కరెంట్ ఇవ్వలేదన్నరు.. మరి రికార్డు పంటలెలా పండినయ్?

by Ravi |   (  Updated:2025-05-30 01:15:30  IST  )

తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. వాతావరణం అనుకూలించడం, కాంగ్రెస్ ప్రభుత్వ సానుకూల

కరెంట్ ఇవ్వలేదన్నరు.. మరి రికార్డు పంటలెలా పండినయ్?
X

తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. వాతావరణం అనుకూలించడం, కాంగ్రెస్ ప్రభుత్వ సానుకూల విధానాలతో 2024-25లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని రాష్ట్ర అర్థ గణాంక శాఖ తెలిపింది. 2023-24లో 168.75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ.. 2024-25లో దాన్ని అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించి దేశాన్ని అబ్బురపరిచిందని ఈ నివేదిక తెలుపుతున్నది. దీంతో దేశంలోనే అత్యధికంగా వరి పండి స్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

తెలంగాణలో 2024-25 వానాకాలం, యాసంగి పంట సీజన్లలో అన్ని పంటల లక్ష్యం 269.37 లక్షల టన్నులు కాగా, 297.79 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తులు వచ్చాయి. ఆశించిన లక్ష్యాల్ని మించి ఈ సారి 28.42 లక్షల టన్నుల అధికంగా దిగుబడులు వచ్చాయి. వరి 222.75 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా, 274.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. మొక్కజొన్న 27.30 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా, 35.05 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. జొన్న 1.60 లక్షల టన్నుల దిగుబడి లక్ష్యం పెట్టుకోగా, అది 3.32 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.

రైతులు వ్యవసాయాన్ని మానేశారా...?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాకతో రైతులందరూ కష్టాలు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఇన్నాళ్లూ ప్రచారం చేస్తున్నారు. రైతులకు కరెంట్‌ ఉండటం లేదని, ప్రాజెక్టుల కింద నీళ్లు ఇవ్వటం లేదని దీంతో పంటలు ఎండిపోతున్నాయని అవాస్తవాలు ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాతే రైతులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టినట్లు, అంతకుమునుపు రైతులకు వ్యవసాయమంటే ఏమిటో తెలియనట్లు, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోవడంతో రైతులు వ్యవసాయాన్ని మానివేసినట్లు ప్రగ ల్భాలు పలికారు. మరి ప్రభుత్వం వ్యవసాయాన్ని పట్టించుకోకపోతే, రైతులకు సరిపడా కరెంట్‌ ఇవ్వకపోతే ఈ విధంగా రికార్డు స్థాయి దిగుబడులు ఎలా సాధ్యమవుతాయి?

రాష్ట్ర చరిత్రలో అత్యధిక పంటలు..

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 29 లక్షల ఎకరాలు వ్యవసాయ బోర్ల ద్వారా పండిస్తున్నారు. ఈ బోర్లకు నిరంతరాయంగా ఉచిత కరెంట్‌ను సరఫరా చేయటంతో తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా పంటలు పండాయి. తెలంగాణ చరిత్రలో అధికంగా 2025 మార్చి 20న 17,162 మె.వా. కరెంట్‌ డిమాండ్‌ నమోదైంది. అయినా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం కరెంట్‌ను అందిం చింది. కరెంట్‌ ఉన్నా లేదని, పవర్‌ కట్‌లు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు అబద్ధాలు ఆడారు. ఈ రికార్డు స్థాయి ధాన్యం దిగుబడులతో రైతు సంక్షోభం అనేది బీఆర్‌ఎస్‌ సృష్టి అని తేలిపోయింది.

కాళేశ్వరం వట్టిపోయినా..

2014లో 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉండగా, ప్రస్తుతం అవి 29 లక్షలకు చేరాయి. వ్యవసాయ బోర్ల కారణంగానూ, వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులు నిండటంతో రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెరిగితే, కాళేశ్వరం వల్లే వ్యవసాయం దిగుబడులు పెరిగాయని ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌ ప్రజలను మభ్యపెడుతూ వచ్చింది. ఇప్పుడు లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఎందుకు పనికిరాకుండా పోయింది. అయినా, రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులు వచ్చాయంటే అది కాళేశ్వరం మహిమ కాదని ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నాయకులు గుర్తించాలి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడంతో బియ్యాన్ని ఇతర దేశాలకు తెలంగాణ ఎగుమతి చేస్తున్నది. తొలివిడతగా 12,500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేశారు. ఏటా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్‌ అంగీకరించింది.

కొనుగోలు గతం కంటే ఎక్కువే!

కాంగ్రెస్‌ ప్రభుత్వం క్వింటాల్ సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వడంతో రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం వైపు రైతులు అధికంగా మొగ్గు చూపారు. గత వానాకాలం సీజన్‌లో రూ.1206.44 కోట్లను రైతులకు ప్రభుత్వం బోనస్‌గా చెల్లించింది. దీంతో రైతులకు ఎకరాకు ఒక్కో సీజన్‌కి రూ.10వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.20వేలకు పైగా అదనంగా ఆదాయం సమకూరుతోంది. పైగా రైతులకు కావాల్సిన ఎరువులను, విత్తనాలను సైతం ప్రభుత్వం సరఫరా చేసింది. ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకు విత్తనాలను రైతుల ఇంటికే అందించడంతో రైతులు సకాలంలో పంటలు వేసుకోవడానికి సాధ్యమైంది. దీంతో 2022-23 రబీలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 36.63 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా, ఈ రబీ సీజన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 60.61 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇది గతంతో పోలిస్తే దాదాపు 20 లక్షల టన్నుల మేర అధికంగా వడ్లు కొనుగోలు చేసింది. అయినా, కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయటం లేదని బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తోంది.

వరి దిగుబడిలో దేశంలోనే టాప్

పంజాబ్‌ రాష్ట్రం వరి ధాన్యం దిగుబడిలో దేశంలో ఇన్నాళ్లు అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది. ఆ రాష్ట్రాన్ని తోసిరాజని తెలంగాణ రాష్ట్రం ధాన్యం దిగుబడిలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలబడి అన్నపూర్ణగా నిలిచింది. తెలంగాణ తరువాత ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాలు వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. బడ్జెట్‌లో అత్యధిక శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి కేటాయించింది. దీని ఫలితంగా వ్యవసాయ రంగం వృద్ధితో పాటు గ్రామాల పురోభివృద్ధి సైతం సాధ్యపడుతుంది.

మామిడాల శ్రీధర్,

తెలంగాణ సీఎం పీఆర్ఓ

Next Story