- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా నుంచి మేధో వలసలు.. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటుందా?
ఇటీవలి కాలంలో, అమెరికా నుండి అనేక మంది విద్యావేత్తలు ఇతర దేశాలకు వలస వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఇటీవలి కాలంలో, అమెరికా నుండి అనేక మంది విద్యావేత్తలు ఇతర దేశాలకు వలస వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నేచర్ మ్యాగజైన్ నిర్వహించిన ఇటీవలి సర్వే ప్రకారం, అమెరికాలో బ్రెయిన్ డ్రెయిన్ ఇప్పటికే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. 75 శాతం మంది శాస్త్రవేత్తలు తమకు అవకాశం దొరికిన వెంటనే వలస వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అసాధారణ ప్రతిభావంతులైన విద్యావేత్తలను భారత్‌కు రప్పించడంపై త్వరిత నిర్ణయాలు అమలు చేస్తే ట్రంప్‌కు బుద్ధి చెప్పినట్లు అవుతుంది. దీంతో భారతదేశం మేధావులతో నిండిపోవడమే కాదు... భారత్ కూడా గొప్ప ఆవిష్కరణల దేశంగా ఎదుగుతుంది.
అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి..
1933లో జర్మనీ నుండి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు వలస వెళ్లడం ప్రారంభమైంది. వారు ప్రధానంగా అమెరికా, పశ్చిమ ఐరోపాకు వెళ్లారు. ఈ వలసలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమ ఐరోపా, అమెరికా అభి వృద్ధిలో గణనీయమైన ప్రభావం చూపాయి. వారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జేమ్స్ ఫ్రాంక్, ఎర్విన్ ష్రోడింగర్ మొదలైన వారు వలస వెళ్లిన దేశాల్లో వారు చేసిన పనికి నోబెల్ బహుమతిని పొందారు. యూకే, అమెరికాలో వారి స్వీకరణకు ప్రత్యేకంగా స్థాపించిన సంస్థలు సహాయపడ్డాయి. యుద్ధానంతర కాలంలో అమెరికా, పశ్చిమ ఐరోపాలో ఆవిష్కరణ సంస్కృతి వేగంగా ఆర్థిక వృద్ధికి దారి తీసింది. వలసదారులే దీనిలో కీలక పాత్ర పోషించారు. కొందరు విద్యావేత్తలు భారతదేశానికి కూడా వలస వచ్చారు. అందులో మాక్స్ బోర్న్ ఒకరు. ఆయన సి.వి. రామన్ ఆహ్వానంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఆరు నెలలు గడిపారు. అదే విధంగా, పండిత్ మదన్ మోహన్ మాలవీయ జర్మనీలోని మేధావుల దీనస్థితిని గుర్తించి, వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని ఊహిం చారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను కొత్తగా స్థాపించబడిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. వారిద్దరూ సమకాలీన పరిస్థితిని అసాధారణమైన దూరదృష్టితో గుర్తించి, తమ సంస్థలకు అత్యుత్తమ వ్యక్తులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండేవారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే..
అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, సైంటిస్టులు డొనాల్డ్ ట్రంప్‌తో వేధింపులు పడలేక విదేశాల్లో అవకాశాల కోసం వెతుకుతున్నారట. చైనా, యూరప్ దేశాలు వారికి స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే అమెరికాకు ప్రపంచంలో అత్యంత ఆవిష్కరణ-స్నేహ పూర్వక దేశంగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న స్థానం దెబ్బతినవచ్చని స్వతంత్ర విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా, ఐరోపాలోని దేశాలు అమెరికా నుండి బ్రెయిన్ డ్రెయిన్‌పై త్వరిత చర్యలు తీసుకున్నాయి. ఉదాహరణకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉన్నత మేధావులను ఫ్రాన్స్‌కు వలసరావాలని బహిరంగ ఆహ్వానం పంపారు. అందుకే మోడీ ప్రభుత్వం నిజంగా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఒక కొత్త, ఆవిష్కరణాత్మక విధానం రూపొందించి ప్రతిభావంతులైన విద్యావేత్తలను తిరిగి భారత్‌కు రప్పించడంపై త్వరిత నిర్ణయాలు అమలు చేస్తే ట్రంప్ కు బుద్ధి చెప్పినట్లు అవుతుంది. అలాగే భారత్ గొప్ప ఆవిష్కరణల దేశంగా ఎదుగుతుంది. మన యూనివర్సిటీ విద్యార్థులకు చక్కటి బోధన, రీసెర్చ్ స్కిల్స్ పెంచటానికి ఇదే మంచి అవకాశం ఉంటుంది. మన భారత దేశం శాస్త్ర-సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధి సాధించాలంటే ఇదే మంచి అవకాశం.
భౌగోళిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..
దశాబ్ద కాలంగా మన యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేక వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పరిశోధనలు మూలన పడి ఉన్నాయి. యూజీసీకి గ్రాంట్స్ తగ్గాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుండి తిరుగుముఖం పడుతున్న మేధో వలసలను మన దేశ అభి వృద్ధికి ఉపయోగించుకోవాలి. అయితే భారతదేశం ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రతిభావంతులైన విద్యావేత్తలను, అది కూడా తక్కువ సమయంలో స్వీకరించడానికి సిద్ధంగా ఉందా? అనేది ప్రశ్న. ఏదేమైనా భారత ప్రభుత్వం వెంటనే చొరువ తీసుకొని వారికి అవకాశాలు, వసతులు కల్పిస్తే విద్యారంగంలో వెనుకబడి ఉన్న మనదేశం శాస్త్ర - సాంకేతిక రంగాల్లో పుంజుకుంటుంది. ఇటువంటి అత్యుత్తమ వ్యక్తులను ఆకర్షించడం భారత ఆర్థిక వృద్ధిపై దీర్ఘకాలికంగా సానుకూల ప్రభావాన్ని చూపు తుంది. భారతదేశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? లేక మరోసారి దానిని జారవిడిచి పెడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,
98493 28496






