దేశ సంపద రోజుకు 1500 కోట్లు ఖాళీ!

by Disha edit |
దేశ సంపద రోజుకు 1500 కోట్లు ఖాళీ!
X

జానా ఖాళీ అవుతున్నప్పటికి కేంద్రానికి ఫికర్ లేదు. వారి అడ్డగోలు ఖర్చులకు అదుపులో ఉండటం లేదు. అందులో పొదుపు ముచ్చట అసలే కనిపించదు. అంతా రాజరికం, నో డెమోక్రసీ, అంతా, అన్ని చోట్ల నియంతృత్వమే. భారతదేశం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆరోగ్యకరంగా లేదు. ప్రభుత్వ జమా ఖజానా నుంచి రోజుకు 1500 కోట్ల రూపాయలు ఖాళీ అవుతున్న పరిస్థితి ఉంది. 2022 అక్టోబర్‌లో 53,44,000 కోట్లు ఉన్న జమా ఖజానా ఇప్పుడు 46,52,000 కోట్లకు తగ్గింది. గౌతమ్ అదాని స్కాంల ప్రభావం కూడా దేశ ఆర్థిక పరిస్థితి‌పైన పడింది. ఎల్‌ఐసీ 50,000 కోట్లు మునిగే పరిస్థితి వచ్చింది. అదాని కంపెనీ‌లలో షేర్స్ దెబ్బ ఎస్‌బీఐకి కూడా పడింది. అయినా కేంద్రం అదాని మీద జేపీసీ‌కి సిద్ధం కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసే ఎక్స్పర్ట్ కమిటీ మీదే అందరికీ నమ్మకం, చూపు ఉంది.

35 కోట్ల అసంఘటిత కూలీలు

విపక్షాలను ఐక్యం కాకుండా కేంద్రం ఈడీ, ఐటీ, సీబీఐ దాడులను వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా మొదలు పెట్టింది. ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక, రాజస్థాన్, తదితర రాష్ట్రాల మీద బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం అయిపోయింది. దేశంలోని 28 రాష్ట్రాల్లోని, 700 జిల్లాలలో 320 జిల్లాలు నిరుద్యోగులతో హోరెత్తుతున్నాయి. 122 జిల్లాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ 80 శాతం మందికి ఎలాంటి ఉపాధి లేదు. 2,61,437 గ్రామ పంచాయితీలలో 85 శాతం మందికి ఉపాధి లేదు. ఉపాధి హామీ కింద 27 కోట్ల మంది పేర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో మొత్తానికి పని లేని వారి సంఖ్య 18 కోట్లు ఉంటుంది. లక్షకోట్ల నుంచి బడ్జెట్‌ను 75 వేల కోట్లకు తగ్గించడంలో అంతర్యం ఏమిటో తెలియదు. వంద రోజుల పని ఎవరికి కూడా లభించే పరిస్థితి లేదు. మహిళలకు మాత్రమే 45 రోజులు, పురుషులకు 28 రోజులు పని లభించే పరిస్థితి ఉన్నది. దేశం విడిచి ఈ ఎనిమిది ఏండ్లలో అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా‌లకు 18 లక్షల మందికి పైగా వెళ్ళి, అక్కడే సెటిల్ అయిపోయారు. చదువు కోసం పోయి, ఉద్యోగాలు వెతుక్కుని, చివరికి అక్కడి పౌరసత్వం తీసుకునే పరిస్థితి ఉంది. 45 కోట్ల గ్రామీణ భారతం సంఖ్య ఇప్పుడు కరోనా అనంతరం ఉపాధి లేక 65 కోట్ల మందికి పెరిగే పరిస్థితి వచ్చింది. 35 కోట్ల మంది ఇందులో వలస, అసంఘటిత కూలిలే కావడం ఆందోళనకరం! ఇందులో కనీసం 5 కోట్ల మందికి కూడా పని దొరికే పరిస్థితి లేదు. 300 జిల్లాల్లో ఉన్న పేదరికం మీద అప్పుడప్పుడు పార్లమెంట్‌లో కూడా చర్చకు రావడం చూస్తుంటాము. ఎంపీల దత్తత గ్రామాల మీద కనీసం కన్ను‌వేయని ఎంపీలు దేశంలో 95 శాతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

బీజేపీ లక్ష్యమిదే

చిత్తశుద్ధి, నిజాయితీ లేని పాలకులకు ఒక నిర్ధిష్టమైన ఆర్థిక నీతి ఉండదు. 80 కోట్ల మంది పేదలకు తాత్కాలిక 5 కేజీ‌ల రేషన్ ఉచితంగా ఇవ్వడమే ఘనకార్యం అనుకునే వారిని ఏమనాలి. దేశంలో 1952 నుంచి పేదరికం నిర్మూలన నినాదం నేటికీ ఇస్తూనే ఉన్నారు. ఆ సంఖ్య తగ్గకపోగా, కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ లాంటి విధానాల వల్ల మధ్యతరగతి వారు పేదల జాబితాలోకి వచ్చేసారు. ఎగుమతి తగ్గి, దిగుమతి పెరిగి ప్రభుత్వం‌కు ఇటీవల నాలుగు ఏండ్లలో 9 లక్షల కోట్ల ఆదాయం‌కు గండి పడింది. ప్రభుత్వం ఆర్థిక నీతి పూర్తిగా దేశ తలసరి ఆదాయాన్ని పెంచే బదులు, తగ్గించేసింది. రైతుల మీద ప్రేమ నటించే కేంద్రం, వారి ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పింది. స్వయంగా పీఎం నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేశారు, కానీ ఉన్న ఆదాయం తగ్గి ఒకానొక సమయంలో రోజుకు 28 రూపాయలు మాత్రమే అయిన పరిస్థితిని చూశాము. ఇప్పుడు దేశం నిల్వ ఖజానా ఖాళీ అవుతున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగం, అధిక ధరలు, దేశాన్ని కుదిపివేసే పరిస్థితి ఉంది. అదాని స్కాం దేశం పేరును విదేశాల్లోనూ పరువు తీసింది. అయినా పీఎం మోడీ ఒక్క మాట మాట్లాడరు. బ్యాంకులు దివాళా తీసాయి. ఎన్‌పీఏ పెరుగుతూ పోతున్నది.12 లక్షల కోట్లు పెట్టుబడి దారులకు మాఫీ చేసారు. కాగ్ చెప్పినా, నీతి ఆయోగ్ సూచించినా వినలేదు. 10 లక్షల కోట్లకు పైగా 2000 రూపాయల నోట్లు కనబడతలేవు.. అయినా కేంద్రానికి పట్టదు. దేశం దివాళా తీస్తున్నా వారికి ఎన్నికలు, అధికారమే ముఖ్యం! విపక్షాల ముఖ్య నేతలను కేసులలో జైల్లో పెట్టేస్తే, చాలు ఏకచత్రాధిపత్యం చేయవచ్చు అనేది బీజేపీ లక్ష్యం మాదిరి కనిపిస్తున్నది. దేశంలో అతి సామాన్యులకు అర్థం అవుతున్న ఈ విషయం విపక్ష నేతలకు ఇంకా అర్థం కాక పోవడం ఆందోళనకరమైన విషయం!

ఎండి. మునీర్

సీనియర్ జర్నలిస్ట్

99518 65223


Next Story

Most Viewed