అన్నలూ.. అక్కలూ.. ముందుండి నడిపించండి!

by Bhoopathi Nagaiah |

"జన జీవన స్రవంతి" లో అన్నలు చేరాలని, ప్రభుత్వం సహా, అందరూ కోరుకుంటున్నారు. కానీ భూస్వామ్య వ్యవస్థ నాటి దారుణాలు ఇప్పటికీ నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

అన్నలూ.. అక్కలూ.. ముందుండి నడిపించండి!
X

"జన జీవన స్రవంతి" లో అన్నలు చేరాలని, ప్రభుత్వం సహా, అందరూ కోరుకుంటున్నారు. కానీ భూస్వామ్య వ్యవస్థ నాటి దారుణాలు ఇప్పటికీ నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఐతే, ఇవి తడి గుడ్డతో గొంతులు నరకడం లాంటివి. మనం నిత్యం దర్శించే మాల్స్‌లో, హోటల్స్ లో సినిమా థియేటర్స్ లో కనీస వేతనం ఒకటి ఉందనేదే తెలియని, రోజుకి 10 గంటల వరకు పనిచేసే ఉద్యోగులను చూసినా మనకి చీమ కుట్టినట్టేనా ఉండదు. పరాయి రాష్ట్రాల నుంచి వచ్చి మన గేటెడ్ కమ్యూనిటీస్ లో కాపలాలు కాసే, గృహాల నిర్మాణంలో కఠినమైన పనులు చేసి ఆ వాహనాల్లోని నిద్రపోయే వారు‌ మనకి లెక్కలోకి రారు. అందరికీ తెలిసిన విషయాలే.

నేనెందుకు ఇలా చెప్పుకుంటూ పోవడం.‌ మనదీ సభ్య సమాజం అనుకోవడం ఆత్మవంచన. ఉద్యోగ జీవిత ప్రారంభంలో ఒక కార్మిక సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా, తరువాత కార్మిక నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్ర కార్మిక విద్యా సంస్థలో కార్మిక విద్యాధికారిగా, తదనంతరం కార్మిక రాజ్య బీమా సంస్థలో ఉపనిర్దేశకుడిగా చేరి నిర్దేశకుడిగా పదవీ విరమణ చేసిన అనుభవంతోనూ, ఇప్పటికీ నాకు తారసపడే కార్మికుల స్థితిగతుల గురించి తెలుసుకుంటున్న వాస్తవాల ప్రాతిపదికగా చెబుతున్నాను. మనదేశంలో శ్రమజీవులలో అత్యధికులు ఇప్పటికీ అరకొర బ్రతుకులే‌ ఈడుస్తున్నారు.

చేజేతులారా చేసుకున్నాం..

కొంత చేజేతులారా చేసుకున్నదీ ఉంది. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.‌ కీలక రంగాలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటే, వనరుల దుర్వినియోగం తగ్గి, ప్రాంతీయ అసమానతలు తొలగి, లాభాలకంటే ప్రజాహితమే పరమావధియై, ఆర్థిక అభివృద్ధిఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయనీ కలగంది. చెప్పక తప్పదు.‌ వ్యవస్థీకృత రంగంలో అప్పట్లో పటిష్టంగా ఉన్న కార్మిక సంఘాలు, పరిశ్రమలను సమర్థవంతంగా నిర్వహించవలసిన యాజమాన్యాలు ఈ లక్ష్యానికి తూట్లు పొడిచాయి. భోజన విరామం ముగిసి గంట దాటుతున్నా, పనిలోకిరాని కార్మికులని, సూపర్‌వైజర్లు బతిమాలడం‌, పనివేళల ప్రారంభం దాటిన తర్వాత తీరికగా క్వార్టర్స్ నుండి ఆఫీసులకు బయలుదేరుతున్న ఉద్యోగులను, నా కళ్ళారా చూ‌సాను.

ఉద్యోగ సంఘాల నిర్వాకం

కార్మిక రాజ్య బీమా సంస్థకు చందా బకాయిలు చెల్లించనందుకు ప్రాసిక్యూట్ చేస్తామని చెప్తే, "అంతకంటేనా. గదిలో ఒక కిటికీ తెరకు చిన్న కన్నం పడితే, ఆ విశాలమైన గదిలోని మొత్తం తెరలన్నీ మార్పించిన మేం, ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని కారణంగా నిత్యం ఉద్యోగుల కోపతాపాలు భరిస్తున్నాం. మీరు చెరసాలకు‌ పంపితే కొంత మనశ్శాంతయినా దక్కుతుంది" అన్నవారు సామాన్యులు కారు. పలు కర్మాగారాలు తమ అధీనంలో ఉన్న ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నతాధికారి. ఇంక బహుపటిష్టమైన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిర్వాకం లోకవిదితం.

