- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget 2026: రక్షణకు ప్రాధాన్యం, వికాసానికి పరీక్ష
బడ్జెట్‌లో అంకెల గారడీలు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా.. మంచీ చెడులను నిరంతరం విశ్లేషించుకుంటూ, అవసరమైన చోట మార్పులను స్వాగతిస్తూ, ఆచరణలను ఉన్నతంగా మార్చుకుంటూ ముందుకు సాగిపోవాల్సిందే. ఈ బడ్జెట్‌లో గత ఏడాదితో పోలిస్తే రక్షణ రంగానికి 15% కేటాయింపులు పెంచడం పట్ల 'ఆపరేషన్ సిందూర్' ప్రాముఖ్యతను గుర్తిస్తూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు స్వీట్ వార్నింగ్‌గా చెప్పవచ్చు..

బడ్జెట్‌లో అంకెల గారడీలు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా.. మంచీ చెడులను నిరంతరం విశ్లేషించుకుంటూ, అవసరమైన చోట మార్పులను స్వాగతిస్తూ, ఆచరణలను ఉన్నతంగా మార్చుకుంటూ ముందుకు సాగిపోవాల్సిందే. ఈ బడ్జెట్‌లో గత ఏడాదితో పోలిస్తే రక్షణ రంగానికి 15% కేటాయింపులు పెంచడం పట్ల 'ఆపరేషన్ సిందూర్' ప్రాముఖ్యతను గుర్తిస్తూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు స్వీట్ వార్నింగ్‌గా చెప్పవచ్చు..
నవ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను సమకూర్చుకునే క్రమంలో సైనిక ఆధునికీకరణ అవసరమే.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘నేషన్ ఫస్ట్’ అనే నినాదాన్ని మరోసారి వెల్లడించింది. మనం బలంగా ఉండడం అనేది యుద్ధం చేయడానికా..? యుద్ధం ఆపడానికా..? అనేది కాలమే నిర్ణయిస్తుంది. అంతరిక్ష పరిజ్ఞాన పద్దుతో భవిష్యత్తులో ఇస్రో చేసే మానవ సహిత యాత్రలకు, రోదసీ కేంద్ర నిర్మాణానికి అనుకూలంగా పెట్టిన బడ్జెట్ కొంతవరకు మన సాంకేతిక అభివృద్ధిలో భాగమనే చెప్పవచ్చు..
విద్యకు కేటాయింపులు నిరాశాజనకం!
వైద్య రంగానికి కృత్రిమ మేధను అనువర్తిస్తూ బడ్జెట్ ప్రతిపాదన స్వాగతించదగినదే.. కానీ ఈ ప్రపంచాన్ని మార్చగల ఒకే ఒక ఆయుధం విద్య మాత్రమే అన్న నెల్సన్ మండేలా స్ఫూర్తి ఈ బడ్జెట్‌లో పెద్దగా కనిపించలేదనే చెప్పవచ్చు. స్టెమ్ రంగాల్లో చదువుకునే విద్యార్థినుల దృష్ట్యా జిల్లాకు ఓ వసతిగృహం ప్రకటన ‘బాలికా విద్య’ ప్రాముఖ్యతను గట్టిగానే సమాజానికి చెప్పింది. బయో ఫార్మా శక్తిగా భారత్ ఎదగాలనే ఆలోచన మంచిదే.. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీ పిస్తున్న వేళ 'కొంత రాజకీయ చతురతతో' కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు అర్థమవుతుంది. జనాకర్షక పథకాల ప్రకటనలకు దూరమైనప్పటికీ.. దీర్ఘకాలిక పురోగతి, ఉత్పాదకత పెంపుపై ప్రత్యేక దృష్టి, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం ఈ బడ్జెట్‌లో పొందుపరిచారు. మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు కేటాయించడం, టాక్స్ ఇయర్ విధానం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు వంటివి ఆహ్వానించదగ్గ పరిణామాలే..
రేర్ ఎర్త్ ఖనిజాలపై ప్రత్యేక దృష్టి..
ప్రపంచంలోని రేర్ ఎర్త్ ఖనిజాల నిల్వలో 8 శాతం భారత్‌లో ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకూ వీటిని తవ్వి తీసే ప్రాసెసింగ్ మన దగ్గర లేదు. దీనికై బడ్జెట్‌లో ‘ప్రత్యేకత’ ఉండడం ఓ మంచి పరిణామం. సెమీ కండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్స్, హరిత ఇంధనాలు, కర్బనాన్ని భూగర్భంలో నిలువ చేసే పరిజ్ఞానాలకు ప్రాధాన్యత ఇవ్వడం భవిష్యత్తు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ను అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశమే.. పరిశ్రమలతో విద్య అనుసంధానం ‘యూనివర్సిటీ టౌన్ షిప్స్’ ఆచరణలో ఎంత మాత్రం రాణిస్తుందో వేచి చూడాల్సిందే.. దివ్యాంగజన్ కౌశల్ యోజన.. కృత్రిమ మేధ సాయంతో కృత్రిమ అవయవాల తయారీని ప్రోత్సహించడం మానవీయ కోణమే. భారత్ నుంచి అంతర్జాతీయంగా డేటా సెంటర్ సర్వీసులను అందించే విదేశీ సంస్థలకు 20 ఏళ్ల పాటు పన్ను విరామం ప్రకటించడంలో భిన్న స్వరాల కార్పొరేట్ రాజకీయ వ్యూహాల మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్, ఎస్‌ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక కార్యచరణ ప్రవేశ పెట్టడం.. కొంతమేరకు సూక్ష్మ, మధ్య, చిన్న తరగతి పరిశ్రమలకు ఊతమనే చెప్పవచ్చు.. వ్యవసాయం, చేపల పెంపకం, పాడి పరిశ్రమల రాయితీలు.. భారత్ విస్తార్, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, జౌళి, క్రీడా సాధనాల ముడిపదార్థాల వంటి రంగాల్లో బడ్జెట్ కేటాయింపు పర్వాలేదనిపించింది. స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం ‘షీ మార్ట్’ల ఏర్పాటు అభినందనీయం.
ఆచరణలో నిబద్ధత చూపాలి!
దశాబ్ద కాలంగా మన దేశంలోనే కాక.. ప్రపంచంలో సైతం మోడీ నాయకత్వ ప్రతిభా చిహ్నాలు బలంగానే కనిపిస్తున్నాయి. అందుకే వరుసగా మూడోసారి మనదేశంలో మెజారిటీ ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ట్రంప్ సుంకాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక ధోరణులు, ఆధిపత్య అగ్రరాజ్యాల యుద్దాల కవ్వింపు చర్యలు, పర్యావరణంలో కాలుష్య పెను మార్పుల వంటివి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ’ మంత్రంతో.. అభివృద్ధికి ఊతమిస్తూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో.. ప్రగతి పథంలో అందరినీ కలుపుకొని వెళ్లడం అనే మూడు కర్తవ్యాలతో 2047 లక్ష్యంగా ముందుకు వెళ్లడం ఆహ్వానించదగ్గ పరిణామం అయినప్పటికీ... ఆచరణలో అదే నిబద్ధత, అంకిత భావం రాజకీయాలకు, కుల మత ప్రాంత అంతరాలకు అతీతంగా ఉండాలనీ ఆశిస్తూ.. వీలైనంత త్వరలోనే అభివృద్ధి భారతంలో మనమంతా జనగణమన పాడుదామని ఆకాంక్షిద్దాం.
- ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536






