క్యాంపస్‌లో క్రూరత్వం.. విద్యా వ్యవస్థపై మచ్చ!

by Ravi |   (  Updated:2026-03-20 01:00:14  IST  )

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటన ర్యాగింగ్ భూతం ఎంత భయంకరమో బయటపెట్టింది. విద్యాసంస్థల్లో భద్రత, నైతిక విలువల అవసరాన్ని ఈ ఘటన గట్టిగా గుర్తు చేస్తోంది.

క్యాంపస్‌లో క్రూరత్వం.. విద్యా వ్యవస్థపై మచ్చ!
X

భారతీయ విద్యా వ్యవస్థలో ర్యాగింగ్ అనేది ఒక కేన్సర్ గడ్డలా తయారైంది. జ్ఞాన సముపార్జన కోసం వెళ్లిన విద్యార్థులు, తోటి విద్యార్థుల క్రూరత్వానికి బలై శవాలుగా తిరిగి రావడం ఆధునిక సమాజానికి తీరని అవమానం. కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీవిద్య (22) ఆత్మహత్య ఉదంతం మరోసారి ఈ చర్చను తెరపైకి తెచ్చింది.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన శ్రీవిద్య, ఎన్నో ఆశలతో పై చదువుల కోసం వరంగల్ చేరుకుంది. కానీ, ఈ నెల 7వ తేదీన ఆమె తీసుకున్న ఎలుకల మందు, ఆమె ప్రాణాలనే కాదు, ఆ కుటుంబం పెట్టుకున్న కొండంత ఆశలను కూడా బలితీసుకుంది.

దొంగగా ముద్ర వేయడంతో..

యూనివర్సిటీ వేదికగా జరిగిన శ్రీవిద్య ఆత్మహత్య ఉదంతం కేవలం ఒక విద్యార్థిని బలవన‍్మరణం కాదు. అది మన విద్యా వ్యవస్థలోని కుళ్లును, నైతిక విలువల పతనాన్ని ఎత్తిచూపుతున్న పచ్చి నిజం. ఒక రైతు బిడ్డ, తోటి విద్యార్థినుల క్రూరత్వానికి బలై ‘ఎలుకల మందు’ తాగి తనువు చాలించడం ఆధునిక సమాజానికి తీరని అవమానం. తన బిడ్డ ఉన్నత చదువులు చదివి ప్రయోజకు రాలవుతుందని పెట్టుకున్న కొండంత ఆశలు ఇప్పుడు శ్మశానవాటికలో బూడిదయ్యాయి. శ్రీవిద్య రాసిన మరణ వాంగ్మూలం చదివితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జ్ఞాన సముపార్జన కోసం వెళ్లిన చోట ఆమెకు తోటి విద్యార్థుల నుండి కనీస మానవత్వం దక్కలేదు.. ఒక ల్యాప్‌టాప్, కొన్ని బంగారు ఆభరణాల దొంగతనం నెపాన్ని ఆమెపై నెట్టి, ఆరుగురు విద్యార్థినులు కలిసి చేసిన మానసిక దాడి ఆమెను ఆత్మహత్య దిశగా నెట్టింది. ఆరు మంది సీనియర్ విద్యార్థులు ఆమెను ఒక ‘దొంగ’గా ముద్ర వేసి, చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో పేరు పేరునా పేర్కొంది. ఉన్నత చదువులు చదువుతున్న యువతుల్లో ఇంతటి వికృత ఆలోచనలు రావడం సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ర్యాగింగ్ అనేది కేవలం శారీరక హింస మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే నిందారోపణలు కూడా మరణశాసనాలుగా మారుతాయని ఈ ఘటన నిరూపించింది.

ఐదు రోజులు నరకం అనుభవిస్తున్నా..

యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి విద్యాసంస్థలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్, కౌన్సెలింగ్ సెంటర్లు అత్యంత చురుగ్గా పనిచేయాలి.. కానీ కేయూ హాస్టల్స్ వద్ద శ్రీవిద్య ఐదు రోజుల పాటు నరకం అనుభవిస్తున్నా వార్డెన్లకు లేదా సెక్యూరిటీ సిబ్బందికి ఆ సమాచారం అందకపోవడం యంత్రాంగం నిద్రపోతోందని స్పష్టం చేస్తోంది. యూని వర్సిటీ అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి.. దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే, ఏటా 3,500 పైగా ర్యాగింగ్ ఫిర్యాదులు నమోదవు తున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ముందుండటం గమనార్హం. ముఖ్యంగా తెలంగాణలో గత మూడేళ్లలో ర్యాగింగ్ వల్ల ఐదుగురు విద్యార్థులు బలవన్మరణం చెందడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ర్యాగింగ్ నిరోధక చట్టం-1997 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. శ్రీవిద్య కేసులో నిందితులపై ఐపీసీ సెక్షన్ 306 ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మార్పు చట్టాల్లో కాదు.. సంస్కృతిలో రావాలి!

శ్రీవిద్య మరణం వ్యవస్థ ముందు ఒక పెను సవాలును ఉంచింది. ప్రతి విద్యార్థికి తన ప్రాణాల కంటే విలువైంది ఏదీ లేదని చాటి చెప్పాల్సిన సమయం ఇది. యూనివర్సిటీ క్యాంపస్‌లు స్వేచ్ఛా వాయువులను పంచాలి తప్ప, యమపాశాలుగా మారకూడదు. ఒక సాధారణ రైతు కూలీనాలి చేసి బిడ్డను చదివిస్తుంటే, ఆ చదువులే ఆమె ప్రాణం తీయడం అత్యంత శోచనీయం. ఒక యువతి తన మరణ వాంగ్మూలంలో నిందితుల పేర్లను రాసిందంటే, ఆమె ఎంతటి మానసిక క్షోభను అనుభవించిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధి కారులు విద్యా సంస్థల్లో భద్రతపై తరచూ సమీక్షలు నిర్వహించి, బాధ్యులపై కనికరం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనలో బాధ్యులైన ఆ ఆరుగురు విద్యార్థి‌నులను విద్యాసంస్థ నుండి బహిష్కరించడంతో పాటు చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. అప్పుడే భవి ష్యత్తులో ఏ విద్యార్థిని కూడా శ్రీ విద్యలా నిశ్శబ్దంగా నూరేళ్ల జీవితాన్ని ముగించుకోదు.. మార్పు అనేది చట్టాల్లోనే కాదు, విద్యాసంస్థల సంస్కృతిలోనూ రావాలి. శ్రీవిద్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి తగిన న్యాయం జరగాలని ఆశిద్దాం.

- పురుషోత్తం నారగౌని

88973 88393

Next Story