BRS Candidates ల ప్రకటన.. వ్యూహాత్మకమా, ఆత్మరక్షణా?

by Disha edit |
BRS Candidates ల ప్రకటన.. వ్యూహాత్మకమా, ఆత్మరక్షణా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసింది. ప్రభుత్వ పరంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం లభించింది. త్వరలోనే పార్టీ పరంగా కూడా గడపగడపకు బీఆర్ఎస్ అంటూ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలతో ఉన్నట్టు తెలుస్తుంది. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే అంచనాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ముచ్చటగా మరోసారి అధికారం సాధిస్తామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్... ఎన్నికల కసరత్తును మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే బరిలో నిలవనున్న గెలుపు గుర్రాలపై సర్వేలు నిర్వహించిన గులాబీ పార్టీ... ఆగస్టులో అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించేలా... బీఆర్ఎస్ కసరత్తును ముమ్మరం చేసింది. పోటీ చేసే వారిలో ఎక్కువమందిని ప్రకటించడం ద్వారా... ఎక్కడైనా సమస్యలు వస్తే పరిష్కరించుకునేందుకు తగిన సమయం ఉంటుందని భావిస్తోంది.

సర్వేలు, పనితీరు ఆధారంగా...

రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అసమ్మతి, ఇబ్బందులు లేని నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. దాదాపు 70 నుంచి 80 సీట్లను అగస్టులో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 2018 లో ముందస్తు ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్, టీడీపీతో పాటు ఒకరు ఫార్వర్డ్ బ్లాక్, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచిన వారు బీఆర్ఎస్‌లో చేరారు. వీరందరికీ బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గత ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సంప్రదించిన తర్వాతే వీళ్లకు టికెట్లు ఇస్తారనే చర్చ జరుగుతున్నది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం ఆగస్టు మూడో వారంలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. పలుదఫాల సర్వేల తర్వాత ఎక్కువ మంది అభ్యర్థుల విషయంలో... తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధిక మాసం ముగియగానే తొలివిడతగా సింహభాగం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా అప్రతిష్ఠ పాలుకావడం, నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులను పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత ఉందనుకున్న వారి స్థానాలను మినహాయించి మిగతా చోట్ల మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ అధినేత ఆరు నెలల ముందే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే యోచనలో ఉన్నారు. ఆ లిస్టు తర్వాత వారం, పది రోజుల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. గతంలో చెప్పినట్టుగానే ఇందులో 80 నుంచి 90 శాతం సిట్టింగులకే ఛాన్స్ ఇవ్వనున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. 8 నుంచి 15 సీట్లలో అభ్యర్థులను గులాబీ బాస్ మార్చుతారని సమాచారం. అలాగే గతంలాగే.. ఇప్పుడు కూడా పొత్తులు లేకుండా సింగిల్‌గానే బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది.

పద్ధతి మార్చుకోకుంటే అంతే...

ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకున్న సీఎం కేసీఆర్.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పని తీరును దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. అందులో పని తీరు బాగోలేని కొంత మందిని ఇప్పటికే హెచ్చరించిన కేసీఆర్.. పద్ధతి మార్చుకోని వారికి ఈసారి అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. సిట్టింగ్‌లకే మరోసారి ఛాన్స్ ఇస్తుండటంతో.. ఈసారైనా టికెట్ దక్కకపోతుందా అన్న ఆశతో ఎదురు చూస్తున్న వారు తిరగబడే ఛాన్స్ లేకపోలేదు. టికెట్ దక్కని ఆశావహులు.. అసంతృప్తితో రెబల్స్‌గా మారటమో.. లేదా పక్క పార్టీకి జంప్ చేసి పోటీలో నిలబడటమో చేసే అవకాశం ఉంది. అలాంటివి ముందే ఊహించిన కేసీఆర్.. ఎన్నికల సమయం వరకు వాళ్లను బుజ్జగించటమో.. లేదా బరిలో నిల్చున్న వారి ప్రభావం లేకుండా చేయటమో చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అదే కరెక్ట్ సమాయానికి ప్రకటిస్తే.. ఇలాంటివి ఏమీ చేయలేమని.. ముందే జాబితా ప్రకటిస్తున్నారని సమాచారం. అయితే.. గతంలోనూ ఇదే పద్ధతిని అమలు చేసిన కేసీఆర్.. అందులో సక్సెస్‌ కావటంతో.. ఈసారి కూడా అదే ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే రిపోర్టులు తెప్పించుకున్న కేసీఆర్.. పార్టీ బలంగా ఉన్న చోట్ల భారీ మెజార్టీని, కొంచెం బలహీనంగా ఉన్న చోట బలపరిచేందుకు.. వ్యతిరేకత ఉన్న చోట ఆ ప్రభావం పోయేలా సమీకరణాలు రచిస్తున్నారు కేసీఆర్. ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచార పర్వాన్ని ప్రారంభించి.. జనాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కొంప ముంచేది సిట్టింగ్ లేనా?

సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలాంటివారికి ఈ దఫా ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కడం కష్టమే. మరోవైపున దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి మొదటి దశగా ఉపయోగించుకున్నట్టు టాక్ కూడా గట్టిగా నడుస్తోంది. అయితే.. ప్రధాన ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా.. ఈసారి కూడా అధికారంలోకి వచ్చి.. హ్యాట్రిక్ కొట్టాలన్న కచ్చితమైన ప్లాన్‌తో గులాబీ బాస్ ముందుకెళ్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. అందులో భాగమే.. ఈ అభ్యర్థుల జాబితా ప్రకటన నిర్ణయం. కనీసం మూడు నెలల ముందు ప్రకటించడం ద్వారా అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండేలా అవకాశం కల్పించాలనుకుంటున్నారు. లాస్ట్ మినిట్‌లో ఎవరైనా వెనుకబడినట్లుగా అనిపిస్తే కొత్త వారికి బీ ఫాం ఇవ్వవొచ్చన్న ప్లాన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఎవరికి టిక్కెట్లు ఉంటాయో.. ఎవరికి ఉండవో.. కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యత బట్టి వారికి అక్కడి ఎమ్మెల్యేలకు క్లారిటీ వస్తోందంటున్నారు. ఏది ఏమైనా పార్టీలో ఆశావహులను, ఆసమ్మతినేతలను సమన్వయ పరచడం అసిధారావ్రతమే. ముందస్తు అభ్యర్థుల ప్రకటన వ్యూహంగా చూస్తే మిగతా పార్టీలపై ఒత్తిడి తెచ్చే చర్య అత్మ రక్షణగా చూస్తే ఆశావహులు అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ కడదాకా తమతో ఉంచుకునే ప్రయత్నంగా చూడవచ్చు. దీనిద్వారా ఆభ్యర్దుల వలసలను అరికట్టి ఇతర పార్టీల ఎత్తుగడకు అడ్డుకట్టగా ఈ ప్రక్రియను అవలంబిస్తున్నట్లుంది అని విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ఈ దఫా ఎన్నికల్లో గెలుపు అధికార పార్టీకి నల్లేరు మీద నడకలా ఉండబోదన్నది ఖాయం.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story

Most Viewed