పోరాడినా, ఎవరి కుంపటి వారిదే..

ఒకసారి ఒక మండల ‌ కార్యాలయంలో కార్మిక విద్యాకార్యక్రమం‌ నిర్వహించినప్పుడు అక్కడి రహదారి బంగ్లాలో బస చేసాను.‌ ఒక్కడినే ఉన్నాను.‌ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు తలుపు తడితే, ఏమి జరిగిందోనని త్వరగా తీసాను.‌ “మా సమ్మె మొదలైంది.‌ నేను డ్యూటీ దిగిపోతున్నాను. తీసుకోండి" అంటూ కాపలాదారు తాళాలు నా చేతుల్లో పెడితే, నివ్వెరపోయాను. అంత పటిష్టమైన ప్రభుత్వ, ప్రభుత్వ అధీనంలో‌ ఉన్న సంస్థల ఉద్యోగుల సంఘాలకు తమ‌ సభ్యులను అవినీతికి దూరంగా ఉంచాలని, సంక్షేమ పథకాల‌ ప్రయోజనాలు‌‌ పౌరులకు సక్రమంగా అందేలా, కార్మిక శాసనాలు ఖచ్చితంగా అమలయ్యేలా‌ చూడాలని, పౌరసేవల పరాయీకరణ (ఔట్ సోర్సింగ్ ) తీవ్రంగా ప్రతిఘటించాలని తోచదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, పోరాడినా, ఎవరి కుంపటి వారిదే. కార్మిక శ్రేయస్సుకన్నా, రాజకీయ ప్రయోజనం మిన్న.

ఎవరికీ పుట్టని బిడ్డలు వాళ్లు

ఇక అసంఘటిత రంగ కార్మికులు ఎవరికీ పుట్టని బిడ్డలు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మొత్తం కార్మిక వర్గంలో వీరి శాతం సుమారు 45. మరికొన్ని విశ్లేషణల ప్రకారం ఈ సంఖ్య 85.‌ ఇక వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికుల సంఘాలు ఉన్నా నామమాత్రమే. భూసంస్కరణలు, వ్యవసాయ రంగంలో కూడా స్త్రీ కార్మికులకు సమాన ప్రతిఫలం మొదలుకొని, వెట్టిచాకిరీ నిర్మూలన, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ రద్దు లేదా నియంత్రణ,అంతర్-రాష్ట్ర వలస కార్మికుల ఉపాధి, సేవానబంధనల నియంత్రణ, ఇత్యాది పురోగామి చట్టాలలో కొన్నిటిని అటక మీదనుంచి దింపాలి. పర్యావరణానికి కలుగుతున్న ముప్పు గురించి, అందువల్ల బాధితులవుతున్న గిరిజనుల గురించి మీకే ఎక్కువ తెలుసు.

రాజ్యాంగాన్ని విఫలం చేసింది మనమే..

మన రాజ్యాంగంలో చేర్చిన సామ్యవాద సమాజ సాధనకు దోహదంగా రూపొందించిన అనేక శాసనాల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతున్నా ఎవరికీ పట్టదు. పాలకులకేమో స్థూల జాతీయోత్పత్తి పెంచడమే ప్రధానం కానీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కాదు. "ఈ పరిస్థితి మారేది కాదు" అన్న నిస్పృహలో ఉన్న నాలాంటి వారికి అన్నలు, అక్కలు, అమ్ములను విడిచిపెట్టడం క్రొత్త ఉత్సాహాన్నిస్తోంది. రాజ్యాంగాన్ని మనం విఫలం చేసాము గాని, రాజ్యాంగం మనల్ని విఫలం చేయలేదు. దయచేసి మీరు మా మందలో గొర్రెలా చేరకండి.‌ రాజ్యాంగం లక్షించినట్టు మన దేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా రూపొందించే దీక్ష వహించండి. ముందుండి మిమ్మల్ని నడిపించండి.

మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story