా 5,104 మంది సర్వీస్‌లో ఉన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా 44 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారుల మీద ఐటీ, ఈడీ, సీబీఐ, ఏసీబీ కేసులు ఉన్నాయి. 2019-2020 నాటికి దేశంలో ఐఏఎస్ అధికారుల మీద 753 కేసులు నమోదయ్యాయి. ఐఏఎస్ అధికారుల సంఖ్యలో 12 నుంచి 13 శాతం మంది మీద అవినీతి ఆరోపణల కేసులు ఉన్నాయి.

టాప్ టెన్ అవినీతిపరులలో నితేష్ జనార్దన్ ఠాకూర్, అరవింద్ జోషీ, టినూ జోషీ, నీర యాదవ్, బాబూలాల్ అగర్వాల్ ,ప్రతాప్ సింగ్, టీఓ సూరజ్, పవన్, పహాడియా, నిర్మలా మీనా తదితరులు ఉన్నారు. కనీసం 200 కోట్ల నుంచి 500 కోట్ల దాకా డబ్బు, బంగారం, ఇతర అక్రమ ఆస్తులు వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. మంత్రులు, సీఎంలు సైతం వీరి వెనక ఉంటారు. ప్రతీ ఐఏఎస్ సంతకం వెనక ఒకరి ఆదేశం ఒత్తిడి లేదా న్యాయం, అన్యాయం, అవినీతి ఉంటుందని అంటారు. మెజారిటీ ఐఏఎస్‌లు నిజాయితీపరులే. కీలక ఫోకల్ పాయింట్స్‌లో నీతి పరులకు తక్కువ అవకాశాలే ఉంటాయి. 2017లో 623 కేసులు నమోదు కాగా, 2015లో 16 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.

అధికారం అండతోనే

ఈ విషయాలన్నీ ప్రస్తుతం చర్చకు రావడానికి కారణం ఏమంటే, తాజాగా ఝార్ఖండ్‌లో 22 ఏండ్లుగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ వద్ద 17 కోట్ల రూపాయల నగదు, ఇతర అక్రమ ఆస్తులు ఈడీ దాడిలో బయట పడ్డాయి. ఎనిమిది కోట్ల రూపాయలు ఆమె పీఏ వద్ద పట్టుకున్నారు. సహజంగా ఐఏఎస్‌లకు బినామీలు ఎక్కువగానే ఉంటారు. ఈమె భర్తకు పెద్ద ఆసుపత్రి ఉంది. ఈ డబ్బును అటు చూపుతారనే ప్రచారం కూడా ఉంది. ఆమె మామను అరెస్ట్ చేసారు. 25 కోట్ల బినామీ ఆస్తులను గుర్తించారు. ఝార్ఖండ్‌లోని మైనింగ్, ఇతర విభాగాలలో కీలక పదవులలో ఈమె పని చేసారు. 2000 సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె 18 కోట్ల రూపాయల ఉపాధిహామీ పథకంలో ఒక ఎన్‌జీఓ నుంచి ఆరు కోట్లు తీసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.తన నుంచి డబ్బులు అడుగుతున్నారని ఒక మైనింగ్ కాంట్రాక్టర్ సీఎంకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.

రఘువరదాస్ సీఎంగా ఉన్నా హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నా ఆమెకు అందరి అండదండలు లభించాయి. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా ఈ రైడ్ సంచలనం కలిగించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఎవరు అయినా ఎంతో పవిత్రముగా ఉండాలి. సమాజంలో వారికీ మంచి గౌరవం ఉంటుంది. కేసులుండి జైలుకు వెళ్లినవారిలో పలువురు సస్పెండ్ అయ్యారు. కొందరు డిస్మిస్ కూడా అయ్యారు. కొందరు పదవులు వదిలి, మరి కొందరు రిటైర్ అయ్యాక రాజకీయాలలోకి వచ్చారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అయ్యారు.

దారి తప్పుతున్న వ్యవస్థ

ఐఏఎస్‌ల మీద అవినీతి కేసులు అంటే ఆత్మహత్యా సదృశ్యమే. కొందరు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు రాజకీయ నేతల కనుసన్నలలో మెదులుతారనే విమర్శలు ఉన్నాయి. 'మీరు మారాలి. మీరు ఇంతే అయితే ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఎవరు జవాబుదారి అవుతారో చెప్పండి' ప్రభుత్వాలు మారుతుంటాయి. రాజకీయ పార్టీల నేతలకు అనుకూలంగా వ్యవహరించడం వలన రాజ్యాంగం అమలు సరిగా జరగదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సిద్ధించే అవకాశాలు ఉండవు. సామాన్యుడికి న్యాయం లభించదు. ప్రశ్నించేవాడిని 'దేశద్రోహి' అంటూ కేసులు పెట్టి జైలులోకి నెడుతున్నారు. యూపీలోని లఖింమ్‌పూర్ ఖేరిలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా తన జీబుతో రైతులను తొక్కి చంపిన కేసులో జైలు నుంచి బయటకు వచ్చాడు. అతడు కోర్టుకు పోలీసుల సమక్షంలో మీసాలు మెలి వేసుకుంటూ వచ్చిన తీరు ఈ దేశంలో నేరస్తుల విచ్చలవిడితనాన్ని స్పష్టం చేస్తోంది. ఇలాంటి వారికీ చట్టం అన్నా, అధికారులు అన్నా గౌరవం, భయం లేదు.

ఇందుకు కారణం ఎవరు?

ఇలాంటి వారిని అధికార పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. ఇలాంటి వాటికి దృశ్యాలకు కారణం ఎవరు? దేశం అసమానతలు, ఆకలి, నిరుద్యోగం, అధిక ధరలతో అట్టుడికి పోతున్నది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ప్రైవేటీకరణతో కోట్ల మంది ఉద్యోగులు రోడ్ల మీదికి వచ్చిండ్రు. 'డబ్బు ఉన్నవాడికి మాత్రమే సంపద సొంతం' అనే విధంగా అదాని, అంబానీలాంటి వారి సంపాదనకు అంతే లేదు.

ఎన్నికలలో గెలవడం, రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం కోసం 80-20 రాజకీయాలు, మైండ్ గేములు, ఒక వర్గం మీద దాడులు, బుల్‌డోజర్‌లతో కూల్చివేతలు షరామామూలు అయిపోయాయి. ఇలాంటి సందర్భాలలో ప్రజలకు లభించాల్సిన మానవహక్కులు, ఇప్పించాల్సిన అధికారులు సైతం అధికార పార్టీలకు వంత పాడితే ఎట్లా? ప్రమాణాలు ఏం కావాలి? దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, నేతలు తప్పు దారి పట్టినవుడు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నపుడు వారిని దారిలో పెట్టాల్సినవారు వంత పాడినా, మౌనంగా ఉన్నా తప్పు అవుతుంది. ఏది ఏమైనా నిజాయితీగా ప్రజల వైపు ఉండి, రాజకీయ పార్టీల నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రభుత్వాలను దారిలో పెట్టే ప్రయత్నాలు చేస్తూ, పేద పీడిత తాడిత జనం మేలు కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న అధికారులకు అభినందనలు.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Next Story