బుల్డోజర్ చర్యలు.. రాజ్యాంగానికి సవాల్!

by Ravi |   (  Updated:2026-07-19 01:00:48  IST  )

నిందితుల ఇళ్ల కూల్చివేతలు, బుల్డోజర్ చర్యలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, చట్టపరమైన ప్రక్రియ, రాజ్యాంగ హక్కులు, న్యాయపాలన, కుటుంబాలపై ప్రభావం..

బుల్డోజర్ చర్యలు.. రాజ్యాంగానికి సవాల్!
X

రాజ్యాంగ పాలనలో నేరానికి శిక్ష విధించే అధికారం న్యాయస్థానాలదే. కానీ ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాల్లో నేరారోపణలు వచ్చిన వెంటనే నిందితుల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించే ధోరణి పెరుగుతోంది. ప్రభుత్వాలు వీటిని అక్రమ నిర్మాణాల తొలగింపుగా సమర్థించుకుంటున్నప్పటికీ, చట్ట ప్రక్రియ పూర్తికాకముందే ఇళ్లు కూల్చి వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ మేనా? నేరం చేసిన వ్యక్తిని శిక్షించాలా.. లేక అతని కుటుంబాన్నీ శిక్షించాలా?

దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అక్రమ నిర్మాణాలను కూల్చివేయ‌డానికి ఒక స్పష్టమైన.. చట్టపరమైన విధానం ఉంటుంది. ముందుగా అక్రమ నిర్మాణంగా భావించే వాటికి నోటీసు ఇచ్చి వివరణ కోరాల్సి ఉంటుంది. అప్పీల్ చేసుకోవడానికి అవకాశమిచ్చి.. చివరికి చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే.. కూల్చివేతలు చేయాల్సి ఉంటుంది.

ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు..

గత కొన్నేళ్లుగా అనేక రాష్ట్రాల్లో ఒక కొత్త ధోరణి తెరపైకి వచ్చింది. నేరారోపణలు వచ్చిన వెంటనే నిందితులుగా ఉన్న వ్యక్తుల ఇళ్లను ప్రభుత్వాలు నేలమట్టం చేస్తున్నాయి. ఆ తర్వాత దానిని ‘తక్షణ న్యాయం’గా ప్రచారం చేస్తున్నాయి. తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు.. తాము కేవలం అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామని జవాబు చెప్తున్నాయి. అయితే, ఎవరైనా నేరం చేస్తే.. ఆ వ్యక్తిని శిక్షించే అధికారం కేవలం న్యాయ స్థానానికి మాత్రమే ఉంటుంది. అయితే తక్షణ న్యాయంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ప్రమాదకర ధోరణిని తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇల్లు అంటే గోడలు మాత్రమే కాదు.. అది ఒక కుటుంబ జ్ఞాపకం. జీవితాంతం కూడబెట్టిన సంపద. పిల్లల భవిష్యత్తు. ఒక్కరోజులో బుల్డోజర్ దాన్ని నేలమట్టం చేస్తే శిక్ష ఒక్క నిందితుడికే కాదు. ఆ ఇంట్లో నివసించే వారందరూ దాని ప్రభావాన్ని అనుభవిస్తారు. ఒక వ్యక్తిపై కేసు నమోదైతే అతని కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.

యూపీ నుంచి స్టార్ట్..

ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ధోరణి ఎక్కువైంది. నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులపై బుల్డోజర్లు నడిపింది. అక్రమ నిర్మాణాలు కూల్చడమే లక్ష్యమైతే ఎందుకు ఎక్కువగా ఒకే వర్గానికి చెందిన వ్యక్తుల ఇళ్లే లక్ష్యమవుతున్నాయనే ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు.. యూపీ మాత్రమే కాదు.. మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ జహంగీర్‌పురి, అస్సాం, గుజరాత్, రాజస్థాన్ వరకు ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన కూల్చివేతలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అల్లర్లలో పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చిన కొందరి ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఆయా రాష్ట్రాల్లో అల్లర్లు లేదా సామాజిక ఉద్రిక్తతల అనంతరం బుల్డోజర్ చర్యలు చోటుచేసుకున్నాయి. అయితే కూల్చిన ప్రతి సందర్భంలో అక్రమ నిర్మాణాలనే తొలగిస్తున్నామంటూ వివరణ ఇస్తున్న అధికారులు.. అయితే ఇవన్నీ ఎక్కువగా ఒక వర్గం నివసించే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయనేది జగమెరిగిన రహస్యం.

చట్ట ప్రక్రియ పూర్తికాకముందే..

దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలపై అనేక పిటిషన్లు దాఖల‌య్యాయి. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ‘బుల్డోజర్ న్యాయం రాజ్యాంగం గుర్తించదు.’ అక్రమ నిర్మాణం అయినా కూడా చట్టపరమైన ప్రక్రియ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. దీనికోసం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ముందుగా నోటీసు ఇవ్వాలని, సమాధానం చెప్పే అవకాశం కల్పించాలని, అప్పీల్‌కు అవకాశం ఉండాలని తేల్చి చెప్పింది. శిక్ష విధించే ఉద్దేశంతో బుల్డోజర్ ఉపయో గించకూడదని, కేవలం నేరారోపణల ఆధారంగా ఇల్లు కూల్చరాదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా.. దేశవ్యాప్తంగా వర్తిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

హైకోర్టులు చూసుకోవాలంటే ఎలా?

బుల్డోజర్ చర్యలను పూర్తిగా నిలిపివేయాలన్న అభ్య ర్థనపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రతీ ఘటనలో బుల్డోజర్ చర్యలను ఆపివేయలేమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలది, అవి ఉల్లంఘించబడ్డాయా? లేదా అన్నది పరిశీలించే బాధ్యత హైకోర్టులదని పేర్కొంది. అయితే ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతోంది. అకస్మాత్తుగా ఇల్లు కూలిపోయిన ఒక సాధారణ కుటుంబం హైకోర్టు వరకు వెళ్లగలదా? న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఖర్చులు, నెలల తరబడి సాగే విచారణలను భరించే ఆర్థిక స్థోమత దేశంలోని ప్రతి పౌరుడికీ ఉందా? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చినా, ఆ హక్కులను కాపాడుకునే సామర్థ్యం అందరికీ సమానంగా ఉండదు.. అందుకే ప్రతి కేసును కోర్టులకు వదిలేయడం కంటే, మొదట్లోనే చట్టవిరుద్ధ కూల్చివేతలకు అవకాశం లేకుండా పారదర్శకమైన, దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలయ్యే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది.

-మహమ్మద్ ఆరిఫ్,

96184 00190

Next Story